హైదరాబాద్ వ్యాప్తంగా ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా పలువురు ప్రముఖులకు నోటీసులు జారీ కావడం నగరంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఓటర్ల నమోదు, చిరునామాలు మరియు ఇతర వ్యక్తిగత వివరాలలో దొర్లిన కొన్ని తేడాలను సరిదిద్దేందుకు, భారత ఎన్నికల సంఘం మరియు తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం ఈ చర్యలు చేపట్టింది. ముసాయిదా ఓటర్ల జాబితా ఆధారంగా లోపాలు ఉన్నట్లు గుర్తించిన ఓటర్లందరికీ వివరణ ఇవ్వాల్సిందిగా ఈ నోటీసులు పంపారు.
Also Read : బొల్లారం ఆర్మీ ఆయుధాలు దొరికేసాయి.. ఎక్కడంటే..!
ఎన్నికల అధికారులు విడుదల చేసిన ఈ వీఐపీ నోటీసుల జాబితాలో సినిమా, క్రీడా, మరియు పారిశ్రామిక రంగానికి చెందిన అగ్ర ప్రముఖుల పేర్లు ఉన్నాయి. చిత్ర పరిశ్రమ నుంచి గ్లోబల్ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు, ఆయన భార్య నమ్రత శిరోద్కర్, సీనియర్ నటుడు విక్టరీ వెంకటేష్, స్టార్ హీరోయిన్ సమంత, అలాగే యువ హీరోలు విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండలకు నోటీసులు అందినట్లు సమాచారం. క్రీడారంగం నుంచి భారత మాజీ మహిళా క్రికెట్ కెప్టెన్ మిథాలీ రాజ్, బ్యాడ్మింటన్ దిగ్గజ కోచ్ పుల్లెల గోపీచంద్ లతో పాటు వ్యాపార రంగానికి చెందిన దివి మురళీకృష్ణ ప్రసాద్, మెగా కోడలు ఉపాసన కొణిదెల పేర్లు కూడా ఈ జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read : ఎన్నికల బరిలో దూకుడు పెంచిన షర్మిల..!
జాబితా ప్రక్షాళనలో భాగంగా తలెత్తిన సందేహాల నివృత్తికి మరియు సరైన ధ్రువీకరణ పత్రాల సమర్పణకు నోటీసులు అందుకున్న వారు విచారణకు హాజరుకావాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. అయితే, నిరంతరం షూటింగ్ లు, విదేశీ పర్యటనలు లేదా ఇతర వ్యాపార పనుల వల్ల అందుబాటులో లేని ప్రముఖులకు ఎన్నికల సంఘం ఒక కీలక మినహాయింపునిచ్చింది. వీరు వ్యక్తిగతంగా హాజరుకాలేని పక్షంలో, తమ తరఫున ఒక ప్రతినిధినిఅవసరమైన ఒరిజినల్ డాక్యుమెంట్లతో విచారణకు పంపే అవకాశం కల్పించారు. దీనితో పాటు అవసరమైన పత్రాలను ఆన్ లైన్ ద్వారా కూడా సమర్పించే వీలు ఉందని ఎన్నికల అధికారులు వెల్లడించారు.

