వైసీపీలో నియోజకవర్గం నాయకత్వం పనితీరుపై ఇప్పుడు పెద్ద ఎతున చర్చకు కారణమైంది. స్థానిక ఎన్నికల్లో అభ్యర్థులకు అండగా నిలవని వారు, కార్యకర్తలకు అందుబాటులో ఉండని వారు, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఇన్చార్జుల పై చర్యలు తీసుకోవచ్చన్న భావనతో వైసీపీలో ప్రక్షాళన చర్చ మొదలైంది. సంక్రాంతి తర్వాత మార్పులు ఉంటాయని భావిస్తున్న తరుణంలో డిసెంబర్లోనే నిర్ణయాలు వెలువడవచ్చనే సంకేతాలు అందుతున్నాయి. అయితే ఎంతమందిని మారుస్తారు. ఎప్పుడు మారుస్తారనే అంశాలపై పార్టీలో జోరుగా కసరత్తు జరుగుతోంది. ఈ నేపథ్యంలో మార్పుల సంఖ్యకంటే, క్షేత్రస్థాయిలో పార్టీని నడిపించగల నాయకత్వాన్ని జగన్ ఎలా సిద్ధం చేస్తారన్నది రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే స్థానిక పోరులో పార్టీలో లోపాలు బయటపడిన నేపధ్యంలో ఈ మార్పు ప్రక్రియకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది.
Also Read : ప్రకాశం జిల్లాలో సంచలనం.. ఆ ఊరిలో ఓటుకు రూ.25 వేలు..!
స్థానిక సంస్థల ఎన్నికలు ఒక పార్టీకి గ్రామాల్లో ఉన్న బలంతో పాటు నాయకుల మధ్య సమన్యయాన్ని పరీక్షిస్తాయి. అభ్యర్థిని ఎంపిక చేయడం నుంచి నామినేషన్ దాఖలు, ప్రచారం, పోలింగ్ నిర్వహణ వరకు నియోజకవర్గ నాయకత్వం పాత్ర ఉంటుంది. ఈ దశల్లో సహకారం అందకపోతే వ్యక్తిగతంగా బలమైన అభ్యర్థి కూడా ఇబ్బంది పడవచ్చు. అందుకే స్థానిక ఎన్నికల ఫలితాలను కేవలం గెలుపోటముల లెక్కగా చూడకుండా, నాయకత్వ పనితీరును అంచనా వేసే అవకాశంగా వైసీపీ ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. బలమైన అభ్యర్థులను ముందుగానే గుర్తించాలని, అన్నిస్థాయిల నాయకులతో సంప్రదింపులు జరపాలని, స్థానిక నాయకత్వాన్ని నిరంతరం పర్యవేక్షించాలని జగన్ సెప్టెంబర్లో జరిగిన ప్రాంతీయ సమన్వయకర్తలకు సూచించారు. అభ్యర్థుల ఎంపికతో పాటు వారిని సమష్టిగా బలపరచడం కూడా నాయకుల బాధ్యతే. ఈ బాధ్యతను ఎవరు ఎంతవరకు నిర్వర్తించారనే చర్చ ఇప్పుడు బాగా జరుగుతోంది.
ఓటమి ఎదురైన ప్రతి చోటా అభ్యర్థి ఎంపిక, స్థానిక విభేదాలు, సామాజిక సమీకరణాలు, సంస్థాగత వనరులు,. ఎన్నికల నిర్వహణ పరిస్థితులను కలిపి చూడాలి. నాయకుడు ప్రయత్నించి ఓడిపోయారా, పోటీకి ముందే దూరమయ్యారా అనే తేడా చర్యలకు ప్రాతిపదిక కావాలి. జగన్ చేతిలో ‘కోవర్టుల జాబితా’ ఉందన్న ప్రచారం ఈ చర్చలో అత్యంత సున్నితమైన అంశం. కూటమి నాయకులతో కొందరు వైసీపీ నేతలు తెర వెనుక సంబంధాలు కొనసాగిస్తున్నారన్న ఆరోపణలు బాగా వినిపిస్తున్నాయి. రాజకీయ ప్రత్యర్థితో మాట్లాడటం, పార్టీ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేయడం వేర్వేరు అంశాలు. అభ్యర్థిని బలహీనపరచడం, పార్టీ వ్యూహాన్ని ప్రత్యర్థికి చేరవేయడం, ఉద్దేశపూర్వకంగా ఎన్నికల సహకారం నిలిపివేయడం వంటి ఆరోపణలతో నేతలపై చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
Also Read : చెక్ పెడితేనే మేలు.. లేదంటే అంతే సంగతులు..!
ఈ విషయంలో తొందరపాటు చర్యలు తీవ్ర అసంతృప్తిని పెంచుతాయనేది పార్టీ నేతల మాట. ఆధారాలున్నా చర్యలు తీసుకోకపోతే పనిచేసే కార్యకర్తల్లో నిరుత్సాహం ఏర్పడే ప్రమాదం కూడా ఉందంటున్నారు. అందువల్ల ఫిర్యాదుల పరిశీలన, సంబంధిత నాయకుడి వివరణ, క్షేత్రస్థాయి సమాచారం.. ఈ మూడ అంశాల ఆధారంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందంటున్నారు పార్టీ నేతలు.


