టీమిండియా వెటరన్ ఓపెనర్ హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ వన్డే క్రికెట్ రిటైర్మెంట్ పై గత కొన్ని రోజులుగా వస్తున్న ఊహాగానాలకు భారత క్రికెట్ నియంత్రణ మండలి ఎట్టకేలకు గట్టి స్పష్టతనిచ్చింది. ఇంగ్లాండ్ తో ఆదివారం లార్డ్స్ మైదానంలో జరగబోయే మూడో వన్డే మ్యాచ్ రోహిత్ శర్మకు చివరి మ్యాచ్ కాబోతోందంటూ మీడియాలో విస్తృతంగా ప్రచారం సాగింది. 2027 వన్డే ప్రపంచకప్ ప్రణాళికల్లో రోహిత్ లేడని, యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ కు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని సెలక్టర్లు భావిస్తున్నట్లు వార్తలు రావడంతో ఈ రిటైర్మెంట్ చర్చలు ఊపందుకున్నాయి.
Also Read : పెరుగుతున్న నిరుద్యోగం.. భయపెడుతున్న నో జాబ్స్..!
అయితే, ఈ వార్తలను బీసీసీఐ పూర్తిగా ఖండించింది. ఈ సంచలన ప్రచారాలపై బీసీసీఐ సెక్రటరీ దేవాజిత్ సైకియా పిటిఐ వార్తా సంస్థతో ప్రత్యేకంగా మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చారు. మీడియాలో రోహిత్ శర్మ భవిష్యత్తు గురించి వస్తున్న వార్తలన్నీ కేవలం ఊహాగానాలు మాత్రమే అని స్పష్టం చేసారు. “లార్డ్స్ వన్డే రోహిత్ కు చివరి మ్యాచ్ అవుతుందనే విషయంపై బోర్డులో ఎలాంటి చర్చలు జరగలేదని నేను ఖచ్చితంగా చెప్పగలను. రోహిత్ శర్మ భారత వన్డే జట్టులో రెగ్యులర్ సభ్యుడు. మేనేజ్‌మెంట్ ప్రణాళికల్లో ఉన్నంత కాలం ఆయన దేశం తరఫున ఆడుతూనే ఉంటాడు అని క్లారిటీ ఇచ్చారు.
Also Read : మాజీ మంత్రి కోసం ఎస్సై రిస్క్.. ఎస్పీ రిటర్న్ గిఫ్ట్..!
రోహిత్ శర్మ 2024 లో టీ20లకు, 2025 లో టెస్ట్ క్రికెట్ కు ఇప్పటికే రిటైర్మెంట్ ప్రకటించి, ప్రస్తుతం కేవలం వన్డే ఫార్మాట్ లో మాత్రమే కొనసాగుతున్నాడు. ప్రస్తుత ఇంగ్లాండ్ సిరీస్ లో ఆశించిన స్థాయిలో పరుగులు చేయకపోవడం, వయస్సు 39 ఏళ్లకు చేరుకోవడంతో 2027 ప్రపంచకప్ ను దృష్టిలో ఉంచుకుని గౌతమ్ గంభీర్, అజిత్ అగర్కర్ ద్వయం రోహిత్ ను పక్కన పెట్టాలని చూస్తోందనే వార్తలు వినిపించాయి. బీసీసీఐ తాజా అధికారిక ప్రకటనతో ఈ వివాదానికి తాత్కాలికంగా తెరపడగా.. రోహిత్ శర్మ వన్డే కెరీర్ మరికొంత కాలం కొనసాగుతుందని తేలిపోయింది.

