మహారాష్ట్ర రాజకీయాలు మరోసారి తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో వరుసగా అర్ధరాత్రి సమావేశాలు నిర్వహించడం రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త సమీకరణాలకు తెరలేపింది. ఎన్సీపీ సీనియర్ నేతలు ప్రఫుల్ పటేల్, సునీల్ తత్కరే సీఎంను కలిసిన మరుసటి రోజే, అజిత్ పవార్ కుమారుడు, ఎంపీ పార్థ్ పవార్ కూడా ఫడ్నవీస్ తో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అజిత్ పవార్ విమాన ప్రమాదంలో ఆకస్మికంగా మరణించిన తర్వాత ఆయన భార్య సునేత్రా పవార్ డిప్యూటీ సీఎం బాధ్యతలు చేపట్టారు.
Also Read : భక్తుల కోసమే కదిలి వచ్చిన జగన్నాథుడు..!
అయితే పార్టీలో ఆమె, ఆమె కుమారుడు పార్థ్ పవార్ ఆధిపత్యం పెరగడంపై ప్రఫుల్ పటేల్, సునీల్ తత్కరే తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. సునేత్రా పవార్ రాజీనామా చేసిన రాజ్యసభ స్థానానికి పార్థ్ పవార్ ను నామినేట్ చేయడం కూడా ఈ వివాదాన్ని మరింత పెంచింది. తమను పక్కన పెడుతున్నారని భావిస్తున్న సీనియర్లు.. పార్టీలో సరిదిద్దే చర్యలు అవసరమని బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు శరద్ పవార్ వర్గానికి చెందిన సీనియర్ నేత జయంత్ పాటిల్ కూడా అదే సమయంలో సీఎం ఫడ్నవీస్ ను కలవడం పెను సంచలనంగా మారింది.
Also Read : ఇప్పుడైనా ఆ పదవులు భర్తీ చేస్తారా..?
ప్రత్యర్థి వర్గాలకు చెందిన ముగ్గురు సీనియర్ నేతలు అర్ధరాత్రి వేళ ముఖ్యమంత్రిని కలవడం కేవలం కాకతాళీయం కాదని, రెండు ఎన్సీపీ వర్గాల విలీనం లేదా సరికొత్త కూటమి ఏర్పాటు కోసం లోపాయికారీ చర్చలు జరుగుతున్నాయనే అనుమానాలకు బలం చేకూరుస్తోందని జాతీయ మీడియా తెలిపింది. అంతర్గత సమాచారం ప్రకారం, ప్రఫుల్ పటేల్ మరియు సునీల్ తత్కరే తమతో పాటు కొంతమంది శరద్ పవార్ వర్గ నేతలను కూడా కలుపుకుని ఎన్డీయే కూటమిలోకి చేరేందుకు చర్చలు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ భేటీలు కేవలం పరిపాలనాపరమైనవని, రాజకీయ ప్రాధాన్యత లేదని సునీల్ తత్కరే సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. మరోవైపు శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే తాము ఇండియా కూటమితోనే ఉన్నామని స్పష్టం చేస్తూ విలీన వార్తలను కొట్టిపారేశారు.

