అమెరికాలో స్థిరపడాలనే ‘అమెరికన్ డ్రీమ్’ భారతీయుల్లో క్రమంగా చెదిరిపోతోంది. తాజాగా కార్నెగీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్ నిర్వహించిన సర్వే ప్రకారం, సుమారు 40 శాతం మంది భారతీయ అమెరికన్లు అమెరికాను వదిలి వెళ్లాలని ఆలోచిస్తున్నారు. ఇందుకు ప్రధానంగా అక్కడ మారుతున్న రాజకీయ వాతావరణం, విపరీతంగా పెరిగిన జీవన వ్యయం మరియు వ్యక్తిగత భద్రతపై ఆందోళనలే కారణమని ఈ నివేదిక వెల్లడించింది. ముఖ్యంగా దేశం వీడాలనుకుంటున్న వారిలో 58 శాతం మంది ప్రస్తుత రాజకీయ పరిణామాలే ప్రధాన కారణమని తెలపడం గమనార్హం.
Also Read : వాట్సాప్ యూనివర్సిటీపై సుప్రీం సంచలన కామెంట్స్..!
ఒకప్పుడు డెమోక్రాట్లకు బలమైన ఓటు బ్యాంకుగా ఉన్న భారతీయ అమెరికన్లు ఇప్పుడు స్వతంత్రులుగా మారుతున్నారు. 2020లో 56 శాతంగా ఉన్న డెమోక్రాట్ల మద్దతు ఇప్పుడు 47 శాతానికి పడిపోగా, దాదాపు 30 శాతం మంది భారతీయులు ఏ పార్టీకి కట్టుబడి లేమని స్పష్టం చేస్తున్నారు. వీరంతా ఇప్పుడు పార్టీ విధేయత కంటే ఉద్యోగ భద్రత, ఆర్థిక స్థిరత్వం, తమ కుటుంబాల రక్షణ వంటి ఆచరణాత్మక అంశాల ఆధారంగానే నిర్ణయాలు తీసుకుంటున్నారు.
Also Read : మంగ్లీకి ఆడియో సెగ.. స్కామ్ లో అడ్డంగా దొరికిపోయిందా..?
అమెరికా ఆర్థిక వ్యవస్థలో మరియు టెక్నాలజీ రంగంలో భారతీయులు కీలక పాత్ర పోషిస్తున్నారు. అమెరికాకు సమకూరే పన్నుల ఆదాయంలో సుమారు 6 శాతం వాటా కలిగి ఉన్న ఈ మేధావుల వర్గం ఇప్పుడు తిరుగుముఖం పట్టడం ఆ దేశానికి పెద్ద దెబ్బ అనే చెప్పాలి. భారత్ లో పెరుగుతున్న ఆర్థిక అవకాశాలు, ఇక్కడి అభివృద్ధి కూడా ఈ రివర్స్ మైగ్రేషన్ కు ఒక కారణం అవుతోంది. అదే విధంగా గన్ కల్చర్ కూడా అక్కడి వారిని కంగారు పెడుతోంది. గ్రీన్ కార్డ్ కోసం దశాబ్దాల నిరీక్షణ, జాతి వివక్ష వంటి సమస్యల వల్ల విసిగిపోయిన భారతీయ అమెరికన్లు ఇప్పుడు తమ మాతృభూమి వైపు చూడటం అమెరికా అగ్రరాజ్య హోదాకు ఒక సవాలుగా మారింది.

