విశాఖపట్నంలోని రుషికొండపై నిర్మించిన విలాసవంతమైన భవనాల భవిష్యత్ వినియోగంపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. జగన్ హయాంలో దాదాపు 500 కోట్ల రూపాయ ప్రజాధనంతో నిర్మించిన ఈ ప్యాలెస్‌ను ప్రభుత్వ కార్యాలయాలుగా కాకుండా, పర్యాటక ఆదాయ వనరుగా మార్చాలని కేబినెట్ నిర్ణయించింది. ఇందులో భాగంగా, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో ప్రముఖ అంతర్జాతీయ హాస్పిటాలిటీ సంస్థలకు అప్పగించడానికంటే ముందే, సాధారణ ప్రజల సందర్శనకు అవకాశం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Also Read : ముంబై బాస్ మళ్లీ రోహితే.. కెప్టెన్‌గా హిట్‌మ్యాన్ రీఎంట్రీ!
ప్రజల సొమ్ముతో కట్టిన ఈ అత్యంత ఖరీదైన భవనాల్లో ఏముందో అందరూ స్వయంగా చూసేందుకు వీలుగా, రాబోయే నాలుగు నెలల పాటు అంటే దాదాపు 120 రోజుల పాటు సందర్శనకు అనుమతి ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేక టికెట్ విధానాన్ని అమలు చేయాలని యోచిస్తుండగా, టికెట్ ధర, సందర్శన వేళలకు సంబంధించిన పూర్తి మార్గదర్శకాలను పర్యాటక శాఖ త్వరలోనే ఖరారు చేయనుంది.
మరోవైపు, ఈ భవనాలను PPP విధానంలో ప్రపంచ స్థాయి లగ్జరీ రిసార్ట్ లేదా హాస్పిటాలిటీ ప్రాజెక్టుగా అభివృద్ధి చేసే ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇప్పటికే ఈ ప్రాజెక్టుపై ఆసక్తి వ్యక్తం చేస్తూ టాటా గ్రూప్, లీలా ప్యాలెసెస్, అట్మాస్ఫియర్ కోర్ వంటి దిగ్గజ సంస్థలతో సహా మొత్తం 9 కంపెనీలు పర్యాటక శాఖను సంప్రదించాయి. రాబోయే 120 రోజుల్లోగా ఈ సంస్థల ప్రతిపాదనలను పరిశీలించి తుది నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
Also Read : ఢిల్లీ రాజకీయాలపై చంద్రబాబు ఫోకస్.. ఎంపీలకు కీలక ఆదేశాలు..!
దీంతో పాటు, రుషికొండ ప్రాజెక్టుకు సంబంధించి 2019 నాటి కోస్తా నియంత్రణ మండలి నిబంధనల సడలింపులకు అనుగుణంగా, అక్కడ అందుబాటులో ఉన్న మరో నాలుగు ఎకరాల స్థలంలో అదనపు నిర్మాణాలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాంతంలో గరిష్టంగా 150 అదనపు గదులను నిర్మించుకునే వెసులుబాటు కల్పించనున్నారు. ఏపీ మంత్రి మండలి తీసుకున్న నిర్ణయం వైసీపీ అధినేత జగన్‌కి మింగుడు పడడం లేదని తెలుస్తోంది.. భార్య భారతి డ్రీమ్ హౌజ్‌గా దీనిని చెబుతారు వైసీపీ నేతలు కొందరు.. అలాంటి ప్యాలెస్‌ని ప్రజల సందర్శన కోసం ఓపెన్ చేయడం సంచలనంగా మారింది.


