ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ రాజకీయాల్లో కీలక మార్పునకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటివరకు కౌన్సిలర్లు, కార్పొరేటర్ల చేతుల్లో ఉన్న మేయర్, మున్సిపల్ చైర్మన్ ఎన్నికల నిర్ణయాధికారాన్ని నేరుగా ప్రజల చేతుల్లోకి తీసుకురావడానికి కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలకు నగారా మోగే సమయంలోనే ఎన్నికల విధానంలో ఈ మార్పును తీసుకురావడం ద్వారా స్థానిక రాజకీయాల స్వరూపాన్నే మార్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరందుకుంది.
Also Read : జోగి సీటు చిరిగినట్లేనా.. గేట్ క్లోజ్..!
ప్రస్తుతం అమల్లో ఉన్న పరోక్ష ఎన్నికల విధానంలో ప్రజలు తమ వార్డు కౌన్సిలర్ లేదా కార్పొరేటర్‌ను ఎన్నుకుంటారు. అనంతరం గెలిచిన కౌన్సిలర్లు, కార్పొరేటర్లు తమలో ఒకరిని మేయర్‌గా లేదా చైర్మన్‌గా ఎన్నుకుంటారు. కాగితంపై ఇది ప్రజాస్వామ్య ప్రక్రియగానే కనిపించినా.. అసలు రాజకీయ ఆట మాత్రం ఎన్నికల ఫలితాల తర్వాత మొదలవుతుందనే విమర్శలు ఉన్నాయి. మెజార్టీ కోసం కౌన్సిలర్లను తమవైపు తిప్పుకోవడం, క్యాంపులకు తరలించడం, రాజకీయ బేరసారాలు చేయడం, ఫిరాయింపులను ప్రోత్సహించడం వంటి వ్యవహారాలు స్థానిక సంస్థల రాజకీయాలను కలుషితం చేస్తున్నాయనే ఆరోపణలు చాలాకాలంగా ఉన్నాయి.
ఒక పార్టీకి ప్రజలు స్పష్టమైన మెజార్టీ ఇచ్చినా.. మేయర్ ఎన్నిక నాటికి కౌన్సిలర్ల బలాబలాలు మారిపోతే ఫలితం తారుమారయ్యే పరిస్థితి పరోక్ష ఎన్నికల విధానంలో ఉంది. దీంతో ప్రజలు వేసిన ఓటు ఒక పార్టీకి అధికారాన్ని ఇచ్చినా.. కౌన్సిలర్ల రాజకీయ సమీకరణాలు మాత్రం మరో పార్టీకి మేయర్ పీఠాన్ని అందించే అవకాశం ఉంటుంది. ఇదే అంశాన్ని ప్రధానంగా చూపిస్తూ ప్రత్యక్ష ఎన్నికల విధానానికి ప్రభుత్వం మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది.
Also Read : మళ్లీ కొత్త పాట పాడుతున్న పేర్ని..!
ప్రత్యక్ష ఎన్నికల విధానం అమల్లోకి వస్తే ఓటర్లు ఒకే ఎన్నికలో రెండు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. తమ వార్డుకు కౌన్సిలర్‌ను ఎన్నుకోవడంతో పాటు.. మొత్తం నగరం లేదా పట్టణానికి మేయర్, చైర్మన్ ఎవరు ఉండాలో కూడా నేరుగా నిర్ణయిస్తారు. దీంతో మేయర్ పీఠం కోసం కౌన్సిలర్ల మద్దతు కూడగట్టుకోవాల్సిన అవసరం ఉండదు. ప్రజల ఓట్లతో గెలిచిన మేయర్‌ను కేవలం కౌన్సిలర్ల ఫిరాయింపులతో మార్చే పరిస్థితి ఉండదు. ఈ కారణంగానే ప్రత్యక్ష ఎన్నికల విధానం వస్తే క్యాంపు రాజకీయాలకు, కౌన్సిలర్ల బేరసారాలకు గట్టి దెబ్బ తగులుతుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.
అయితే ఏపీలో ఇది కొత్త ప్రయోగం కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ ఉన్న సమయంలో 1987లో మున్సిపల్ చైర్మన్లు, పంచాయతీ సమితి అధ్యక్షులను ప్రజలే నేరుగా ఎన్నుకునే విధానానికి శ్రీకారం చుట్టారు. అనంతరం 2000లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కార్పొరేషన్ మేయర్లను కూడా ప్రజలు నేరుగా ఎన్నుకునేలా చట్ట సవరణ జరిగింది. అయితే 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఈ విధానానికి స్వస్తి పలికి మళ్లీ పరోక్ష ఎన్నికల విధానాన్ని తీసుకొచ్చారు. దీంతో ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల విధానం కూడా అధికారంలో ఉన్న ప్రభుత్వాల రాజకీయ నిర్ణయాలకు అనుగుణంగా మారుతూ వచ్చింది.
Also Read : బ్రేకింగ్ : అమరావతిపై ఆళ్ళ కుట్రలకు సుప్రీం బ్రేక్..!
ఇప్పుడు మరోసారి ప్రత్యక్ష ఎన్నికల విధానాన్ని తీసుకురావాలనే కూటమి ప్రభుత్వ ప్రయత్నం రాజకీయంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికలకు ముందు ఈ మార్పు రావడం అధికార, ప్రతిపక్షాలకు కొత్త రాజకీయ సమీకరణాలను తెరపైకి తీసుకురానుంది. ప్రత్యక్ష ఎన్నికల్లో అభ్యర్థి వ్యక్తిగత ఇమేజ్‌తో పాటు పార్టీకి ఉన్న ప్రజాదరణ, ప్రభుత్వ పనితీరు, స్థానిక సమస్యలు, ప్రచార సామర్థ్యం కీలకంగా మారనున్నాయి. కౌన్సిలర్ల స్థాయిలో బేరసారాలు చేసి మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలనే రాజకీయ వ్యూహాలకు మాత్రం ఇది గట్టి సవాలుగా మారనుంది.
ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో అధికార కూటమి కూడా ఈ విధానంపై ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా కూటమి ప్రభుత్వానికి ఉన్న రాజకీయ ప్రభావాన్ని మున్సిపల్ ఎన్నికల్లోకి తీసుకెళ్లేందుకు ప్రత్యక్ష మేయర్ ఎన్నికలు ఉపయోగపడతాయని అధికార పక్షం భావిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్ వంటి రాష్ట్రస్థాయి నాయకుల ప్రచారం స్థానిక ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు అదనపు బలాన్ని ఇవ్వవచ్చనే అంచనాలు ఉన్నాయి. అదే సమయంలో ప్రతిపక్షాలు కూడా బలమైన స్థానిక నాయకులను మేయర్ అభ్యర్థులుగా రంగంలోకి దించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
అయితే ప్రత్యక్ష ఎన్నికల విధానానికి సవాళ్లు లేకపోలేదు. ప్రజలు ఒక పార్టీకి చెందిన వ్యక్తిని మేయర్‌గా ఎన్నుకుని.. కౌన్సిల్‌లో మరో పార్టీకి మెజార్టీ ఇస్తే నగర పాలనలో కొత్త సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. మేయర్ ప్రతిపాదించే బడ్జెట్, అభివృద్ధి పనులు, పాలనా నిర్ణయాలకు కౌన్సిల్ సహకరించకపోతే మేయర్, కౌన్సిల్ మధ్య నిరంతర రాజకీయ ఘర్షణకు దారితీసే ప్రమాదం ఉంది. అందువల్ల ప్రత్యక్ష ఎన్నికలతో పాటు మేయర్, కౌన్సిల్ అధికారాలపై కూడా ప్రభుత్వం స్పష్టమైన చట్టపరమైన నిబంధనలు తీసుకురావాల్సిన అవసరం ఉంది.
మొత్తంగా చూస్తే.. ఏపీలో మున్సిపల్ ఎన్నికల విధానంలో ప్రతిపాదిత మార్పు కేవలం చట్ట సవరణ మాత్రమే కాదు.. స్థానిక రాజకీయాల ముఖచిత్రాన్నే మార్చే నిర్ణయంగా మారే అవకాశం ఉంది. ఇప్పటి వరకు “మేయర్‌ను ఎవరు ఎన్నుకుంటారు?” అనే ప్రశ్నకు సమాధానం కౌన్సిలర్లలో ఉండగా.. కొత్త విధానం వస్తే ఆ అధికారం పూర్తిగా ప్రజల చేతుల్లోకి వెళ్లనుంది. క్యాంపుల రాజకీయమా.. ప్రజల తీర్పా? బేరసారాల బలమా.. బ్యాలెట్ బలమా? అన్నది రాబోయే మున్సిపల్ సమరంలో తేలనుంది.

