పంచాయతీ ఎన్నికల నగారా మోగింది. ఇప్పటి వరకు రాష్ట్ర స్థాయిలో పట్టు నిలుపుకున్న కూటమి ప్రభుత్వానికి ఇప్పుడే అసలైన సవాల్ ఎదురైంది. కూటమిలో భాగస్వామ్యులుగా ఉన్న తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల మధ్య సీట్ల పంపకం ఇప్పుడు ఆయా పార్టీల నేతలకు పెద్ద తలనొప్పిగా మారింది. నిజానికి ఇప్పటి వరకు జరిగింది ఒక లెక్క.. ఇప్పుడు జరిగేది ఒక లెక్క అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎన్నికల్లో ఎవరి సత్తా ఏమిటో తేలేది గ్రామస్థాయిలోనే. అందుకే గ్రామాల్లో పట్టు నిలుపుకునేందుకు ఆయా పార్టీల నేతలు ఇప్పటికే రంగంలోకి దిగారు. ఈ నేపథ్యంలో పంచాయతీ పోరు రసవత్తరంగా మారింది.
సాధారణంగా బంధుత్వం, వర్గం, గ్రామం, ప్రాంతం, మండలం, నియోజకవర్గం స్థాయిలోనే రాజకీయాలు జరుగుతుంటాయి. ఎన్నికల్లో అత్యంత సులువైనవి లోక్సభ ఎన్నికలని.. అత్యంత కష్టమైనవి పంచాయతీ సర్పంచ్ ఎన్నికలనేది రాజకీయాల్లో సీనియర్ నేతల మాట. లోక్సభకు పోటీ విషయంలో పార్టీల టికెట్ తెచ్చుకోవడమే కష్టంగా ఉంటుందని.. కానీ పంచాయతీ ఎన్నికల్లో మాత్రం.. మన ఊరు, మన వాడు, మనోడు, మన కులపోడు, మన వీధి, మన పార్టీ.. అంటూ చాలా అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. ఇప్పుడు ఇనే అంశాలు తెలుగుదేశం, జనసేన పార్టీల నేతలు, కార్యకర్తల మధ్య పోరుకు కారణమవుతున్నాయి.
Also Read : పెట్టుబడుల వేటలో మంత్రి లోకేష్ దూకుడు..!
పంచాయతీ ఎన్నికల్లో జనసేన పార్టీ నేతలు తొలిసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. దీంతో.. చాలా చోట్ల తెలుగుదేశం, జనసేన పార్టీల నేతల మధ్య సీట్ల పంచాయితీ రచ్చ లేపుతోంది. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో ఈ పోరు తారాస్థాయికి చేరుకుంది. సర్పంచ్ అభ్యర్థిగా తమకే అవకాశం ఇవ్వాలని జనసేన పార్టీ నేతలు పట్టుబడుతున్నారు. సామాజిక వర్గం, బంధువర్గం వంటి విషయాలను ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ నేతలు కూడా తమ పట్టు వదులుకోకూడదని భావిస్తున్నారు. ఇదే కూటమిలో నేతల మధ్య సిగపట్లకు కారణమవుతోంది.
గోదావరి జిల్లాలో కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు మెజారిటీ సీట్లు ఆశిస్తున్నారు. ఇంతకాలం తమ గ్రామాల్లో తెలుగుదేశం, వైసీపీ నేతలే సర్పంచ్ పదవులు అనుభవించారు.. కాబట్టి.. ఈసారి జనసేనకు అవకాశం ఇవ్వాలనేది ఆ పార్టీ నేతల మాట. ఇందుకు తమ సామాజిక వర్గం, బంధువులు, స్నేహితుల అండను గుర్తు చేస్తున్నారు. అయితే టీడీపీ నేతలు మాత్రం.. సర్పంచ్ పదవి జనసేనకు ఇస్తే.. గ్రామంలో తమ పట్టుపోతుందని భయపడుతున్నట్లు పరిస్థితి కనిపిస్తోంది. ఇందుకే లోపాయకారిగా.. సర్పంచ్ పదవి పంపకాలు, ఉప సర్పంచ్ పదవి మీదే.. అనే ప్రతిపాదనలను తెర పైకి తీసుకువస్తున్నారు. ఈ ప్రతిపాదనలకు జన సైనికులు ససేమిరా ఒప్పుకోవటం లేదు.
Also Read : గుజరాత్ ను వీడి హార్దిక్ తప్పు చేసాడా..?
ఎంపీ, ఎమ్మెల్యే, జిల్లా పరిషత్, కార్పొరేషన్, మునిసిపల్, మండల పరిషత్ ఎన్నికల్లో పార్టీ పెద్దలు చెప్పినట్లుగా నడుచుకున్న జన సైనికులు.. పంచాయతీ ఎన్నికల్లో మాత్రం.. తమ పట్టు నిలుపుకునేందుకు సిద్ధపడుతున్నారు. ఏది ఏమైనా సరే.. ఈసారి పోటీ చేసి తీరుతామని పార్టీ పెద్దలకు తెగేసి చెబుతున్నారు. అటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల కేటాయింపులో టీడీపీకి మెజారిటీ స్థానాలు దక్కడంతో.. నియోజకవర్గం ఇంఛార్జులు కూడా తమ కార్యకర్తలకే మద్దతు ఇస్తున్నారు. మీరు పోటీ చేయండి.. అంటూ వెనకుండి నడిపిస్తున్నారు. ఇక ఎంపీటీసీ ఎన్నికల సమయంలోనే సర్పంచ్ ఎన్నికల చర్చ వచ్చింది. అప్పుడు ఎంపీటీసీ, జెడ్పీటీసీలుగా పోటీ చేసిన టీడీపీ అభ్యర్థులు.. ఇప్పుడు మాకు మద్దతు ఇవ్వండి.. మీకు ఇప్పిస్తామని జనసైనికులకు హమీలు కూడా ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీ నిలుపుకోవాలనేది జనసేన పార్టీ నేతల డిమాండ్. అయితే ఇప్పుడు జనసేనకు అవకాశం ఇస్తే.. తమ పట్టు పోతుందనేది టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారు. మొత్తానికి పంచాయతీ ఎన్నికలు కూటమిలో కుంపట్లు రాజేస్తున్నాయి.


