ఒకప్పుడు కంటి చూపు మందగించడం, చదవడం కష్టమవ్వడం వంటి సమస్యలను కేవలం వృద్ధాప్య లక్షణాలుగా భావించేవాళ్లం. కానీ నేడు టెక్నాలజీ పెరిగిన తర్వాత చిన్న వయసులోనే చాలామంది కంటి సమస్యలతో బాధపడుతున్నారు. స్మార్ట్ఫోన్లు, లాప్‌టాప్‌లు, టీవీ స్క్రీన్ల ముందు గంటల తరబడి గడపడం, సరైన నిద్ర లేకపోవడం, పోషకాహార లోపం వంటి కారణాల వల్ల మన కళ్లు వాటి వయసు కంటే వేగంగా బలహీనపడుతున్నాయి. మనం కంప్యూటర్ లేదా మొబైల్ స్క్రీన్‌ను నిరంతరం చూస్తున్నప్పుడు, కనురెప్పలు ఆర్పడం చాలావరకు తగ్గిపోతుంది.
Also Read : దిగి వచ్చిన ఎన్నికల సంఘం.. కీలక నిర్ణయం..!
దీనివల్ల కంటిపై ఉండే తేమ పొర దెబ్బతిని కళ్లు పొడిబారడం, మంటలు, కళ్లలో నీరు తిరగడం వంటి సమస్యలు వస్తాయి. అంతేకాకుండా, గంటల తరబడి దగ్గరి వస్తువులనే చూడటం వల్ల కంటి కండరాలు అలసిపోయి, దూరం వస్తువులను స్పష్టంగా చూడటంలో తాత్కాలిక ఇబ్బందులు ఎదురవుతాయి. ముఖ్యంగా పిల్లలలో ఇది మయోపియా ప్రమాదాన్ని పెంచుతోంది. ఈ రోజుల్లో లేట్ నైట్ చాటింగ్‌లు, వెబ్ సిరీస్‌ల వల్ల చాలామంది కంటి నిండా నిద్రపోవడం లేదు. కానీ, రోజంతా అలసిపోయిన కళ్లు మళ్లీ పునరుత్తేజం పొందడానికి తగినంత నిద్ర చాలా అవసరం.
సరిగ్గా నిద్రపోని వారిలో కళ్లు ఎర్రబడటం, వెలుతురును సరిగ్గా చూడలేకపోవడం, దృష్టి కేంద్రీకరించలేకపోవడం వంటి ఇబ్బందులు తలెత్తుతాయి. కాబట్టి నిద్రపోవడానికి కనీసం గంట ముందే స్క్రీన్లకు దూరంగా ఉండటం అలవాటు చేసుకోవాలి. మన కంటి ఆరోగ్యం కేవలం స్క్రీన్ల మీదే కాదు, మనం తినే ఆహారం, చేసే పనులపై కూడా ఆధారపడి ఉంటుంది. పొగత్రాగడం, మధుమేహం, అధిక రక్తపోటు వంటి సమస్యలు ఉన్నవారికి కంటి జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువ.
Also Read : త్రిముఖ పోటీ ఖాయమేనా..?
కళ్ల ఆరోగ్యం కోసం ఆకుకూరలు, రంగురంగుల పండ్లు, కూరగాయలు, డ్రై ఫ్రూట్స్ వంటి పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవాలి. వీటన్నింటితో పాటు రోజూ కాసేపు ఎండలో లేదా అవుట్డోర్ సమయం గడపడం వల్ల, ముఖ్యంగా పిల్లలలో కంటి చూపు సమస్యలు రాకుండా నివారించవచ్చు. స్క్రీన్ ముందు పని చేసేటప్పుడు ప్రతి 20 నిమిషాలకు ఒకసారి, 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువును 20 సెకన్ల పాటు చూడండి. పని మధ్యలో కావాలనే కనురెప్పలను ఆర్పుతూ ఉండటం వల్ల కళ్లు పొడిబారకుండా ఉంటాయి. మీరు పని చేసే గదిలో వెలుతురు సరిగ్గా ఉండేలా చూసుకోండి, మొబైల్ బ్రైట్నెస్ను కంటికి ఇబ్బంది లేని విధంగా మార్చుకోండి.

