వెండితెరపై పాత్ర ఏదైనా, ఆ క్యారెక్టర్లోకి పరకాయ ప్రవేశం చేసి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయడం తమిళ స్టార్ హీరో.. విజయ్ సేతుపతికి వెన్నతో పెట్టిన విద్య. అందుకే ఆయనను అభిమానులు ప్రేమగా మక్కల్ సెల్వన్ అని పిలుచుకుంటారు. ఇటీవల విడుదలై ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న కామెడీ డ్రామా బత్తా సినిమాలో విజయ్ సేతుపతి నటన చూసి ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకులు సైతం అవాక్కవుతున్నారు. బాలాజీ తరణీతరన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో 1986 నాటి మద్రాస్ బ్యాక్‌డ్రాప్‌లో ఒక భయంకరమైన స్థానిక గ్యాంగ్‌స్టర్ పాత్రలో అతని నటన ఓ సంచలనం అనే చెప్పాలి.
Also Read : తిరుమల లడ్డూ కల్తీ కేసుపై సుప్రీం సంచలన నిర్ణయం..!
ఒక పాఠశాల బాత్రూంలో ఎనిమిదేళ్ల అమాయకపు బాలుడు పొరపాటున ఈ డాన్‌ను లాక్ చేయడం, ఆ నిర్బంధంలో ఒక క్రూరమైన గ్యాంగ్‌స్టర్ పడే ఇబ్బందులు, ఆ బాలుడితో ఏర్పడే వింత స్నేహాన్ని విజయ్ సేతుపతి తన అద్భుత నటనతో ఎంతో హాస్యాస్పదంగా, హృదయానికి హత్తుకునేలా పండించాడు. ఈ చిత్రం కేవలం తమిళంలోనే కాకుండా తెలుగు మార్కెట్లోనూ మంచి క్రేజ్ తెచ్చుకుంది. గతంలో ఉప్పెన, మహారాజ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరైన విజయ్ సేతుపతికి ఇక్కడ మార్కెట్ విపరీతంగా పెరిగింది.
ఒకప్పుడు కేవలం తమిళ డబ్బింగ్ సినిమాల హీరోగానే పరిచయమైన ఆయన, ఇప్పుడు తన విలక్షణ నటనతో తెలుగునాట ఏకంగా స్ట్రెయిట్ హీరో రేంజ్ క్రేజ్‌ను సొంతం చేసుకున్నాడు. విజయ్ సేతుపతి కెరీర్ సెలక్షన్‌ను గమనిస్తే ఆయన ఎప్పుడూ ఒకే తరహా ఇమేజ్ పంజరంలో ఇరుక్కోవడానికి ఇష్టపడడు. హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనే తేడాల్లేకుండా పాత్రలో దమ్ముంటే చాలు ప్రాణం పెడతాడు అనే పేరుంది.
Also Read : విశాఖ జగన్ కు ఎందుకు కలగానే మిగిలిపోతోంది..?
అతని కెరీర్లో మైలురాళ్లుగా నిలిచిన మహారాజలో కూతురి కోసం తపించే తండ్రిగా, 96లో స్వచ్ఛమైన ప్రేమికుడు రామ్‌గా, విక్రమ్ వేధలో స్టైలిష్ గ్యాంగ్‌స్టర్‌గా, సూపర్ డీలక్స్ లో ట్రాన్స్‌జెండర్ శిల్పగా చేసిన పాత్రలే ఇందుకు నిదర్శనం. విడుతలై 2 లో పెరుమాళ్ వాతియార్గా అతని నటనకు విమర్శకులు సైతం ఫిదా అయిపోయారు. సినిమా రిజల్ట్‌తో సంబంధం లేకుండా ప్రతి పాత్రకు 100 శాతం న్యాయం చేయడం విజయ్ సేతుపతి స్పెషాలిటీ. బత్తా ద్వారా అతను మరోసారి తన నటనతో క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అందరినీ మెప్పించి, తెలుగు, తమిళ మార్కెట్లలో తన తిరుగులేని స్థానాన్ని మరోసారి చాటుకున్నాడు.


