ప్రస్తుత కాలంలో బరువు తగ్గడానికి నడక లేదా వాకింగ్ అనేది అత్యంత సులువైన, సురక్షితమైన మార్గంగా చాలా మంది భావిస్తారు. ప్రతిరోజూ 10 వేల అడుగులు నడిస్తే ఫిట్ గా ఉండవచ్చనే విషయం అందరికీ తెలిసిందే. కానీ, కేవలం ఒకే ఒక్క వారంలో ఒక కిలో బరువు తగ్గాలంటే రోజుకు ఖచ్చితంగా ఎన్ని అడుగులు నడవాలో ఎప్పుడైనా ఆలోచించారా..? శాస్త్రీయ లెక్కల ప్రకారం ఒక కిలో బరువు తగ్గడానికి శరీరంలో దాదాపు 7,700 క్యాలరీల లోటు ఏర్పడాలి. అంటే వారంలో ఒక కిలో తగ్గాలంటే రోజుకు కనీసం 1,100 క్యాలరీలు కరిగించాల్సి ఉంటుంది.
Also Read : హెచ్-1బీ వీసా.. కంపెనీలకు షాక్ ఇచ్చిన అమెరికా..!
సాధారణంగా ఒక వ్యక్తి 1,000 అడుగులు నడిస్తే కేవలం 40 నుండి 50 క్యాలరీలు మాత్రమే ఖర్చవుతాయి. ఈ లెక్కన కేవలం నడక ద్వారానే వారంలో ఒక కిలో బరువు తగ్గాలనుకుంటే, రోజుకు ఏకంగా 22,000 నుండి 27,500 అడుగులు నడవాల్సి ఉంటుంది. అయితే, ఒకేసారి రోజుకు ఇన్ని వేల అడుగులు నడవడం వల్ల కీళ్లపై తీవ్ర ఒత్తిడి పడటమే కాకుండా కండరాల నొప్పులు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే కేవలం వాకింగ్ పైనే ఆధారపడకుండా, నిపుణులు కొన్ని ప్రత్యామ్నాయ మార్గాలను సూచిస్తున్నారు.
Also Read : ఉమా అసహనానికి కారణం అదేనా..!
శరీరాన్ని కష్టపెట్టకుండా సులువుగా బరువు తగ్గాలంటే.. ప్రతిరోజూ తీసుకునే ఆహారంలో 500 క్యాలరీలను తగ్గించుకోవాలి. ఇలా డైట్ కంట్రోల్ చేయడం వల్ల మీ రోజువారీ వాకింగ్ టార్గెట్ 12,000 నుండి 15,000 అడుగులకు తగ్గిపోతుంది. అలాగే ఒకేసారి గంటల తరబడి నడవకుండా, రోజులో మూడు సార్లు 20 నిమిషాల చొప్పున విడతల వారీగా బ్రీస్క్ వాకింగ్ అంటే వేగంగా నడవడం చేయడం వల్ల ఎక్కువ క్యాలరీలు ఖర్చవుతాయి. వారంలోనే ఒక కిలో తగ్గాలనే కఠినమైన లక్ష్యాలు పెట్టుకోకుండా, ప్రతిరోజూ 10 వేల నుండి 12 వేల అడుగులు నడుస్తూ 10-15 రోజుల్లో ఒక కిలో బరువు తగ్గడం ఆరోగ్యానికి ఎంతో సురక్షితమని ఆరోగ్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

