సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక గ్లోబల్ అడ్వెంచర్ చిత్రం వారణాసి బాక్సాఫీస్ వేటకు ముందే సంచలనాలు సృష్టిస్తోంది. ఆర్ఆర్ఆర్ వంటి ఆస్కార్ విన్నింగ్ చిత్రం తర్వాత రాజమౌళి రూపొందిస్తున్న సినిమా కావడంతో, ఈ ప్రాజెక్ట్‌పై అంతర్జాతీయ స్థాయిలో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల కోసం ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ కళ్లు చెదిరే ఆఫర్ ఇచ్చినట్లు సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.
Also Read : సెంచరీ కొట్టిన జగన్.. ఏపీకి గెస్ట్‌గా వందోసారి..!
ఫిలిం నగర్ విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, వారణాసి అన్ని భాషల డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకోవడానికి నెట్‌ఫ్లిక్స్ సుమారు రూ.400 కోట్ల నుంచి రూ.450 కోట్ల వరకు వెచ్చించేందుకు ముందుకొచ్చినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈ డీల్ ఇదే ధరకు ఖరారైతే, భారతీయ సినీ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడైన ఓటీటీ చిత్రంగా వారణాసి సరికొత్త చరిత్ర సృష్టిస్తుంది. గతంలో పుష్ప 2, కల్కి 2898 AD వంటి పాన్-ఇండియా చిత్రాలు రూ.275 కోట్ల నుంచి రూ.375 కోట్ల మధ్యలో డిజిటల్ డీల్స్ చేసుకోగా, ఇప్పుడు వారణాసి ఆ రికార్డులన్నింటినీ దాటేసి రూ.450 కోట్ల మార్కును తాకడం విశేషం.
ఈ సినిమాకు ఇంత భారీ డిమాండ్ రావడం వెనుక బలమైన కారణాలు ఉన్నాయి. రాజమౌళికి ఉన్న గ్లోబల్ మార్కెట్‌తో పాటు, ఈ చిత్రంలో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, మలయాళ స్టార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఫారెస్ట్ అడ్వెంచర్, మైథలాజికల్ టచ్‌తో సాగే కథ కావడంతో, విదేశీ ప్రేక్షకుల్లో కూడా ఈ సినిమాపై విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఇంగ్లీష్ సహా పలు అంతర్జాతీయ భాషల్లో స్ట్రీమింగ్ చేసేందుకు వీలుగా నెట్‌ఫ్లిక్స్ ఈ మెగా డీల్‌ను దాదాపు ఖరారు చేసినట్లు సమాచారం.
Also Read : 10 లక్షల మందితో ‘మైటీడీపీ’ సరికొత్త చరిత్ర!
సుమారు రూ.1000 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి, కేవలం ఓటీటీ హక్కుల ద్వారానే దాదాపు సగం బడ్జెట్ వెనక్కి వచ్చే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే, తెలుగు రాష్ట్రాల హక్కులే సుమారు రూ.290 కోట్ల వరకు పలికే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. శాటిలైట్, ఆడియో హక్కులు కూడా కలుపుకుంటే విడుదలకు ముందే నిర్మాతలు భారీ లాభాల్లోకి వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ‘వారణాసి’ చిత్రాన్ని 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో గ్రాండ్‌గా విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.


