కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టి ఏళ్లు గడుస్తున్నా, దాని తాలూకు దుష్ప్రభావాలు మాత్రం బాధితులను ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. కోవిడ్ బారిన పడి కోలుకున్న నాలుగేళ్ల తర్వాత కూడా ‘లాంగ్ కోవిడ్’ సమస్యలతో బాధపడుతున్న వారిలో సగం మందికి పైగా అసహజమైన శ్వాసకోశ ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. స్వీడన్‌లోని స్టాక్‌హోమ్‌లో ఉన్న ప్రత్యేక పోస్ట్-కోవిడ్ క్లినిక్‌లో 288 మంది వయోజనులపై సుమారు 50 నెలల పాటు జరిపిన పరిశోధన వివరాలు ‘రెస్పిరేటరీ రీసెర్చ్’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.
Also Read : సిరాజ్‌పై వేటు వేసి 7 ఏళ్ల రికార్డుకు బ్రేక్: మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు..!
ఈ అధ్యయనంలో పాల్గొన్న 143 మందిలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీలో అసౌకర్యం, తగినంత గాలి అందకపోవడం వంటి లక్షణాలు తీవ్రంగా ఉన్నట్లు గుర్తించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, కోవిడ్ సోకిన సమయంలో ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేని వారికి, తక్కువ వయసు ఉన్నవారికి, ముఖ్యంగా మహిళల్లో ఈ దీర్ఘకాలిక శ్వాస సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నట్లు పరిశోధకులు తెలిపారు. సాధారణ ఊపిరితిత్తుల పరీక్షల్లో ఎలాంటి పెద్ద లోపాలు కనిపించకపోయినా, నడవడం లేదా వ్యాయామం చేసే సమయంలో వీరు త్వరగా అలసిపోతున్నట్లు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నట్లు తేలింది.
Also Read : టీడీపీ ఎమ్మెల్యే ఆడియో లీక్.. ఎందుకు ఈ నోటి దూల..?
అంతేకాకుండా, ఈ శ్వాసకోశ సమస్యలు ఉన్నవారిలో నిలబడినప్పుడు గుండె వేగం అసాధారణంగా పెరిగే ‘పాట్స్’ అనే నాడీ వ్యవస్థ సంబంధిత సమస్య, అలాగే మానసిక ఒత్తిడి కూడా ఎక్కువగా ఉన్నట్లు అధ్యయనం స్పష్టం చేసింది. కరోనా ఇన్ఫెక్షన్ తగ్గిన తర్వాత కూడా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, విపరీతమైన అలసట వంటి లక్షణాలు కొనసాగుతుంటే నిర్లక్ష్యం చేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు. కేవలం సాధారణ పరీక్షలతో సరిపెట్టకుండా, శ్వాస విధానాన్ని అంచనా వేసే ప్రత్యేక పరీక్షలు చేయించుకుని వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకోవడం అవసరమని పరిశోధకులు పేర్కొన్నారు.


