సాధారణంగా జలుబు, దగ్గు లేదా గొంతు నొప్పితో బాధపడుతున్నప్పుడు.. ఐస్‌క్రీమ్‌లు, చల్లని పానీయాలకు దూరంగా ఉండాలని ఇంట్లో పెద్దలు చెబుతుంటారు. చల్లని పదార్థాలు తింటే జలుబు మరింత ఎక్కువవుతుందని, శరీరంలో శ్లేష్మం పెరుగుతుందని చాలామంది నమ్ముతారు. కానీ, ఈ నమ్మకానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారం లేదని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. జలుబు చేసినప్పుడు కూడా ఐస్‌క్రీమ్‌ను మితంగా హ్యాపీగా తినవచ్చని ఆస్టర్ వైట్‌ఫీల్డ్ హాస్పిటల్స్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ బసవరాజ్ ఎస్. కుంబార్ పేర్కొన్నారు.
Also Read : యూపీఐ సేవలు ఆగిపోతాయా.. నిజమెంత..?
సాధారణ జలుబు అనేది ఒక వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. మనం ఐస్‌క్రీమ్ తినడం వల్ల ఆ వైరస్ శరీరంలో మరింత వేగంగా పెరగడం లేదా ఇన్ఫెక్షన్ తీవ్రమవ్వడం వంటివి జరగవని డాక్టర్ కుంబార్ వివరించారు. అయితే, చల్లని పదార్థాలకు ఒక్కొక్కరి శరీరం ఒక్కోలా స్పందిస్తుంది. కొందరికి గొంతు నొప్పి ఉన్నప్పుడు ఐస్‌క్రీమ్ తింటే గొంతు తిమ్మిరిగా అనిపించి హాయిగా, ఉపశమనం లభించినట్లు అనిపిస్తుంది. కానీ, మరికొందరికి మాత్రం చల్లదనం వల్ల గొంతు మరింత రాచుకుపోయినట్లు అవ్వడం, దగ్గు లేదా ముక్కు దిబ్బడ ఎక్కువవడం వంటివి జరగవచ్చు.
Also Read : కొత్త ఓటర్లకు గుడ్ న్యూస్.. ఎన్నికల సంఘం కీలక నిర్ణయం..!
కాబట్టి మీ శరీర స్పందనను బట్టి మీరు నిర్ణయం తీసుకోవాలి. పాలు లేదా పాల పదార్థాలు తింటే శరీరంలో శ్లేష్మం పెరుగుతుందనేది పెద్ద అపోహ అని, దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని వైద్యులు కొట్టిపారేశారు. ఐస్‌క్రీమ్ లేదా పాలు తీసుకున్న తర్వాత నోటిలో ఒక రకమైన మందపాటి పొరలాంటి అనుభూతి తాత్కాలికంగా కలుగుతుంది. దీనివల్ల శ్లేష్మం పెరిగినట్లు మనకు అనిపిస్తుందే తప్ప, నిజానికి శరీరం అదనంగా కఫాన్ని ఉత్పత్తి చేయదు. మీకు సాధారణ జలుబు కాకుండా తీవ్రమైన గొంతు నొప్పి, నిరంతరాయంగా వచ్చే దగ్గు, వికారం, వాంతులు, విరేచనాలు లేదా మింగడంలో ఇబ్బంది వంటి సమస్యలు ఉంటే ఐస్‌క్రీమ్‌కు దూరంగా ఉండటమే మంచిది. అలాగే మీకు సాధారణ రోజుల్లోనే డైరీ ప్రొడక్ట్స్ అరగకపోవడం లేదా గ్యాస్ వంటి జీర్ణ సమస్యలు ఉంటే, జలుబు చేసినప్పుడు ఐస్‌క్రీమ్ తినకపోవడమే శ్రేయస్కరం అని పేర్కొన్నారు.

