భారతీయ జనతా పార్టీలో భారత రాష్ట్ర సమితి విలీనం చేస్తారని మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సొంత కుమార్తె కల్వకుంట్ల కవిత పదే పదే ఆరోపణలు చేస్తున్నారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ఖాయమని కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా జోస్యం చెబుతున్నారు. మరి కొందరైతే.. బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటుందని.. రాబోయే ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయంటున్నారు. అధికారంలోకి కోసమే బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకునేందుకు రెడీ అయ్యిందని సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆరోపిస్తున్నారు. ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు క్లారిటీ ఇచ్చారు.
Also Read : ఏపీ స్థానిక ఎన్నికల రిజర్వేషన్లపై హైకోర్టు సంచలన తీర్పు..!
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో అలాంటి పొత్తు ఉండదని బీఆర్ఎస్ వర్కింగ్ పెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. గత 26 సంవత్సరాలలో ఒక్కసారి కూడా ఆ పార్టీతో పొత్తు పెట్టుకోలేదని తెలిపారు. 2014, 2018, 2023 ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేసిందన్నారు కేటీఆర్. భావజాలపరంగా, సైద్ధాంతికంగా బీజేపీకి పూర్తిగా వ్యతిరేకం కాబట్టి పొత్తు ప్రశ్న రాదు. తెలంగాణలో రాబోయేది కేసీఆర్ ప్రభుత్వమే అని కేటీఆర్ కుండబద్దలు కొట్టారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్ల ప్రజలలో తీవ్రమైన అసంతృప్తి, ఆగ్రహం కనిపిస్తున్నాయన్నారు.
తెలంగాణ ప్రజల ప్రయోజనాలను పూర్తిగా పణంగా పెట్టిన రేవంత్ రెడ్డి ఢిల్లీ పెద్దలకు భజన చేస్తున్నారని కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఏ రోజు ఢిల్లీకి గులాం గిరి చేయలేదని.. ఢిల్లీ పెద్దల మెడలు వంచి తెలంగాణ సాధించారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమన్నారు. మరోసారి బీఆర్ఎస్ ఒంటరిగా పోటీ చేస్తుందా.. అనే ప్రశ్నకు.. ఎన్నికలకు ఇంకా సమయం ఉంది కాబట్టి.. పొత్తుల గురించి ఇప్పుడే మాట్లాడలేమన్నారు.
Also Read : ఆ పిల్లాడి బాధ్యత నాది.. లోకేష్ కీలక ప్రకటన..!
జనాభా ఆధారంగా డీలిమిటేషన్ చేపడితే దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. చట్టసభల్లో సీట్లు పెంచాలనుకుంటే కేవలం పార్లమెంటు సీట్లు మాత్రమే ఎందుకు పెంచుతున్నారని ప్రశ్నించారు. అసెంబ్లీ సీట్లను కూడా అదే ప్రాతిపదికన ఎందుకు పెంచడం లేదని నిలదీశారు. గతంలో 24 శాతంగా ఉన్న దక్షిణాది జనాభా వాటా ఇప్పుడు 19 శాతానికి తగ్గిపోయిందని.. జనాభా నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసినందుకు దక్షిణాది రాష్ట్రాలకు ఈ రకమైన శిక్ష వేయడం సరికాదన్నారు. అస్సాం, జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ సీట్లను పెంచిన కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు పెంచలేదని ప్రశ్నించారు. కేవలం రాజకీయ లబ్ది కోసమే బీజేపీ ఈ కుట్రకు తెరలేపిందని.. అమిత్ షా ఇస్తున్న హామీలను నమ్మే స్థితిలో ఎవరూ లేరన్నారు.
తెలంగాణ విభజన చట్టంలో పేర్కొన్న ఏ ఒక్క హామీని కూడా మోదీ ప్రభుత్వం ఇప్పటివరకు పూర్తిగా అమలు చేయలేదన్నారు. బీజేపీకి రాజకీయ ప్రభావం తక్కువగా ఉన్న రాష్ట్రాల పట్ల కేంద్రం వివక్ష చూపిస్తోందని ఆరోపించారు. కేవలం తమ రాజకీయ అవసరాలకు అనుగుణంగా డీలిమిటేషన్ ప్రక్రియను ముందుకు తీసుకెళ్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు తీవ్రమైన చర్చకు దారి తీశాయి. పొత్తు పెట్టుకునేది లేదంటూనే.. పొత్తుల గురించి ఇప్పుడు మాట్లాడే సమయం కాదన్నారు కేటీఆర్. అంటే పొత్తు ఉంటుందా.. ఉండదా.. అనే విషయంపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

