ఏపీలో స్థానిక సంస్థలు సమీపిస్తున్నాయి. మరో నెల రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేస్తామని తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేష్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. దీంతో లోకల్ వార్‌లో ఎట్టి పరిస్థితుల్లో సత్తా చాటాలని తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల కూటమితో పాతు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా గట్టి పట్టుదలతో ఉన్నారు. ఇదే సమయంలో మేయర్, ఛైర్మన్ వంటి స్థానాలకు ప్రత్యక్ష ఎన్నిక నిర్వహిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. దీంతో టికెట్లు ఆశిస్తున్న వారి జాబితా అన్ని పార్టీల్లో ఎక్కువగానే ఉంది. ఇదే సమయంలో అసలు టికెట్లు ఎవరికి ఇస్తారనే చర్చ కూడా జోరుగా జరుగుతోంది.
Also Read : ఏపీ స్థానిక ఎన్నికల రిజర్వేషన్లపై హైకోర్టు సంచలన తీర్పు..!
ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో.. సరిగ్గా ఎన్నికల ముందు పార్టీలు మారే వారికి టిక్కెట్లు ఇచ్చేది లేదని పల్లా స్పష్టం చేశారు. తొలి నుంచి పార్టీకి అంకితభావంతో పనిచేస్తున్న నాయకులు, కార్యకర్తలకే అభ్యర్థిత్వంలో ప్రాధాన్యత ఉంటుందని పల్లా క్లారిటీ ఇచ్చారు. అదే సమయంలో లోకల్ ఎన్నికలపై పల్లా కీలక వ్యాఖ్యలు చేశారు. వీటిని కేవలం స్థానిక సంస్థల ఎన్నికల మాదిరిగా కాకుండా.. సార్వత్రిక ఎన్నికలే టార్గెట్ అన్నట్లుగా పల్లా అభివర్ణించారు. 2029 సార్వత్రిక ఎన్నికలే అసలు టార్గెట్.. అని పల్లా స్పష్టం చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికల కంటే 2029 సార్వత్రిక ఎన్నికలు తమకు మరింత ముఖ్యమని పల్లా శ్రీనివాసరావు వెల్లడించారు. పార్టీ భవిష్యత్ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అభ్యర్థుల ఎంపిక ఉంటుందన్నారు. గెలుపు అవకాశాలే కీలక ప్రమాణం అని పల్లా వెల్లడించారు. సామాజిక సమీకరణాలతో పాటు క్షేత్రస్థాయి బలం, ప్రజాదరణ, గెలుపు అవకాశాలను పరిగణనలోకి తీసుకుని అభ్యర్థులను ఎంపిక చేస్తామని స్పష్టం చేశారు. ఇటీవల కూడా కూటమి స్థానిక ఎన్నికల్లో అనుకూలమైన, గెలుపు అవకాశాలున్న అభ్యర్థులను గుర్తించడంపై పల్లా దృష్టి పెట్టాలని సూచించారు. అదే సమయంలో సీట్ల సర్దుబాటుపై కూడా పల్లా క్లారిటీ ఇచ్చేశారు.
Also Read : BC రిజర్వేషన్లపై వైసీపీ కుట్ర.. గంటలో సుప్రీంకి ఏపీ సర్కార్
టీడీపీ – జనసేన – బీజేపీ కూటమిలో స్థానిక సంస్థల సీట్ల సర్దుబాటుపై ఎన్డీఏ కోఆర్డినేషన్ కమిటీదే తుది నిర్ణయం అని పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనుల కారణంగా.. ప్రజలంతా కూటమి పార్టీలకే మరోసారి అవకాశం ఇస్తారని పల్లా ధీమా వ్యక్తం చేశారు. కూటమి గెలుపు ఖాయం కాబట్టే.. టికెట్లు ఆశించే వారి జాబితా పెద్దగానే ఉందన్నారు. అయితే ఏ స్థానం, ఏ పార్టీకి, ఏ అభ్యర్థికి ఇవ్వాలనే విషయం పూర్తిగా ఎన్డీఏ కో ఆర్డినేషన్ కమిటీ పరిధిలోనే ఉంటుందన్నారు. ఎన్డీఏ కో ఆర్డినేషన్ కమిటీ నిర్ణయమే దాదాపు ఫైనల్ అన్నారు కూడా.
ఇదే సమయంలో పల్లా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారితే టిక్కెట్ కష్టమే అంటూ పల్లా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. కష్టకాలంలో పార్టీ కోసం పనిచేసిన వారికే ప్రాధాన్యమా?.. 2029ను దృష్టిలో పెట్టుకునే అభ్యర్థుల ఎంపిక జరుగుతుందా?.. అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పల్లా వ్యాఖ్యలతో స్థానిక ఎన్నికల్లో టిక్కెట్ల కోసం ప్రయత్నిస్తున్న ఆశావహుల్లో కొత్త చర్చ మొదలైంది.

