ఏపీ రాజకీయాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన పొగాకు వ్యాపారి కుమారుడి కిడ్నాప్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉంటూ గత కొన్ని రోజులుగా పోలీసులకు దొరకకుండా పరారీలో ఉన్న గుంటూరు తూర్పు నియోజకవర్గ వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే షేక్ మహమ్మద్ ముస్తఫాను ఏలూరు జిల్లా నూజివీడు పోలీసులు గుజరాత్ లో అదుపులోకి తీసుకున్నారు. ఈ అరెస్ట్ సమాచారాన్ని వైకాపా సీనియర్ నేత అంబటి రాంబాబు సైతం సోషల్ మీడియా వేదికగా ధృవీకరించారు.
Also Read : దమ్ముంటే పట్టుకోండి చూద్దాం.. వైసీపీ నేత సవాల్..!
కొద్దిరోజుల క్రితం కొయ్యలగూడెం నుండి గుంటూరుకు పొగాకు లోడుతో వెళ్తున్న ఒక వాహనాన్ని నూజివీడు సమీపంలోని పెట్రోల్ బంక్ వద్ద కొందరు వ్యక్తులు అడ్డుకున్నారు. ఆ వాహనంలో ప్రయాణిస్తున్న పొగాకు వ్యాపారి సూర్యచంద్రం కుమారుడు అభి, డ్రైవర్ బాలరాజు, గుమస్తాలను దుండగులు బలవంతంగా కిడ్నాప్ చేశారు. బాధితులను గుంటూరులోని ఒక గెస్ట్ హౌస్ కు తరలించి నిర్బంధించారు. ఆ తర్వాత వ్యాపారి సూర్యచంద్రానికి ఫోన్ చేసిన కిడ్నాపర్లు, తమకు రావాల్సిన వ్యాపార బకాయిల డబ్బులు వెంటనే ఇవ్వాలని, లేదంటే కొడుకు ప్రాణాలతో దక్కడని బెదిరింపులకు దిగారు.
ఈ బెదిరింపుల వెనుక మాజీ ఎమ్మెల్యే ముస్తఫా, ఆయన కుమారుడు బషీర్ ప్రమేయం ఉన్నట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదుతో తక్షణమే స్పందించిన నూజివీడు, పెదకాకాని పోలీసులు సంయుక్తంగా వ్యూహాత్మకంగా వ్యవహరించి బాధితులను సురక్షితంగా విడిపించారు. ఈ కిడ్నాప్ ఉదంతంపై నూజివీడు పోలీస్ స్టేషన్ లో మాజీ ఎమ్మెల్యే ముస్తఫా, ఆయన కుమారుడు బషీర్ తో పాటు మరికొందరిపై కిడ్నాప్, బలవంతపు వసూళ్లు, ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.
Also Read : రోజుకు రెండు అరటిపండ్లు తింటున్నారా..? ఈ విషయం తెలుసా..?
కేసు నమోదైనప్పటి నుండి మాజీ ఎమ్మెల్యే ముస్తఫా, ఆయన కుమారుడు బషీర్ తమ ఫోన్లను స్విచ్ఛాఫ్ చేసి పరారయ్యారు. పోలీసులు వీరి కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే ముస్తఫా గుజరాత్ లో దాక్కున్నట్లు సాంకేతిక ఆధారాల ద్వారా పక్కా సమాచారం అందుకున్న నూజివీడు ప్రత్యేక పోలీస్ బృందం, అక్కడికి వెళ్లి ఆయనను విజయవంతంగా అదుపులోకి తీసుకుంది. ముస్తఫాను ట్రాన్సిట్ వారెంట్‌పై ఆంధ్రప్రదేశ్ కు తీసుకువచ్చేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు.

