ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్ళిపోయిన సంగతి తెలిసిందే. అందులో ప్రధానంగా చెప్పుకునే కంపెనీ అమర్ రాజా.. ఆ సంస్థ తెలంగాణాలో తమ తయారి యూనిట్ ను ప్రారంభించింది. ఈ తరుణంలో.. ఏపీ రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ మరియు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ చెప్పిన ఓ క్షమాపణ సంచలనంగా మారింది. ప్రముఖ పారిశ్రామికవేత్త మరియు మాజీ ఎంపీ జయదేవ్ గల్లాకు బహిరంగంగా క్షమాపణలు తెలియజేశారు.
Also Read : ఏపీలో ఎన్నికల సందడి.. మున్సి “పోల్స్”..!
గత ప్రభుత్వ హయాంలో అమరరాజా సంస్థ తీవ్రమైన రాజకీయ వేధింపులకు, ఇబ్బందులకు గురైందని ఆయన పేర్కొన్నారు. చట్టపరమైన చిక్కులు, వేధింపుల కారణంగా సొంత రాష్ట్రంలో ఆశించిన ప్రోత్సాహం దక్కక, అమరరాజా సంస్థ తన తదుపరి విస్తరణ కోసం ఇతర రాష్ట్రాల వైపు చూడాల్సి రావడం పట్ల ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా, దివిటిపల్లి వద్ద రూ. 9,500 కోట్ల భారీ పెట్టుబడితో ఏర్పాటు చేస్తున్న “అమరరాజా గిగా కారిడార్”లో మొదటి విడతగా కస్టమర్ క్వాలిఫికేషన్ ప్లాంట్ ను ప్రారంభించిన సందర్భంగా, మంత్రి లోకేష్ ట్విట్టర్ వేదికగా అమరరాజా గ్రూప్ కు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు.
Also Read : టీం ఇండియాలో కీలక మార్పులు..?
గత నాలుగు దశాబ్దాలుగా చిత్తూరుతో పాటు ఆంధ్రప్రదేశ్ కీర్తిని ప్రపంచవ్యాప్తం చేయడంలోనూ, వేలాది మందికి ఉపాధి కల్పించడంలోనూ అమరరాజా సంస్థ కీలక పాత్ర పోషించిందని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఇదే సమయంలో, కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ మళ్లీ పారిశ్రామిక వృద్ధికి, పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన రాష్ట్రంగా మారిందని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. గతంలో పోగొట్టుకున్న నమ్మకాన్ని తాము తిరిగి పునర్నిర్మిస్తున్నామని, భవిష్యత్తులో అమరరాజా సంస్థ చేపట్టబోయే అతిపెద్ద విస్తరణ ప్రాజెక్టులకు ఆంధ్రప్రదేశ్ మళ్లీ వేదిక కావాలని ఆయన ఆకాంక్షించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలకు ఎల్లప్పుడూ తమ తలుపులు, హృదయాలు తెరిచే ఉంటాయని ఈ సందర్భంగా ఆయన భరోసా ఇచ్చారు.

