అధికారం అండతో ప్రజాప్రతినిధులు నిబంధనలను తుంగలో తొక్కుతున్నారనే ఆరోపణలు విజయనగరం జిల్లాలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. నెల్లిమర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే లోకం నాగమాధవి తన అధికారిక హోదాను అడ్డుపెట్టుకుని, తనకు చెందిన ప్రైవేట్ విద్యా, వ్యాపార సంస్థల వాహనాలకు టోల్ ఫీజు చెల్లించకుండా తప్పించుకుంటున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజాసేవ చేయాల్సిన ప్రజాప్రతినిధులే ఇలా నిబంధనలు ఉల్లంఘించడంపై స్థానికంగా చర్చ జరుగుతోంది. విజయనగరం జిల్లా డెంకాడ మండలం నాతవలస టోల్ ప్లాజా వద్ద ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
Also Read : స్వింగ్ పిచ్‌లంటే టీమిండియాకు ఎందుకంత భయం..?
ఎమ్మెల్యే లోకం నాగమాధవికి చెందిన మిరకిల్ ఇంజినీరింగ్ కాలేజీ, మిరకిల్ సాఫ్ట్‌వేర్ సిస్టమ్స్ కంపెనీలకు చెందిన బస్సులతో పాటు మరికొన్ని లారీలకు టోల్ సిబ్బంది ఎటువంటి రుసుము వసూలు చేయకుండానే ఫ్రీ ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా జాతీయ రహదారిపై ప్రయాణించే ప్రతి వాహనానికి ఫాస్టాగ్ ద్వారా టోల్ కట్ అవుతుంది. కానీ, నాతవలస టోల్ బూత్ వద్దకు రాగానే ఎమ్మెల్యే గారి వాహనాలు.. అని చెబితే చాలు, సిబ్బంది ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా టోల్ గేట్ ఎత్తివేస్తున్నారని సమాచారం.
ఎమ్మెల్యే హోదాను అడ్డుపెట్టుకుని ఇలా ప్రతిరోజూ దాదాపు వంద వాహనాల వరకు ఎటువంటి టోల్ రుసుము చెల్లించకుండానే ఈ టోల్ ప్లాజా మీదుగా రాకపోకలు సాగిస్తున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. నాతవలస టోల్ ప్లాజా నిబంధనల ప్రకారం బస్సులు, భారీ వాహనాలకు ఒక్కో ట్రిప్పుకు వందల రూపాయల్లో టోల్ ఛార్జీ ఉంటుంది. ఇలా రోజుకు వంద వాహనాలకు పైగా ఉచితంగా వదిలేయడం వల్ల నెలకు సుమారు రూ. 3 లక్షల నుంచి రూ. 4 లక్షల వరకు టోల్ ఆదాయానికి గండి పడుతోందని, ఇదొక వ్యవస్థీకృత స్కామ్‌లా మారిందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Also Read : పంచాయతీ “రాజీ” కియాలు..!
ఒకవైపు సామాన్య ప్రజలు, వాహనదారులు ఒక్క రూపాయి తగ్గినా ఫాస్టాగ్ రీఛార్జ్ చేసుకుని కచ్చితంగా టోల్ చెల్లిస్తుంటే, ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన ఒక ఎమ్మెల్యే తన సొంత ప్రైవేట్ సంస్థల వాహనాలకు అధికార దుర్వినియోగంతో మినహాయింపు పొందడంపై విమర్శలు వస్తున్నాయి. మేడం గారి కక్కుర్తి వ్యవహారం ఇప్పుడు రాష్ట్రంలోని అధికార కూటమికి కూడా రాజకీయంగా తలనొప్పిగా, ఇబ్బందికరంగా మారిందనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.


