టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని చిన్న వయసులోనే జట్టుకు కెప్టెన్ అయినప్పుడు, సీనియర్ ఆటగాళ్లు ఎవరూ ఎందుకు అభ్యంతరం చెప్పలేదనే విషయంపై లెజెండరీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. యువరాజ్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్ లాంటి ఎంతోమంది సీనియర్లు జట్టులో ఉన్నప్పటికీ 26 ఏళ్ల చిన్న వయసులోనే ధోనికి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించినప్పుడు ఆటగాళ్ల మధ్య విభేదాలు వచ్చాయంటూ గతంలో ఎన్నో వార్తలు వచ్చాయి. అయితే, తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన హర్భజన్ ఈ రూమర్లన్నింటినీ పూర్తిగా కొట్టిపారేశాడు.
Also Read : మళ్లీ మొదలుపెట్టారు.. బీ అలర్ట్..!
కెప్టెన్సీ మార్పుపై తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవని హర్భజన్ స్పష్టం చేశాడు. “సౌరవ్ గంగూలీ (దాదా) మమ్మల్ని, జహీర్ ఖాన్, యువరాజ్, సెహ్వాగ్ లాంటి ఆటగాళ్లను జట్టులోకి తెచ్చి ఒక పటిష్టమైన టీమ్‌ను నిర్మించారు. ధోని కెప్టెన్ అయ్యే సమయానికి ఇప్పటికే 7-8 ఏళ్లుగా కలిసి ఆడుతున్న అనుభవజ్ఞులైన ఆటగాళ్ల జట్టు సిద్ధంగా ఉంది. కెప్టెన్ ఒక్కడే అంతా కాదనే విషయం మాకు బాగా తెలుసు. మైదానంలో ఉన్న 11 మంది ఆటగాళ్లు రాణిస్తేనే కెప్టెన్ గొప్పగా కనిపిస్తాడు. ధోని సక్సెస్ వెనుక జట్టు ఉమ్మడి కృషి ఉంది” అని భజ్జీ వివరించాడు.
Also Read : రాచమల్లు.. బరితెగింపు అంటే ఇదే..!
ధోనిలోని అత్యుత్తమ గుణం ఏంటంటే, అతను ఎప్పుడూ ఏ ఆటగాడిపైనా తన నిర్ణయాలను బలవంతంగా రుద్దలేదు అని హర్భజన్ ప్రశంసించాడు. “జట్టులోని సీనియర్లకు ఏ వాతావరణంలో ఎలా ఆడాలో పక్కాగా తెలుసనే విషయం ధోనికి తెలుసు. అందుకే అతను ఆటగాళ్ల నుంచి అత్యుత్తమ ప్రదర్శనను ఎలా రాబట్టాలనే దానిపైనే మాత్రమే దృష్టి పెట్టాడు. అందులోనే అతను అసాధారణమైన విజయం సాధించాడు” అని హర్భజన్ పేర్కొన్నాడు. ధోని సారథ్యంలో భారత్ 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీలను గెలుచుకున్న సంగతి తెలిసిందే.


