ఐపీఎల్ 2027 సీజన్ మెగా వేలానికి ముందే ఫ్రాంచైజీల మధ్య ఆటగాళ్ల ట్రేడింగ్ పర్వం ఊపందుకుంది. టోర్నమెంట్లో అత్యంత ప్రజాదరణ పొందిన చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీలు పరస్పరం నలుగురు ఆటగాళ్లను మార్చుకుంటూ ఒక భారీ హై-ప్రొఫైల్ ట్రేడ్ డీల్‌ను అధికారికంగా ఖరారు చేశాయి. ఈ మెగా డీల్‌లో భాగంగా ఇంగ్లాండ్ స్టార్ ఆల్‌రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్ సన్‌రైజర్స్ వీడి చెన్నై క్యాంప్‌లో చేరాడు. ఈ ట్రేడ్ డీల్‌లో అత్యంత ఆసక్తికరమైన అంశం లియామ్ లివింగ్‌స్టోన్ తీసుకున్న భారీ ప్రైస్ కట్.
Also Read : భారత దంపతులపై అమెరికా సంచలన ఆంక్షలు..!
గతంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇతడిని రూ. 13 కోట్లకు దక్కించుకోగా, ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ కోసం ఏకంగా రూ. 7 కోట్ల మేర తగ్గించుకుని కేవలం రూ. 6 కోట్ల ఫీజుతో సీఎస్కే జెర్సీ ధరించడానికి లివింగ్‌స్టోన్ అంగీకరించాడు. ఇతడితో పాటు ఆస్ట్రేలియాకు చెందిన అన్క్యాప్డ్ ఆల్‌రౌండర్ జాక్ ఎడ్వర్డ్స్ కూడా రూ. 3 కోట్ల ధరతో చెన్నై జట్టులోకి మారాడు. మరోవైపు, ఈ ఇద్దరు ఆల్రౌండర్లను వదులుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్.. దానికి బదులుగా చెన్నై నుండి ఇద్దరు నాణ్యమైన ఫాస్ట్ బౌలర్లను తమ ఖాతాలో వేసుకుంది.
Also Read : విశాఖ జగన్ కు ఎందుకు కలగానే మిగిలిపోతోంది..?
టీమిండియా లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఖలీల్ అహ్మద్ తన పాత ధర రూ. 4.8 కోట్లతో తిరిగి సన్‌రైజర్స్ గూటికి చేరుకున్నాడు. ఖలీల్ గతంలో 2018 నుండి 2021 వరకు ఎస్ఆర్హెచ్కే ఆడటం గమనార్హం. వీరితో పాటు డెత్ ఓవర్ల స్పెషలిస్ట్, ఆస్ట్రేలియా పేసర్ నాథన్ ఎల్లిస్ కూడా రూ. 2 కోట్ల ధరకు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో చేరాడు. ఈ నలుగురు ఆటగాళ్ల బదిలీ ప్రకటనతో పాటు, ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాను కూడా ట్రేడ్ ద్వారా దక్కించుకునేందుకు చెన్నై సూపర్ కింగ్స్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు ఐపీఎల్ వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే హార్దిక్ కోసం కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ కూడా గట్టి పోటీ ఇస్తుండటంతో, రిటెన్షన్ డెడ్‌లైన్ లోపు ఈ విషయంలో మరిన్ని సంచలన పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది.


