ఆంధ్రప్రదేశ్‌లో గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జరిగిన వరుస కుంభకోణాలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు తమ ఉచ్చును బిగిస్తున్నాయి. తాజాగా, రాష్ట్రంలో సంచలనం సృష్టించిన రూ. 195 కోట్ల మద్యం రవాణా కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. ఈ కేసుకు సంబంధించి చిత్తూరుకు చెందిన కీలక వైసీపీ నేత, గత సార్వత్రిక ఎన్నికల్లో చిత్తూరు అసెంబ్లీ స్థానం నుండి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన విజయానందరెడ్డికి ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు.
Also Read : ఎస్ఐఆర్ పై బాంబు పేల్చిన పరకాల ప్రభాకర్..!
ఈరోజే ఆయనను విచారణకు హాజరుకావాలని ఈడీ ఆదేశించడం ఆసక్తిని రేపుతోంది. గత ప్రభుత్వ హయాంలో మద్యం రవాణా కాంట్రాక్టుల కేటాయింపుల్లో భారీ అక్రమాలు జరిగాయని, నిబంధనలకు విరుద్ధంగా తమకు అనుకూలమైన వారికి రూ. 195 కోట్ల విలువైన కాంట్రాక్టును కట్టబెట్టారనే ఆరోపణలపై ఈ దర్యాప్తు సాగుతోంది. ఈ ప్రక్రియలో నిఖిలానంద లాజిస్టిక్స్ అనే సంస్థ ఖాతాల్లోకి విపరీతమైన రీతిలో కోట్లాది రూపాయల నిధులు వచ్చి చేరినట్లు ఈడీ అధికారులు తమ ప్రాథమిక విచారణలో గుర్తించారు.
Also Read : గిల్ రికార్డుల మాటున దాగున్న చేదు నిజం..!
విజయానందరెడ్డికి ఈ సంస్థతో ఉన్న ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలపై ఆర్థిక నిఘా సంస్థలు నిఘా పెట్టాయి. ఈ కుంభకోణంలో నిధుల లూప్‌ను చేధించిన ఈడీ అధికారులకు షాకింగ్ నిజాలు వెల్లడయ్యాయి. మద్యం రవాణా దందాలో భాగస్వామ్యులైన సిగ్మా ట్రాన్స్‌పోర్ట్స్, అలాగే ప్రసాద్ ట్రాన్స్‌పోర్ట్స్ అనే సంస్థల నుండి పెద్ద ఎత్తున నిధులు దారిమళ్లినట్లు దర్యాప్తులో స్పష్టమైంది. ఈ రవాణా సంస్థల నుండి అక్రమ మార్గాల్లో చేతులు మారి, చివరకు నిఖిలానంద లాజిస్టిక్స్ ఖాతాల్లోకి నిధులు చేరాయని, అక్కడి నుండి అవి రాజకీయ పెద్దలకు అండగా ఉన్న వారికి చేరాయనే బలమైన ఆధారాలను ఈడీ సేకరించింది. హవాలా మార్గాల్లో ఏమైనా మనీ లాండరింగ్ జరిగిందా అనే కోణంలో విజయానందరెడ్డిని ఈడీ అధికారులు నేడు గట్టిగా ప్రశ్నించబోతున్నారు. ఏపీలో ఇప్పటికే మద్యం పాలసీపై రచ్చ నడుస్తున్న తరుణంలో, ఇప్పుడు రవాణా స్కామ్‌లో నేరుగా వైసీపీ అభ్యర్థికి ఈడీ నోటీసులు రావడం ఆ పార్టీని తీవ్ర ఇరకాటంలోకి నెట్టింది.

