2019లో వైసీపీ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం.. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. ఎన్నికల్లో గెలిచిన తర్వాత పీకేను జగన్ పక్కన పెట్టారు. కానీ ఐ ప్యాక్ టీమ్‌తో బంధం కొనసాగించారు. ఐ ప్యాక్ వ్యూహాలు 2024 ఎన్నికల్లో ఫలితాలు ఇవ్వలేదు. పార్టీ ఘోరంగా ఓడిపోయింది. 2029లో గెలవాలంటే సరికొత్త వ్యూహాలు కావాలని ఇప్పటికే ఆ పార్టీ నేతలు అధినేత జగన్ మోహన్ రెడ్డికి సూచించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తు రాజకీయ సమరానికి సరికొత్త వ్యూహాలతో సిద్ధమవుతోంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎలాగైనా తిరిగి అధికారాన్ని హస్తగతం చేసుకోవడమే లక్ష్యంగా పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అడుగులు వేస్తున్నారు.
ఏపీలో ప్రస్తుతం అధికార కూటమి, వైసీపీ మధ్య రాజకీయ పోరు పతాక స్థాయికి చేరుకుంది. మరోవైపు తెర వెనుక వ్యూహాత్మక మార్పులు జోరందుకున్నాయి. ముఖ్యంగా రాబోయే ఎన్నికల కోసం బలమైన రాజకీయ వ్యూహకర్తను రంగంలోకి దించేందుకు వైఎస్ జగన్ మంత్రాంగం దాదాపుగా పూర్తి చేసినట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. తమిళనాడు రాజకీయాల్లో సంచలన విజయం నమోదు చేసిన సినీ నటుడు, తమిళగ వెట్రి కజగం.. టీవీకే అధినేత విజయ్ గెలుపు వెనుక చక్రం తిప్పిన మాస్టర్ మైండ్ కపిల్ సాహు ఇప్పుడు వైసీపీకి రాజకీయ వ్యూహాలు అందించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. పొరుగు రాష్ట్రంలో అద్భుత ఫలితాలు సాధించిన కపిల్ సాహు సేవలను ఏపీలో వైసీపీ కోసం వినియోగించుకోవాలని జగన్ మోహన్ రెడ్డి ప్రాథమికంగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు పార్టీ అంతర్గత వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
Also Read : ఇప్పుడైనా ఆ పదవులు భర్తీ చేస్తారా..?
2019 ఎన్నికల్లో ఘనవిజయం తర్వాత రుషిరాజ్ సింగ్ బృందం వైసీపీ తరఫున వ్యూహకర్తలుగా సేవలందించారు. 2024 ఎన్నికల ఫలితాల అనంతరం ఆ సంస్థతో ఒప్పందం రద్దు కావడంతో, భవిష్యత్తు పోరాటానికి కొత్త రక్తం, సరికొత్త ఆలోచనలు ఉన్న వ్యూహకర్త అవసరమని జగన్ భావించారు. మరోవైపు తెలుగుదేశం పార్టీకి వ్యూహాత్మక సలహాలు అందించేందుకు ఒక ప్రత్యేక బృందం ఇప్పటికే నిరంతరం క్షేత్రస్థాయిలో పనిచేస్తోంది. ఈ నేపథ్యంలో కూటమి సవాల్‌ను సమర్థవంతంగా ఎదుర్కొని, ప్రజా క్షేత్రంలో తిరిగి పట్టు సాధించడానికి సరికొత్త ప్రచార అస్త్రాలు అవసరమని వైసీపీ గుర్తించింది. ఈ క్రమంలోనే పలువురు జాతీయ స్థాయి వ్యూహకర్తలతో చర్చలు జరిపినప్పటికీ, చివరకు తమిళనాడులో విజయవంతమైన ఫార్ములాను అమలు చేసిన కపిల్ సాహు వైపే వైసీపీ అధిష్టానం మొగ్గు చూపినట్లు సమాచారం.
తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ఘనవిజయం సాధించడం వెనుక కపిల్ సాహు వ్యూహాలు పనిచేశాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. గతంలో ప్రశాంత్ కిశోర్ బృందంలో కీలక బాధ్యతలు నిర్వహించిన కపిల్ సాహు, ఆ తర్వాత బెంగళూరు కేంద్రంగా స్వంత వ్యూహాత్మక విభాగాన్ని ఏర్పాటు చేసుకున్నారు. తమిళనాడు ఎన్నికలకు రెండేళ్ల ముందు నుంచే క్షేత్రస్థాయిలోకి వెళ్లిన సాహు టీం, విజయ్‌ను ప్రజలకు దగ్గర చేయడంలో కీలక పాత్ర పోషించింది. ముఖ్యంగా సాంప్రదాయ ప్రచార శైలికి భిన్నంగా అత్యాధునిక డిజిటల్ ప్రచార పద్ధతులను కపిల్ సాహు రంగంలోకి దించారు. నియోజకవర్గాల వారీగా ప్రజల నాడిని పసిగట్టడం, సోషల్ మీడియా వేదికగా ప్రత్యర్థుల కంటే ఒకడుగు ముందే ఉండటం, ప్రజలతో నేరుగా మమేకమయ్యేలా సరికొత్త కార్యక్రమాలను రూపకల్పన చేయడం ద్వారా విజయ్ ఇమేజ్ అమాంతం పెంచేశారు. తమిళనాడులో ఇప్పటికీ సాహు సేవలను విజయ్ ఆయన కొనసాగిస్తుండటం ఆయన ప్రతిభకు అద్దం పడుతోంది.
Also Read : అదిరిపోయే మైలేజ్‌తో మార్కెట్‌లోకి కియా సిరోస్ ఎలక్ట్రిక్ కార్..!
వైసీపీకి కపిల్ సాహును అనుసంధానం చేయడంలో విజయ్, వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఉన్న ఉమ్మడి మిత్రులు కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే బెంగళూరు కేంద్రంగా వైసీపీ ముఖ్య నేతలు కపిల్ సాహుతో ప్రాథమిక చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. తాజాగా జరిగిన రెండో విడత చర్చల్లో పార్టీ ప్రచార సరళి, భవిష్యత్తు కార్యాచరణ, డిజిటల్ మీడియా వ్యూహాలపై ఇరుపక్షాల మధ్య ఒక స్పష్టమైన అవగాహన కుదిరినట్లు తెలుస్తోంది. జగన్ ఆలోచనలకు అనుగుణంగా ప్రజల్లోకి బలంగా వెళ్లేందుకు కపిల్ సాహు ఒక సమగ్ర ప్రణాళికను సిద్ధం చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
వ్యూహకర్త నియామకంతో పాటు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే జిల్లాల పర్యటనలకు రూట్ మ్యాప్ సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది నుంచి రాష్ట్రవ్యాప్తంగా భారీ పాదయాత్ర చేపడతానని ఇప ప్రకటించారు. ఈ పాదయాత్రను ప్రజల్లోకి మరింత సమర్థవంతంగా తీసుకెళ్లే బాధ్యతను కూడా కొత్త వ్యూహకర్త బృందానికే అప్పగించనున్నట్లు తెలుస్తోంది. కపిల్ సాహు అధికారికంగా బాధ్యతలు స్వీకరిస్తే, ఏపీలో డిజిటల్, క్షేత్రస్థాయి రాజకీయం మరింత రసవత్తరంగా మారే అవకాశం ఉంది. ఈ పరిణామాలు గమనిస్తుంటే, 2029 ఎన్నికల కురుక్షేత్రానికి వైసీపీ ఇప్పటి నుంచే సర్వసన్నద్ధమవుతోందని స్పష్టమవుతోంది.

