కూటమి ప్రభుత్వంలో పిఠాపురం నియోజకవర్గం ఇప్పుడు ఒక పొలిటికల్ ల్యాబ్ లా మారింది. 2024 లో జరిగిన ఓ ప్రయోగం.. సైడ్ ఎఫెక్ట్స్ ఇప్పటికీ స్టేట్ వైడ్ గా కనపడుతున్నాయి. డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్ గెలుపు కోసం తన రాజకీయ జీవితాన్ని అప్పుడు.. పణంగా పెట్టిన మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ, ఇప్పుడు అదే నియోజకవర్గంలో రచ్చకు కేంద్రబిందువుగా మారారు. తాజాగా పిఠాపురం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ కార్యాలయం వద్ద జరిగిన ఘర్షణ కేవలం ఫోటో కోసం జరిగింది మాత్రమే కాదు, దీని వెనుక లోతైన రాజకీయ కారణాలు ఉన్నాయనే మాట రాజకీయ వర్గాల్లో బలంగా వినపడుతోంది.
వర్మ త్యాగాన్ని గౌరవిస్తూ ప్రభుత్వం ఇప్పటికే కాకినాడలో తాజ్ తరహా ఫైవ్ స్టార్ హోటల్ నిర్మాణానికి దాదాపు 3.64 ఎకరాల విలువైన భూమిని కేటాయించింది. సుమారు రూ.175 కోట్ల విలువ చేసే ఈ భూమిని వర్మకు సంబంధించిన సంస్థకు లీజుకు ఇవ్వడంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. అయితే, ప్రభుత్వం మాత్రం ఇది టూరిజం పాలసీలో భాగంగా ఇచ్చినట్లు చెబుతున్నా, రాజకీయ వర్గాల్లో మాత్రం ఇది వర్మకు త్యాగానికి ఇచ్చిన గిఫ్ట్ అనే చర్చ నడుస్తోంది. మరి అయినా వర్మ ఎందుకు గొడవ చేస్తున్నారు..?
Also Read : అనంతబాబు ఎస్కేప్.. పోలీస్ శాఖ సీరియస్ యాక్షన్..!
ప్రభుత్వం నుంచి భారీ ఆర్థిక వెసులుబాటు లభించినా, వర్మ పదే పదే ప్రోటోకాల్ అంశాన్ని ఎందుకు తెరపైకి తెస్తున్నారనే దానికి పలు ప్రధాన కారణాలు ఉన్నాయనే మాట పిఠాపురంలో వినపడుతోంది. ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ కోసం సీటు వదులుకున్న వర్మకు ఎమ్మెల్సీ పదవి లేదా ఏదైనా కీలక కార్పొరేషన్ ఛైర్మన్ పదవి ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ ఏళ్ళు గడుస్తున్నా ఆ దిశగా అడుగులు పడకపోవడంతో వర్మ కొంత అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది.
మరొకటి.. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ చుట్టూ ఇప్పుడు కొత్త కోటరీ ఏర్పడింది. ముఖ్యంగా గతంలో పవన్ పై పోటీ చేసిన పెండెం దొరబాబు వంటి నేతలు ఇప్పుడు జనసేనలో చేరి చక్రం తిప్పుతుండటం వర్మకు మింగుడు పడటం లేదు. దొరబాబును వైసీపీ కోవర్టు అని బహిరంగంగానే విమర్శిస్తూ, తన రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి వర్మ ప్రయత్నిస్తున్నారు. నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలను జనసేన నేతలు తొక్కేస్తున్నారనేది వర్మ ప్రధాన ఆరోపణ. చంద్రబాబు ఫోటో లేకపోవడాన్ని ప్రశ్నించడం ద్వారా, తను పార్టీ గౌరవం కోసం పోరాడుతున్నాననే కలర్ ఇస్తూ టీడీపీ క్యాడర్ ను తన వెంటే ఉంచుకునే ప్రయత్నం చేస్తున్నారు.
Also Read : వాట్సాప్ యూనివర్సిటీపై సుప్రీం సంచలన కామెంట్స్..!
చంద్రబాబు దృష్టిలో ఇప్పుడు ప్రభుత్వం, కూటమి ధర్మం ముఖ్యం. అందుకే చిన్న చిన్న ఫోటోల గురించి ఆయన పట్టించుకోవడం లేదు. కానీ వర్మకు ఇది కేవలం ఫోటో సమస్య కాదు, తన అస్తిత్వ పోరాటంగా కనపడుతోందనే మాట వినపడుతోంది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ముందు తన ప్రాధాన్యత తగ్గిపోకూడదని, అధికారులు తనను విస్మరించకూడదని ఆయన భావిస్తున్నారు. చంద్రబాబు ఫోటోను అడ్డం పెట్టుకుని నిరసన తెలపడం ద్వారా, తాను పార్టీ విధేయుడిని అని క్యాడర్ ముందు మార్కులు కొట్టేయడమే ఆయన లక్ష్యం కావచ్చు అంటున్నారు పరిశీలకులు.
అదే విధంగా తనను కాదని నియోజకవర్గంలో ఏ పనీ జరగకూడదనే బలమైన హెచ్చరికను అధికారులకు, జనసేన నేతలకు పంపడమే వర్మ అసలు ఉద్దేశ్యంగా కనపడుతోందనే మాట కూడా పొలిటికల్ సర్కిల్స్ లో వినపడుతోంది. ఇక వర్మ హడావుడి గురించి అటు టీడీపీ క్యాడర్ కూడా కాస్త సీరియస్ గానే తీసుకుని, రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. అయితే, వర్మ చేస్తున్న ఈ నిరసనలపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కూటమిలో క్రమశిక్షణ ముఖ్యమని, చిన్నపాటి ఫ్లెక్సీల కోసం రోడ్డుపైకి వచ్చి తన్నుకోవడం కూటమి ప్రతిష్టను దెబ్బతీస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో మాట్లాడి వర్మకు గట్టి వార్నింగ్ ఇవ్వాలని ఆదేశించారు.

