సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా, దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 7వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా గురించి ఇప్పటికే భారతీయ సినీ పరిశ్రమతో పాటు అటు హాలీవుడ్ వర్గాలు కూడా ఆసక్తిగా చర్చించుకుంటున్నాయి. టైమ్ ట్రావెలింగ్ సినిమా అనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమా క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి వరకు ఎలాంటి లీకులు లేకుండా దర్శక నిర్మాతలు ఎన్నో జాగ్రత్రలు తీసుకున్నారు. అయితే తాజాగా ఈ సినిమా సెట్స్ నుంచి లీకైన ఒక ఫోటో సామాజిక మాధ్యమాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.
Also Read : ఆరోగ్యప్రదేశ్ గా ఆంధ్రప్రదేశ్.. చంద్రబాబు కీలక ప్రకటన..!
ఒక భారీ దేవాలయం బ్యాక్‌డ్రాప్‌తో నిర్మించిన సెట్‌లో అత్యంత భారీ డైనోసార్ నిర్మాణం స్పష్టంగా కనిపిస్తుండటంతో ఈ లీక్డ్ పిక్ నెటిజన్లను ఎంతగానో ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆలయ ప్రాంగణంలో డైనోసార్ ఉండటం అనే ఈ ఊహించని అసాధారణ కలయిక చూసి, అసలు రాజమౌళి ఎలాంటి సరికొత్త కథాంశాన్ని ప్లాన్ చేస్తున్నారనే ఆసక్తి సినీ ప్రియుల్లో మరింత పెరిగింది. భారతీయ చలనచిత్ర పరిశ్రమలోనే మోస్ట్ యాంటిసిపేటెడ్ ప్రాజెక్ట్‌లలో ఒకటిగా నిలిచిన ఈ సినిమాపై, తాజా లీక్‌తో అంచనాలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి.
ఇక జక్కన్న, ప్రిన్స్ మహేష్ కాంబోలో వస్తున్న వారణాసి గురించిన ఒక క్రేజీ అప్‌డేట్‌ను నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ పంచుకున్నారు. ఈ సినిమా కేవలం టైమ్ ట్రావెల్ కథ మాత్రమే కాదని, అంతకు మించి కథనంలో అనేక టైమ్‌లైన్స్.. విభిన్న కాలాలు ఉండబోతున్నాయని పృథ్వీరాజ్ వెల్లడించారు. ఇంతటి గొప్ప ప్రాజెక్ట్‌ను రాజమౌళి లాంటి దార్శనికుడు తెరకెక్కిస్తుంటే దగ్గరుండి చూడటం ఒక అద్భుతమైన అనుభూతిని ఇస్తోందని పృథ్వీరాజ్ కొనియాడారు. ఈ భారీ చిత్రంలో తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు, గ్లోబల్ స్టార్ ప్రియాంకా చోప్రాలతో కలిసి స్క్రీన్ స్పేస్ పంచుకోవడం తనకెంతో గర్వంగా ఉందన్న ఆయన, ప్రస్తుతం ఈ మూవీ చివరి షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటోందని స్పష్టం చేశారు.
Also Read : లోకల్‌లో జనసేన దూకుడు.. టీడీపీ బ్రేకులు..!
ఇక వారణాసి సినిమాలో అత్యంత కీలకమైన రామాయణం ఎపిసోడ్‌కు సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్ పూర్తి అయినట్లు తెలుస్తోంది. శ్రీరాముడిగా మహేశ్ కనిపించే ఈ ఎపిసోడ్‌లోని యుద్ధ సన్నివేశం విజువల్స్‌పై రాజమౌళి పూర్తి సంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. షూటింగ్ దాదాపు పూర్తికాగా.. ప్రస్తుతం వీఎఫ్‌ఎక్స్, రీ-రికార్డింగ్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. మరోవైపు అక్టోబర్ 10వ తేదీన రాజమౌళి పుట్టిన రోజు నుంచి ఈ సినిమా ప్రమోషన్ వర్క్ మొదలుపెట్టనున్నట్లు తెలుస్తోంది. సినిమాకు సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా ప్రమోషన్ చేసేందుకు ఏకంగా రెండు నెలలు పైగా సమయం కేటాయించినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా జక్కన్న ప్లానింగ్ మామూలుగా లేదనే మాట సినీ వర్గాల్లో వినిపిస్తోంది.

