అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మధ్య ఇరాన్ యుద్ధం విషయంలో తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఇరాన్‌పై తిరిగి సైనిక దాడులు ప్రారంభించే అంశంపై వారాంతంలో వీరిద్దరూ ఫోన్‌లో మాట్లాడుకున్నారని, ఈ క్రమంలో ఇద్దరి మధ్య తీవ్ర విభేదాలు తలెత్తాయని ఇజ్రాయెల్ వార్తా సంస్థ వై నెట్ న్యూస్ పేర్కొంది. అయితే, ఈ వార్తలను నెతన్యాహు కార్యాలయం పూర్తిగా ఖండించింది.
Also Read : ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే.. మధ్యలో చైర్మన్..!
అది కేవలం “ఫేక్ న్యూస్, అర్థం లేని ప్రచారం” అని కొట్టిపారేస్తూ, ఇరువురు నేతల మధ్య సాధారణ చర్చ మాత్రమే జరిగిందని ఇజ్రాయెల్ అధికారులు స్పష్టం చేశారు. ఇరాన్ తన అణు సామర్థ్యాలను తిరిగి నిర్మించుకుంటోందని, అక్కడి మత పెద్దల పాలనను కూల్చివేయడమే ఈ ముప్పుకు శాశ్వత పరిష్కారమని నెతన్యాహు ఇటీవల ఇజ్రాయెల్ పార్లమెంటులో వాదించారు. ఇరాన్‌పై మళ్లీ దాడులు చేయాలని ఒత్తిడి తెస్తూ నెతన్యాహు ప్రతిరోజూ ట్రంప్‌కు ఫోన్ చేస్తున్నట్లు ఫైనాన్షియల్ టైమ్స్ వెల్లడించింది.
Also Read : లోకేష్ వర్సస్ వైసీపీ.. ఎవరు గెలుస్తారో..?
మరోవైపు, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరగకూడదని అరబ్, ముస్లిం దేశాల నేతలు ట్రంప్‌ను కోరుతుండటంతో, నెతన్యాహు ఒత్తిడిని అమెరికా వర్గాలు వ్యతిరేకిస్తున్నాయి. ప్రస్తుతానికి ఇరాన్‌పై తక్షణ సైనిక చర్యల కంటే దౌత్యపరమైన చర్చలు, ఆర్థిక ఆంక్షల ద్వారానే ఆ దేశాన్ని దారికి తెచ్చుకోవాలని డొనాల్డ్ ట్రంప్ భావిస్తున్నారు. ఆదివారం జరిగిన 60 మినిట్స్ ఇంటర్వ్యూలో సైతం ఇరాన్‌తో యుద్ధాన్ని తిరిగి ప్రారంభించడానికి ఎటువంటి కారణం కనిపించడం లేదని ట్రంప్ స్పష్టం చేశారు. మొత్తానికి ఇరాన్‌పై సైనిక చర్యల విషయంలో నెతన్యాహు దూకుడుగా వ్యవహరిస్తుంటే, ట్రంప్ మాత్రం సంయమనం పాటిస్తుండటంతో అమెరికా-ఇజ్రాయెల్ సంబంధాల్లో విభేదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.


