ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నం సాకారం కానుంది. భోగాపురంలో నిర్మించిన అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఈ నెల 17వ తేదీ నుంచి వాణిజ్య విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. తొలి రోజే దేశంలోని ప్రధాన నగరాలకు 31 విమాన సర్వీసులు రాకపోకలు సాగించనున్నాయి. దీంతో ఇప్పటి వరకు విశాఖపట్నం విమానాశ్రయంపై ఆధార పడిన ఉత్తరాంధ్ర ప్రయాణికులకు కొత్త విమానాశ్రయం అందుబాటులోకి రానుంది.
Also Read : ప్రత్యక్ష సమరానికే గ్రీన్ సిగ్నల్..!
హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా, తిరుపతి తదితర నగరాలకు భోగాపురం నుంచి విమాన కనెక్టివిటీ ఏర్పడనుంది. ఇప్పటికే పలు విమానయాన సంస్థలు తమ సర్వీసుల షెడ్యూల్ ప్రకటించాయి. దేశంలోని ప్రధాన నగరాలకు నేరుగా రాకపోకలు అందుబాటులోకి రావడంతో వ్యాపార, ఉద్యోగ, విద్య, వైద్య అవసరాల కోసం ప్రయాణించే వారికి సమయం ఆదా అవుతుంది. భోగాపురం విమానాశ్రయం ప్రారంభంతో విశాఖపట్నం విమానాశ్రయంలో ప్రస్తుతం కొనసాగుతున్న షెడ్యూల్డ్ వాణిజ్య విమాన రాకపోకలు కొత్త విమానాశ్రయానికి మారనున్నాయి. విమానాశ్రయానికి ‘వీటీజెడ్’ కోడ్ కొనసాగనుంది. దీంతో ప్రయాణికుల టికెట్లలో, విమాన షెడ్యూళ్లలో కూడా మార్పులు చోటుచేసుకోనున్నాయి.
సుమారు రూ.5,641 కోట్ల అంచనా వ్యయంతో భోగాపురం విమానాశ్రయాన్ని అభివృద్ధి చేశారు. అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన ఈ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాన్ని నిర్ణీత గడువులోనే పూర్తి చేయడం ప్రాజెక్టులో కీలక అంశంగా నిలిచింది. విమానాశ్రయంలో పెద్ద విమానాల రాకపోకలకు అనువుగా సుమారు 3,800 మీటర్ల పొడవైన రన్ వేను ఏర్పాటు చేశారు. తొలి దశలో ఏడాదికి సుమారు 60 లక్షల మంది ప్రయాణికులను నిర్వహించే సామర్థ్యంతో విమానాశ్రయాన్ని రూపొందించారు. ప్రయాణికుల సంఖ్య పెరిగే కొద్దీ దశలవారీగా విస్తరించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. భవిష్యత్తులో ఏడాదికి కోట్లాది మంది ప్రయాణికులను నిర్వహించే స్థాయికి విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయనున్నారు.
Also Read : జోగి సీటు చిరిగినట్లేనా.. గేట్ క్లోజ్..!
కార్గో రవాణాకు భోగాపురం విమానాశ్రయం ప్రాధాన్యం ఇవ్వమంది. ప్రారంభ దశలోనే భారీ స్థాయిలో సరకు రవాణా నిర్వహించేందుకు అవసరమైన మౌలిక వసతులను కల్పించారు. ఉత్తరాంధ్రలో ఉత్పత్తయ్యే వ్యవసాయ, ఆక్వా, పారిశ్రామిక ఉత్పత్తులను దేశ, విదేశీ మార్కెట్లకు వేగంగా తరలించేందుకు ఈ సౌకర్యాలు దోహదపడనున్నాయి. విమానాశ్రయం చుట్టుపక్కల ప్రాంతాల్లో పర్యాటకం, హోటళ్ల రంగం, రవాణా, లాజిస్టిక్స్, వాణిజ్యం, రియల్ ఎస్టేట్, పారిశ్రామిక రంగాల్లో కొత్త అవకాశాలు ఏర్పడే అవకాశం ఉంది. విశాఖపట్నం – విజయనగరం – శ్రీకాకుళం ప్రాంతాల ఆర్ధిక కార్యకలాపాలకు భోగాపురం విమానాశ్రయం కీలక కేంద్రంగా మారనుంది.
అంతర్జాతీయ ప్రయాణాలకు అవసరమైన ఇమ్మిగ్రేషన్ సదుపాయాలు కల్పించేందుకు కూడా చర్యలు చేపట్టారు. దీంతో భవిష్యత్తులో విదేశీ విమాన సర్వీసుల విస్తరణకు మార్గం సుగమం కానుంది. ఉత్తరాంధ్ర నుంచి విదేశాలకు వెళ్లే ప్రయాణికులు ఇతర నగరాలపై ఆధారపడాల్సిన అవసరం తగ్గనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల భోగాపురం విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేశారు. అనంతరం వాణిజ్య కార్యకలాపాలకు ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. ఈ నెల 17 నుంచి విమాన సర్వీసులు ప్రారంభం కానుండటంతో ఉత్తరాంధ్రలో విమానయాన రంగంలో కొత్త శకం ప్రారంభం కానుంది. భోగాపురం విమానాశ్రయం రాకతో ప్రాంతీయ అభివృద్ధి వేగం పుంజుకుంటుందని ప్రజలు ఆశిస్తున్నారు.

