ఏపీ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రజలు ఎదుర్కొంటున్న క్షేత్రస్థాయి సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు, రాబోయే ఉగాది పండుగ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టనున్నట్లు పరివర్తన రాజనీతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు వి. విజయసాయి రెడ్డి ప్రకటించారు. న్యూఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ కీలక నిర్ణయాన్ని వెల్లడించారు. ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకోవడానికి రాష్ట్రంలోని ప్రతి గ్రామాన్ని సందర్శిస్తానని ఆయన స్పష్టం చేశారు.
Also Read : సంచలన చట్టానికి సిద్ధమైన చంద్రబాబు సర్కార్..!
ఈ సందర్భంగా తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలపై విజయసాయి రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై కేవలం రెండు కుటుంబాల ఆధిపత్యం మాత్రమే కొనసాగుతోందని, ఇది నిజమైన ప్రజా ప్రాతినిధ్యాన్ని అణచివేస్తోందని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో సామాజిక న్యాయం, అణగారిన వర్గాల సాధికారత సాధించడంతో పాటు కక్షపూరిత, ఫ్యాక్షన్ రాజకీయాల నుంచి రాష్ట్రానికి విముక్తి కలిగించడమే తమ పార్టీ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించేందుకు యువత క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించి, చట్టసభల్లో సభ్యులు కావాలని ఆయన పిలుపునిచ్చారు.
Also Read : కోర్టు విచారణల రికార్డింగ్ పై ఏపీ హైకోర్టు సంచలన ఉత్తర్వులు..!
మరోవైపు, విజయసాయి రెడ్డి ప్రకటించిన ఈ పాదయాత్ర షెడ్యూల్ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టబోయే పాదయాత్ర కంటే ముందే విజయసాయి రెడ్డి ప్రజల్లోకి వెళ్లే అవకాశం కనిపిస్తోంది. అయితే, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసుకునే క్రమంలో సాగే ఈ పాదయాత్రలో సామాన్య ప్రజల కంటే వైసీపీలో అసంతృప్త నాయకులు, ద్వితీయ శ్రేణి నేతలు ఆయన వైపు ఆకర్షితులయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామం రానున్న రోజుల్లో ఏపీ రాజకీయ సమీకరణాలను ఏ విధంగా మారుస్తుందో వేచి చూడాలి.


