ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల సవరణలో ఇంటింటి సర్వే పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. అయితే అదంతా మొక్కుబడిగా జరిగిందని.. అందుకు నిదర్శనం భారీగా జారీ అవుతున్న నోటీసులే అంటున్నారు వైసీపీ నేతలు. పై అధికారుల ఒత్తిడితో అడ్డదిడ్డంగా మ్యాపింగ్ చేయడంతో భారీగా నోటీసులు జారీ అవుతున్నాయని ఆరోపిస్తున్నారు. సర్వే తర్వాత విడుదల చేసిన ముసాయిదా ఓటర్ల జాబితాలో ఇప్పటికే 44,89,512 మంది ఓటర్లను తొలగించగా.. 44,21,763 మంది ఓటర్లకు మీ వివరాలు సరిగా లేవంటూ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులకు సరైన సమాధానం ఇవ్వకపోతే ఆ ఓట్లను పూర్తిగా తొలగిస్తారు.
Also Read : కృష్ణా జలాల వాటాపై క్లారిటీ..!
ఈ నోటీసులపై ఇప్పుడు వైసీపీ నేతలు ఘాటు విమర్శలు చేస్తున్నారు. ఇంటింటి సర్వే అస్తవ్యస్తంగా జరిగిందని ఆరోపిస్తున్నారు. ఒక వ్యక్తికి ఇద్దరు పిల్లలుంటే.. ఆరుగురు అంతకంటే ఎక్కువ మంది సంతానం ఉన్నట్లు చూపడం, కుమారుడి కంటే తండ్రి వయస్సు తక్కువగా ఉండటం, ముసాయిదా జాబితాలో ఉన్న తండ్రి పేరుకు, 2002 ఓటర్ల జాబితాలోని తండ్రి పేరుకు పొంతన లేకపోవడం.. తల్లిదండ్రులు, పిల్లల మధ్య వయస్సు 50 ఏళ్ల అంతరం ఉండటం కనిపించిందంటున్నారు వైసీపీ నేతలు. మరికొన్ని చోట్ల ఓటరు తాత, నానమ్మల వయస్సు 40 ఏళ్ల కంటే తక్కువగా ఉందంటున్నారు.
అయితే వైసీపీ నేతల ఆరోపణలను అధికారులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ముసాయిదా ఓటర్ల జాబితాలో అస్తవ్యస్త సమాచారం వల్లే 44,21,763 మంది ఓటర్లకు ప్రస్తుతం నోటీసులు జారీ చేసినట్లు స్పష్టం చేశారు. ఇలా జారీ చేసిన నోటీసులోని ఓటర్ల వివరాలను పోలింగ్ స్టేషన్లు, జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయాల వద్ద ప్రదర్శనగా ఉంచనున్నారని అదనపు ప్రధాన ఎన్నికల అధికారి ఢిల్లీరావు తెలిపారు. 44.21 లక్షల నోటీసుల్లో 7.3 లక్షల మ్యాపింగ్ కాని ఓటర్లు ఉండగా, మరో 36.5 లక్షల మంది ఓటర్ల సమాచారం అస్పష్టంగా లేక నమోదులో చిన్న పొరపాట్లతో ఉన్నట్లు గుర్తించినట్లు ఢిల్లీరావు తెలిపారు. గత ఓటర్ల జాబితాలో ఉన్న పేరుకు, ఇప్పుడు ఓటర్ల జాబితాలోని పేరు స్పెల్లింగ్ తేడా ఉండటం, లేదా తల్లిదండ్రుల పేర్లు, ఇంటి పేర్లలో తేడా ఉండటంతో ఈ నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు.
Also Read : బీసీసీఐలో వీవీఎస్ లక్ష్మణ్‌కు మోస్ట్ పవర్ఫుల్ పోస్ట్..?
ఇలా నోటీసులు జారీ అయిన వారు సరైన ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. అత్యధికంగా తిరుపతి జిల్లాలో 4 లక్షలు పైగా నోటీసులు జారీ కాగా, ఆ తర్వాత అనంతపురం, కడప, శ్రీ సత్యసాయి, పల్నాడు, విశాఖ, నెల్లూరు వంటి జిల్లాలున్నాయి. ఈ నోటీసులను సెప్టెంబర్ 28లోగా పరిష్కరించి, అక్టోబర్ 3న తుది ఓటర్ల జాబితాను విడుదల చేస్తారు. అలాగే పోలింగ్ బూత్‌ల రేషనలైజేషన్ తర్వాత ఒకే కుటుంబంలోని ఓటర్లు వేర్వేరు పోలింగ్ కేంద్రాలకు మారితే.. వారు ఫారం 8 ద్వారా ఒకే పోలింగ్ బూత్‌లోకి మార్చుకోవాల్సిందిగా అధికారులు కోరుతున్నారు.

