రాజకీయాల్లో ఎప్పుడూ కూడా ఒక బలమైన నేత కావాలనేది నిజం.. కచ్చితంగా అవసరం. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల్ని తట్టుకోవాలంటే ప్రాంతీయ పార్టీలకు దీటుగా కేంద్ర జాతీయ పార్టీలు అన్నీ ఒక బలమైన నేతను ఎంచుకోవాలి. గతంలో.. అంటే 2014కు ముందు.. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో అప్పట్లో వైయస్ రాజశేఖర్ రెడ్డి లాంటి లీడర్లు ఏపీకి అవసరమయ్యారు. అంతకు ముందు ఉన్న నేతలందరూ కూడా అంత.. బలమైన నేతలు కాకపోవడంతో ఒకవైపు అధికారం వచ్చినా అది ఎక్కువ కాలం నిలబడిన పరిస్థితులు కనిపించలేదు. దీంతో కొంతకాలం తర్వాత మెల్లగా బలమైన నేతలు కనిపించకుండా.. ఆ జాతీయ పార్టీలు కూడా రాష్ట్రాల్లో బలహీనమయ్యాయి.
Also Read : తమిళనాడు కేబినెట్ భేటీలో సంచలన వ్యాఖ్యలు..!
సరిగ్గా ఇప్పుడు బీజేపీ కూడా అలాంటి పరిస్థితుల్లోనే ఉంది. ప్రస్తుతం కేంద్రంలో బీజేపీ చక్రం తిప్పుతోంది. జాతీయ పార్టీగా ఉన్న బీజేపీకి ప్రస్తుతం దేశంలో చాలా రాష్ట్రాల్లో తిరుగులేదు. అయితే దక్షిణాదిలో మాత్రం బీజేపీ అంత తొందరగా పాగా వేసే పరిస్థితులు కనిపించడం లేదు. ఎందుకంటే బీజేపీ ఒకసారి రాష్ట్రంలో అడుగు పెట్టాలి.. అంటే తెలంగాణాలో కచ్చితంగా అధికారానికి రావాలంటే.. ఆ పార్టీకి మంచి ధీటైన నేత కావాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్‌లో రేవంత్ రెడ్డి లాంటి బలమైన నేత ఉన్నారో అలాంటి నేత ఇంచుమించుగా బీజేపీకి ఇప్పుడు అత్యవసరం.
తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని బీజేపీ బలంగా భావిస్తున్నది. కానీ నాయకత్వ లేమి పార్టీని వెనక్కు లాగుతుంది. బీజేపీ క్రౌడ్ పుల్లర్ లేకపోవడమే అసలు లోపం. తెలంగాణాలో ఓటు బ్యాంకు పెంచుకుంటున్నా దానిని పోలింగ్ బూత్ స్థాయికి తీసుకెళ్లే నాయకులు మాత్రం లేరు. కాంగ్రెస్, బీఆర్ఎస్‌లలో ఆ పరిస్థితి లేదు. కాంగ్రెస్‌లో రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ కేటీఆర్, హరీశ్ రావులు ఉన్నారు. కానీ బీజేపీలో అలా ప్రజలను తమ వైపునకు తిప్పుకునే అగ్రనేత ఎవరనేది మాత్రం ఎంత వెతికినా కనిపించటం లేదు. కిషన్ రెడ్డి సైలెంట్.. బండి సంజయ్ మాట జనాలకు ఎక్కటం లేదు. అలాగే లక్ష్మణ్ వంటి నేతలు జనాలను ఆకట్టుకోవటం లేదు.
గతంలో కంటే బీజేపీకి తెలంగాణాలో ఓటు బ్యాంకు పెరిగిందనేది సర్వే ఫలితాలు చెబుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనను చూసిన ప్రజలు ఒకసారి బీజేపీకి అవకాశమిస్తే తప్పేముందని భావించినా పెద్దగా ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు. క్రమేపీ తెలంగాణాలో బీజేపీ బలపడటానికి కేంద్రంలో ఉన్న మోదీ సర్కార్ కారణం. మరో వైపు హిందుత్వ నినాదం కూడా కొంత మేరకు కమలం పార్టీ బలం పెరగడానికి కారణం. రాష్ట్ర విభజన నాటి నుంచి శాసనసభ, పార్లమెంటు స్థానాల సంఖ్య పెంచుకుంటూ వస్తుంది. ఎనిమిది పార్లమెంటు స్థానాల్లో గెలవడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. కొన్ని కీలకమైన ప్రాంతాల్లో తన పట్టు పెంచుకుంటోంది.
Also Read : భక్తుల కోసమే కదిలి వచ్చిన జగన్నాథుడు..!
కానీ ఆ ఓటు బ్యాంకును పార్టీకి పదిలం చేసే నాయకత్వం మాత్రం తెలంగాణలో లేకపోవడమే ఇందుకు కారణం. ఆ ధైర్యంతోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణాలో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని హస్తినలోనే చెప్పేశారు. క్రౌడ్ పుల్లర్ లేకపోవడమే ఆ పార్టీకి తీరని లోటు. కొన్ని నియోజకవర్గాల్లోనే బలమైన నేతలున్నారు. అదీ కూడా కనీసం 30 స్థానాల్లోనే కొంత స్థానిక నాయకత్వం బలంగా ఉంది. మిగిలిన చోట్ల పార్టీని చూసి, కేంద్రంలో మోదీని చూసి ఓట్లు వేయాలి. పట్టణ ప్రాంతాల్లో అయితే ఓకే. కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న నియోజకవర్గాల్లో స్థానిక నాయకత్వం చూసి మాత్రమే ఓటు వేస్తారన్న అంచనా ఉండటంతో బీజేపీ ఇప్పుడు బలమైన నాయకుడు కావాల్సి ఉందని పార్టీ నేతలు, క్యాడరే భావిస్తున్నారు.
రాజకీయాల్లో ఎప్పుడూ ఏం జరుగుతుంది అనేది ఎవరు అంచనా వేయలేరు. ముఖ్యంగా ఒక పార్టీ అధికారంలో ఉండగా ఆ పార్టీని తొక్కి మరో పార్టీ అధికారంలోకి రావాలంటే దానికి ఎన్నో వ్యూహాలు, ఎంతో చాణక్యత, ఎన్నో అవసరాలు, పరిణామాలు కలిసి రావాలి. కానీ బీజేపీకి ఇప్పట్లో ఆ పరిస్థితులు ఉ న్నట్లు కనిపించడం లేదు. తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడాన్ని.. బీజేపీ చాలా ఈజీగా తీసుకుంటుంది. ఎంతో కష్టపడితే తప్ప కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలోకి రాలేదు. అలాగే అప్పట్లో బీఆర్ఎస్ చేసిన తప్పులు కూడా కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అయ్యాయి. కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు ఒకరకంగా ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన తల్లిలాంటిది. కాంగ్రెస్ అధికారంలోకి రావటానికి ఇదీ ఒక కారణం. అయితే ఇప్పుడు మాత్రం బీజేపీ అనుకుంటున్నట్టు వారి కలలు నెరవేరాలంటే మాత్రం ఒక బలమైన నేత కచ్చితంగా కావాలి. రేవంత్ అంత కాకపోయినా రేవంత్ లాంటి వ్యక్తి ఇక్కడ కచ్చితంగా అవసరం అనేది బీజేపీ నేతల భావన.

