ఏపీలో విశాఖ అతి పెద్ద నగరం. ఇప్పుడు ఆ నగరం మెడలో మణి హారంగా ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ రాబోతోంది. దశాబ్దాల విశాఖ వాసుల కలలు నిజం అవుతున్నాయి. విశాఖ నానాటికీ ఎదుగుతున్న నగరం. ఈ రోజున పాతిక లక్షల దాకా జనాభా ఉంది. రేపటి రోజున అది రెట్టింపు కానుంది. ఇప్పటికే ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కుకున్న నగరానికి భారీ ఉపశమనంగా మెట్రో రైలు ప్రాజెక్ట్ రాబోతోంది. కేంద్ర ప్రభుత్వం విశాఖ మెట్రో రైలు కూత పెట్టేందుకు పచ్చ జెండా ఊపేసింది. దీంతో అతి పెద్ద ముందడుగు పడినట్లు అయ్యింది. విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో విశాఖ మెట్రో ప్రాజెక్టుకు అతి ముఖ్యమైన ఘట్టం పూర్తయ్యింది.
Also Read : ఒక్క మ్యాచ్ తో కోహ్లీ రేర్ రికార్డులు..!
విశాఖ నగరానికి సాఫ్ట్‌వేర్ సంస్థలు క్యూ కడుతున్నాయి. డేటా సెంటర్లు వచ్చేస్తున్నాయి. వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు కార్పొరేట్ సంస్థలు ఇప్పటికే ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నాయి కూడా. మరోవైపు విశాఖను అంతర్జాతీయంగా కనెక్ట్ చేసేందుకు భోగాపురంలో అల్లూరి సీతారామరాజు గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభమైంది కూడా. దీంతో విదేశాల నుంచి విమానాల రాకపోకలు కూడా మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో విశాఖలో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మెట్రో కారిడార్ నిర్మాణాన్ని వేగవంతం చేశాయి.
మూడు కారిడార్లుగా చేపట్టబోయే ఈ ప్రాజెక్ట్ కోసం మొత్తం అంచనా వ్యయంగా సుమారు రూ.11, 488 కోట్ల బడ్జెట్‌తో ఖర్చు చేయనున్నారు. మొత్తం దూరం 46.22 కిలోమీటర్లు ఉండబోతోంది. అలాగే మొత్తం 43 మెట్రో స్టేషన్లు ఉండనున్నాయి. మెట్రో కారిడార్లు మూడు ఉంటాయని చెబుతున్నారు. విశాఖ మహా నగరాన్ని కలుపుతూ మెట్రో రైలు ప్రాజెక్ట్ డిజైన్ చేశారు. ఇందులో మొదటి లైన్ కూర్మన్నపాలెం నుండి కొమ్మాది జంక్షన్ వరకు ఉండబోతోంది. దాని దూరం 34.4 కిలోమీటర్లుగా నిర్ణయించారు. ఈ మార్గంలో 29 స్టేషన్లు ఉంటాయి.
Also Read : మీనాక్షి ఎదురుచూపులకు తెరపడనుందా?
రెండవ లైన్ గురుద్వారా నుండి పాత పోస్టాఫీసు వరకు ఉంటుంది. దాని దూరం 5.07 కిలో మీటర్లు, ఈ కారిడార్‌లో ఆరు స్టేషన్లు ఉంటాయి. మూడవ లైన్ తాడిచెట్లపాలెం నుండి చినవాల్తేరు వరకు ఉంటుంది. దాని దూరం 6.75 కిలో మీటర్లుగా ఉంది. ఈ మార్గంలో ఏడు స్టేషన్లు వస్తాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం కేంద్రం ఆమోదించిన ఈ మెట్రో రైలు ప్రాజెక్టు చూస్తే రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన ఆధారంగా కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాంతో ఈ డీపీఆర్‌లో కొమ్మాది దాకానే ఉండనుంది. భవిష్యత్తులో దీనిని మరింత పొడిగించి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వరకు మెట్రో రైలు నడిచే అవకాశం ఉంది. ఈ మెట్రో రైలు ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కితే లక్షలాది మంది ప్రజలకు సుఖవంతంగా వేగవంతంగా అతి తక్కువ ఖర్చుతో ప్రయాణం సాగుతుంది. అంతే కాదు ఏ మూల నున్న వారు అయినా నగరంతో నేరుగా అనుసంధానం అవుతారు. తమ ఉపాధి అవకాశాలను మరింతంగా పెంచుకుంటారు. నగర ప్రగతికి కూడా ఇది ఉపయోగపడుతుందని అంచనా వేస్తున్నారు.

