మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లా వాాల్వా తాలూకా పరిధిలోని గోత్ఖిండి గ్రామం హిందూ ముస్లిం మత సామరస్యానికి అద్భుత నిదర్శనంగా నిలుస్తోంది. ఈ గ్రామంలోని స్థానిక మసీదు ప్రాంగణంలో గత 45 సంవత్సరాలుగా ప్రతి ఏటా వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను గ్రామస్థులు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇరు మతాలకు చెందిన యువకులు కలిసి ఏర్పాటు చేసిన ఉమ్మడి కమిటీ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరుగుతున్నాయి. మసీదులో ఒకవైపు నమాజ్ ప్రార్థనలు, మరోవైపు గణపతి బప్పా మోరియా అంటూ సాగే భజనలు ఎలాంటి అంతరాయం లేకుండా ఒకదానికొకటి గౌరవించుకుంటూ జరగడం విశేషం.
Also Read : డీఎస్సీ.. జగన్ పొలిటికల్ గేమ్..!
ఈ ఉత్సవాల ఏర్పాట్లలో ముస్లిం సోదరులు కూడా హిందువులతో సమానంగా పాల్గొంటూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ అపూర్వ సాంప్రదాయానికి 1980వ సంవత్సరంలో కురిసిన భారీ వర్షాలు పునాది వేశాయి. ఆనాడు వర్షం కారణంగా వినాయకుడి విగ్రహం పాడైపోయే పరిస్థితి రాగా, మసీదు పెద్దలు స్పందించి విగ్రహాన్ని మసీదు లోపలికి చేర్చి భద్రపరిచారు. నాటి నుంచి నేటి వరకు ప్రతి ఏటా వినాయకుడిని మసీదు ప్రాంగణంలోనే ప్రతిష్ఠించడం ఇక్కడి ప్రజలకు ఒక ఆనవాయితీగా మారింది.
Also Read : బాబు పోలవరం Vs కేసీఆర్ కాళేశ్వరం.. ఏపీకి నీళ్లు.. తెలంగాణకి అప్పులు
ఈ పది రోజుల పాటు హిందూ సోదరుల పండుగ పవిత్రతను గౌరవిస్తూ గ్రామంలోని అనేక ముస్లిం కుటుంబాలు కూడా శాకాహార భోజనానికే ప్రాధాన్యత ఇస్తుండటం గమనార్హం. ఈ వినూత్న ఉత్సవాల్లో భాగంగా హిందూ-ముస్లింల మధ్య బంధం ఎంత బలంగా ఉందంటే.. గణేష్ నవరాత్రులు జరుగుతున్న పది రోజులు గ్రామంలోని ముస్లిం సోదరులు వినాయకుడికి భక్తితో ఉపవాసాలు ఉంటారు. అదేవిధంగా పవిత్ర రంజాన్ మాసం వచ్చినప్పుడు ముస్లింలతో పాటు గ్రామంలోని హిందువులు కూడా ఉపవాస దీక్షలు ఆచరిస్తూ తమ ఐక్యతను చాటుకుంటారు. మతం పేరిట విభేదాలు సృష్టించుకునే నేటి సమాజానికి, ఈ చిన్న గ్రామం చూపిస్తున్న ఐక్యతా మార్గం ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.

