ఒకప్పుడు మధ్యతరగతి కుటుంబానికి వారాంతపు వినోదం అంటే ముందుగా గుర్తొచ్చేది సినిమా హాల్. నెలకోసారి కుటుంబమంతా కలిసి సరదాగా థియేటర్‌కు వెళ్లి, ఇష్టమైన హీరో సినిమా చూసి, ఇంటర్వెల్లో చిన్నపాటి స్నాక్స్ తిని సంతోషంగా ఇంటికి వచ్చేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు సినిమా హాల్ గడప తొక్కాలంటేనే భయపడే దుస్థితి ఏర్పడింది. థియేటర్లలో టికెట్ ధరలతో పాటు మల్టీప్లెక్సులలో తినుబండారాల పేరుతో జరుగుతున్న నిలువుదోపిడీ సామాన్యుడి జేబుకు భారీ చిల్లు పెడుతోంది.
Also Read : చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్.. సేనా దేశాల్లో అరుదైన రికార్డు..!
ఇటీవల విజయవాడలోని ట్రెండ్‌సెట్ వంటి ప్రముఖ మల్టీప్లెక్స్‌కు వెళ్లిన ఒక సగటు ప్రేక్షకుడి అనుభవమే దీనికి నిలువెత్తు నిదర్శనం. ఎలాగోలా కష్టపడి టికెట్ కొనుక్కుని లోపలికి వెళ్తే, ఇంటర్వెల్లో స్నాక్స్ కౌంటర్ వద్ద ధరలు చూసి గుండె ఆగినంత పనవుతోంది. బయట మార్కెట్లో కేవలం రూ.20కి దొరికే వాటర్ బాటిల్ మల్టీప్లెక్స్‌లో ఏకంగా రూ.100 పలుకుతోంది. ఇక చిన్నపాటి వెజ్ రోల్స్ రూ.200, ఒక కప్పు పాప్‌కార్న్ రూ.300 నుంచి రూ.500 వరకు వసూలు చేస్తున్నారు.
ఇదొక్క ట్రెండ్‌సెట్ పరిస్థితి మాత్రమే కాదు, తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు ప్రతి మల్టీప్లెక్స్‌లోనూ ఇదే తరహా దోపిడీ నడుస్తోంది. ఒక నలుగురు సభ్యులు ఉన్న మధ్యతరగతి కుటుంబం థియేటర్‌కు వెళ్లి సినిమా చూడాలంటే టికెట్లు, ఆన్లైన్ బుకింగ్ ఛార్జీలు, పార్కింగ్ ఫీజు, ఇంటర్వెల్లో పాప్‌కార్న్, వాటర్ బాటిల్ అన్నీ కలిపి కనీసం రూ.2,500 నుంచి రూ.3,000 వరకు ఖర్చవుతోంది. పైగా బయటి నుంచి కనీసం ఒక మంచి నీళ్ల బాటిల్ కూడా లోపలికి అనుమతించకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆకాశాన్నంటే ధరలకు అక్కడే కొనాల్సి వస్తోంది.
Also Read : ‘ఆకాశంలో ఒక తార’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
కేవలం మూడు గంటల వినోదం కోసం వేల రూపాయలు ఖర్చు పెట్టే బదులు, అందులో సగం డబ్బుతో ఒక ఓటీటీ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఏడాది పొడవునా కుటుంబమంతా కలిసి ఇంట్లోనే వందలాది కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు హాయిగా చూడవచ్చని మిడిల్ క్లాస్ జనం లెక్కలు వేసుకుంటున్నారు. మల్టీప్లెక్సులలో ఈ అధిక ధరలకు అడ్డుకట్ట వేసి, సామాన్యుడికి అందుబాటులోకి తీసుకురాకపోతే భవిష్యత్తులో థియేటర్లు కేవలం ధనవంతుల వినోద కేంద్రాలుగా మాత్రమే మిగిలిపోయే ప్రమాదం ఉంది.


