దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య, శవం డోర్ డెలివరీ కేసులో నిందితుడు వైసీపీ ఎమ్మెల్సీ అనంత సత్య ఉదయ భాస్కర్.. అలియాస్ అనంత బాబు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. తానే హత్య చేసినట్లు పోలీసుల ఎదుట ఒప్పుకున్న అనంతబాబు.. కోర్టులో మాత్రం తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెబితే చస్తారంటూ సాక్షులను బెదిరిస్తున్నాడు. కనీసం శవం కూడా దొరకదని సాక్షులను భయపెట్టిన అనంతబాబు.. వారికి రూ.3 లక్షలు ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. అయితే కూటమి ప్రభుత్వంలో తమకు న్యాయం జరుగుతుందని భావించిన సాక్షులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఎమ్మెల్సీ అనంతబాబు ఇంటికి వచ్చారు. అయితే ఇక్కడే అసలు కథ మొదలైంది.
Also Read : మంగళగిరిలో ఐపీఎల్ జాతర.. నారా లోకేష్ సంచలన నిర్ణయం..!
అనంతబాబు ఇంటికి పోలీసులు వచ్చే లోపే గన్‍మెన్‌కు కూడా చెప్పకుండా ఓ ఎమ్మెల్సీ, హత్య కేసు నిందితుడు సైలెంట్‌గా బండి ఎక్కి పారిపోయాడు. ఈ విషయం పోలీసులు వచ్చే వరకు గన్ మెన్ కూడా బయటపెట్టలేదు. ఎక్కడికి వెళ్లాడు అంటే.. నాకేం చెప్పలేదు సార్.. అని ఓ జవాబు. ఓ ఎమ్మెల్సీకి రక్షణ ఇవ్వాల్సిన గన్ మెన్ అంత నిర్లక్ష్యంగా ఎలా ఉన్నాడు..? ఇక్కడ మరో విషయం ఏమిటంటే.. పోలీసులు ఇంటికి వస్తున్నారని అనంతబాబుకు ముందే ఎలా తెలిసింది. భార్యభర్తలిద్దరూ ఒకేసారి ఎలా పారిపోయారు..? అంటే అసలు తప్పు పోలీసుల్లోనే ఉందనే మాట క్లియర్‌గా అర్థమవుతుంది. సర్పవరం పోలీస్ స్టేషన్ నుంచి సమాచారం నేరుగా అనంతబాబుకు చేరుకుంది. దాంతో వాళ్ల రావడం కంటే ముందే అనంతబాబు సైలెంట్‌గా జంప్ అయ్యాడు. ఈ విషయం మీడియా ద్వారా లీక్ అవ్వడంతో.. సీఐపై పోలీసు ఉన్నతాధికారులు కంటి తుడుపు చర్యలు తీసుకున్నారు.
అనంతబాబు కోసం ఏకంగా 5 టీమ్‌లను ఏర్పాటు చేశారు. ఈ 5 టీమ్‌లు కూడా విశాఖ, బెంగళూరు, విజయవాడ.. అంటూ ఎక్కడెక్కడో నాలుగు రోజుల పాటు తిరిగినా కూడా అనంతబాబు ఆచూకీ కనిపెట్టలేకపోయాయి. అయితే ఇక్కడ మరో ట్విస్ట్ ఏమిటంటే.. 5 ప్రత్యేక బృందాలు, తూర్పు, కాకినాడ, కోనసీమ జిల్లాల పోలీసుల కళ్లు గప్పి.. ఇంకా చెప్పాలంటే వాళ్లేవరికి కనిపించకుండా.. మారు వేషంలో అయితే కాదు.. అదే గడ్డం, అదే తెల్ల చొక్కాతో నేరుగా రాజమండ్రికి కోర్టుకు వచ్చారు అనంతబాబు దంపతులు. వాళ్లు కోర్టుకు వచ్చే వరకు పోలీసులకు కనీస సమాచారం కూడా లేదంట. ఇక్కడే పోలీసుల పనితీరుపై అనుమానాలు వస్తున్నాయి.
Also Read : మంగ్లీ అండ్ టీమ్ చేసిన స్కామ్ ఏమిటీ..?
నిజానికి ప్రస్తుతం టెక్నాలజీ ఎంతో అందుబాటులోకి వచ్చింది. టెక్నాలజీ సాయంతో ఎలాంటి చిన్న క్లూ కూడా లేని కేసులను పోలీసులు ఎంతో చాకచక్యంతో ఛేదించి నిందితులను అరెస్టు కూడా చేశారు. అంతేందుకు ఇటీవల తమిళనాడులో తండ్రి కొడుకుల లాకప్ డెత్ కేసును కూడా సీసీ కెమెరాలు, గూగుల్ టేక్ అవుట్, సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగానే నిందితులైన పది మంది పోలీసులకు కోర్టు ఉరి శిక్ష విధించేలా చేశారు. మరి అలాంటి సాంకేతికత ఏపీ పోలీసులకు లేదా.. అంటే లేదనే చెప్పాలి. ఎందుకంటే.. ఒక ఎమ్మెల్సీ కనిపించకుండా పోతే కనీసం కనిపెట్టలేకపోయారు. ఒక దళితుడిని హత్య చేసి శవాన్ని డోర్ డెలివరీ చేసిన కేసులో ప్రధాన నిందితుడు పారిపోతే.. పట్టుకోలేకపోయారు ఏపీ పోలీసులు.
ఇక్కడ మరో విచిత్రమైన విషయం ఏమిటంటే.. హత్య కేసు నిందితుడు, ఎమ్మెల్సీ అనంతబాబు తన ఫోన్ స్విచ్ఛాఫ్ చేయలేదు. పైగా ఆ ఫోన్ తనతోనే ఉంచుకున్నాడు. ఆ ఫోన్ నుంచే పూటకు పది సార్లు తన లాయర్‌తో ఫోన్ మాట్లాడినట్లు తెలుస్తోంది. అలాగే అదే ఫోన్‌తో తన అనుచరులను రాజమండ్రి కోర్టు దగ్గరికి రమ్మని పురమాయించాడు కూడా. ఇంత మందికి అందుబాటులో ఉన్న అనంతబాబు ఫోన్ మాత్రం.. పోలీసులకు కలవలేదు. గన్ మెన్‌కు ఎమ్మెల్సీ ఏం చేస్తున్నాడో తెలియదు.. సాక్షులను బెదిరించిన విషయం తెలియదు.. ఇంటి నుంచి వెళ్లిపోతున్న విషయం తెలియదు.. ఇక అనంతబాబు కోర్టుకు వస్తున్నాడనే విషయం ఇంటెలిజెన్స్ బృందానికి తెలియలేదు అంటే.. ఇది అనంతబాబు గొప్పతనమా.. లేక పోలీసుల వైఫల్యమా.. అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. పరారీలో ఉన్న ఓ హత్య కేసు నిందితుడితో పాటు ఆయన భార్య సెల్ ఫోన్ సిగ్నల్స్‌ను పోలీసులు ట్రాక్ చేయలేకపోయారంటే.. పోలీసు వ్యవస్థ ఎలా పని చేస్తుందో ఇట్టే అర్థమవుతోంది.
Also Read : అసలు బాబుకు లేని నొప్పి నీకెందుకు..?
నిజానికి అనంతబాబును కాపాడుతున్నది ఓ టీడీపీ ఎమ్మెల్యే అనే ఆరోపణలు చాలా రోజులుగా వినిపిస్తున్నాయి. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకు అనంతబాబు స్వయానా మేనల్లుడు. అందుకే అనంతబాబు విషయంలో కూటమి సర్కార్ హోమ్ మంత్రి వంగలపూడి అనిత ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే మాట వినిపిస్తోంది. దళిత మహిళా హోమ్ మంత్రి గారు దళితు డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబానికి చక్కగా న్యాయం చేస్తున్నారు అని కూటమి నేతలే సెటైర్లు వేస్తున్నారు.
అనంతబాబు తన లాయర్ల బృందంతో కలిసి కోర్టుకు వచ్చిన తర్వాత తీరిగ్గా పోలీసులంతా కోర్టు బయట హడావుడి చేశారు. అనంతబాబును అరెస్టు చేసేందుకు అన్నట్లుగా బిల్డప్ ఇచ్చారు. కానీ అనంతబాబు మాత్రం తన చుట్టూ ఓ పది మంది లాయర్లను పెట్టుకుని.. మధ్యలో ఎలాంటి మాస్క్ లేకుండా కోర్టు బయటకు వచ్చి.. వైసీపీ అభిమానులకు అభివాదం చేస్తూ.. పోలీసులు, మీడియాను చూసి.. గర్వంతో నవ్వుతూ కారు ఎక్కారు. అనంతబాబు కోర్టు నుంచి బయటకు వచ్చిన తర్వాత పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంటే.. ఇది పోలీసుల గొప్పతనమా.. లేక వైఫల్యమా.. అనేది ప్రజలే నిర్ణయిస్తారు.

