భారత్‌ను ప్రపంచ తయారీ కేంద్రంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘మేక్ ఇన్ ఇండియా’, ఆత్మనిర్భర్ భారత్, పీఎల్ఐ పథకాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సర్కార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ విధానాల వల్ల భారత్‌లో అవసరానికి మించి ఉత్పత్తి సామర్థ్యం పెరిగిపోతోందని, ఇది అమెరికా వ్యాపారాలకు, కార్మికులకు నష్టం కలిగిస్తోందని అమెరికా వాణిజ్య ప్రతినిధి కార్యాలయం ఆరోపించింది. దీనికి ప్రతిగా 1974 వాణిజ్య చట్టంలోని సెక్షన్ 301 కింద భారత ఉత్పత్తులపై 25 శాతం వరకు సుంకాలు విధించాలని అమెరికా ప్రతిపాదించింది.
Also Read : భారీగా పెరిగిన ఏపీ ఆదాయం.. !
126 పేజీల తమ దర్యాప్తు నివేదికలో అమెరికా ప్రధానంగా నాలుగు భారత విధానాలను తప్పుబట్టింది. దేశీయ డిమాండ్ కంటే ఎక్కువగా ఫ్యాక్టరీలను నిర్మించడం వల్ల, మిగులు ఉత్పత్తులను భారత్ తక్కువ ధరలకు విదేశాలకు ఎగుమతి చేస్తోందని వాషింగ్టన్ వాదిస్తోంది. పీఎల్ఐ స్కీమ్ కింద ఉత్పత్తిని పెంచిన కంపెనీలకు ప్రభుత్వం ఆర్థిక ప్రోత్సాహకాలు ఇవ్వడం, అలాగే ‘ఇండియా బ్రాండ్ ఈక్విటీ ఫౌండేషన్’ ద్వారా విదేశాల్లో భారత ఉత్పత్తులకు ప్రచారం కల్పించడం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో అమెరికా కంపెనీలు పోటీ పడలేకపోతున్నాయని అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది.
ముఖ్యంగా స్టీల్, సోలార్ మాడ్యూల్స్, ఫార్మాస్యూటికల్స్, వైద్య పరికరాలు, మరియు టెలికాం, ఎలక్ట్రానిక్స్ రంగాలలో భారత్ అతిగా ఉత్పత్తి చేస్తోందని అమెరికా ఆరోపించింది. అంతేకాకుండా, చైనా వంటి దేశాల నుంచి తక్కువ ధరకు ముడిసరుకులు, పెట్టుబడులు పొందుతూ భారత్ తక్కువ ఖర్చుతో వస్తువులను తయారు చేస్తోందని విమర్శించింది. భారత్‌లో కార్మిక చట్టాలు బలహీనంగా ఉండటం వల్ల తక్కువ వేతనాలతో ఉత్పత్తి వ్యయం తగ్గుతోందని, ఇది అమెరికా తయారీదారులకు ప్రతికూలంగా మారిందని యూఎస్‌టీఆర్ తన నివేదికలో పేర్కొంది.
Also Read : టీడీపీ ఎమ్మెల్యేలకు కొత్త తలనొప్పి.. మండల పార్టీ అధ్యక్షులు ఎందుకిలా..?
అమెరికా చేసిన ఈ ఆరోపణలను భారత ప్రభుత్వం పూర్తిగా తిరస్కరించింది. దేశంలో ఏ రంగంలోనూ అవసరానికి మించిన అదనపు ఉత్పత్తి సామర్థ్యం లేదని కేంద్ర వాణిజ్య శాఖ స్పష్టం చేసింది. మరోవైపు, ఈ 25 శాతం సుంకాలు ఇంకా తుది నిర్ణయం కాదని, ప్రస్తుతం ప్రతిపాదన దశలోనే ఉన్నాయని అమెరికా తెలిపింది. 2027 జనవరి 5 వరకు ప్రజాభిప్రాయ సేకరణ, జనవరి 25న బహిరంగ విచారణ తర్వాత తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఒకవేళ భారత్-అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదిరితే ఈ సుంకాలను 17 శాతానికి తగ్గించే అవకాశం ఉందని అమెరికా సంకేతాలిచ్చింది.


