దక్షిణ భారతదేశంలో దశాబ్దాలుగా నలుగుతున్న కావేరీ నది జలాల వివాదం మరోసారి తీవ్ర రూపం దాల్చింది. తమ వాటా కావేరీ నీటిని తక్షణమే విడుదల చేసేలా కర్ణాటక ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ తమిళనాడు ప్రభుత్వం దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేసింది. వర్షాకాలం సగం ముగుస్తున్నా కర్ణాటక నుండి రావాల్సిన చట్టబద్ధమైన నీటి విడుదల కాకపోవడంతో తమిళనాడులోని డెల్టా ప్రాంత రైతాంగం తీవ్ర ఆందోళనలో పడిపోయింది.
Also Read : రోడ్డు ప్రమాదాలపై కేంద్రం సంచలనం.. అసలు ఏంటి ఈ V 2 V..?
ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తక్షణమే జోక్యం చేసుకుని తమిళనాడుకు న్యాయం చేయాలని, సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులను కర్ణాటక అమలు చేసేలా చూడాలని స్టాలిన్ సర్కార్ ఈ పిటిషన్ లో విజ్ఞప్తి చేసింది. ప్రతి ఏటా రుతుపవనాల సమయంలో ఈ రెండు పొరుగు రాష్ట్రాల మధ్య కావేరీ రచ్చ మామూలైపోయింది. కావేరి నదిపై ఉన్న తమ జలాశయాల్లో సరిపడా నీటి నిల్వలు లేవని, తమ సొంత తాగునీటి మరియు సాగునీటి అవసరాలకే నీరు చాలడం లేదంటూ కర్ణాటక ప్రభుత్వం నీటి విడుదలను నిలిపివేయడంపై తమిళనాడు మండిపడుతోంది.
Also Read : సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. సహజీవనంలో ఉన్న మహిళలకూ ఆ సెక్షన్..!
కావేరీ వాటర్ మేనేజ్‌మెంట్ అథారిటీ నిర్దేశించిన నిబంధనల ప్రకారం జూన్, జూలై నెలలకు సంబంధించిన నీటిని కర్ణాటక కావాలనే తొక్కిపెట్టిందని తమిళనాడు ఆరోపిస్తోంది. కర్ణాటక ఏకపక్ష నిర్ణయాల వల్ల మెట్ట ప్రాంతాల్లోని కురువై పంటలు ఎండిపోయే ప్రమాదం పొంచి ఉందని, ఈ జలాల రచ్చకు శాశ్వత పరిష్కారం చూపాల్సిన బాధ్యత అత్యున్నత న్యాయస్థానంపైనే ఉందని తమిళనాడు తన పిటిషన్ లో స్పష్టం చేసింది. మరోవైపు, ఈ వివాదం రాజకీయంగా కూడా ఇరు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. సుప్రీంకోర్టులో తమిళనాడు పిటిషన్ వేయడంపై కర్ణాటక ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ప్రకృతి వైపరీత్యాలు, వర్షపాతం తగ్గినప్పుడు ఇరు రాష్ట్రాలు సమానంగా నష్టాన్ని పంచుకోవాలనే డిస్ట్రెస్ షేరింగ్ ఫార్ములాను పాటించాలని కర్ణాటక వాదిస్తోంది.

