వైసీపీకి రాజీనామా చేసి, జనసేన తీర్ధం పుచ్చుకున్న ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజీనామా వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. గతేడాది నవంబర్ లో ఆయన తన ఎమ్మెల్సీ పదవికి చేసిన రాజీనామాను శాసనమండలి చైర్మన్ తాజాగా తిరస్కరించారు. 2024 ఎన్నికలకు ముందే వైసీపీకి మరియు పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన ఆయన, అప్పట్లోనే తన లేఖను చైర్మన్ కు సమర్పించారు. అయితే, తన రాజీనామాను ఆమోదించకుండా చైర్మన్ కాలయాపన చేస్తున్నారని ఆరోపిస్తూ జయమంగళ గత ఏడాది హైకోర్టును ఆశ్రయించారు.
Also Read : అనంతలో లేడీ డాన్ రచ్చ.. షేక్ అవుతోన్న పోలీసు శాఖ..!
దీనిపై విచారణ జరిపిన కోర్టు, రాజీనామా అంశంపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే ఈ నెల మొదటి వారంలో ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ, మూడు వారాల్లోగా తుది నిర్ణయం తీసుకుంటామని హైకోర్టుకు నివేదించారు. తాజాగా ఈ వ్యవహారంపై స్పందించిన మండలి చైర్మన్, జయమంగళ వెంకటరమణ ఇచ్చిన సమాధానం ఏమాత్రం సంతృప్తికరంగా లేదని పేర్కొంటూ ఆయన రాజీనామాను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. రాజీనామా లేఖ సమర్పించిన తీరు లేదా దాని వెనుక ఉన్న కారణాలపై చైర్మన్ సంతృప్తి చెందకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Also Read : బీ అలర్ట్.. ముంచుకొస్తున్న ఎరువుల సంక్షోభం..!
ఈ నిర్ణయంతో జయమంగళ వెంకటరమణ తదుపరి అడుగులు ఎలా ఉండబోతున్నాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఆయన జనసేన కండువా కప్పుకున్నారు. డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్ స్వయంగా జయమంగళకు జనసేన కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఆయన జనసేనలో చేరడానికి ముందే తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. అయితే, సాంకేతికంగా ఆయన ఇంకా ఎమ్మెల్సీగానే కొనసాగుతున్నారు. రాజీనామా తిరస్కరణకు గురవడంతో, జయమంగళ వెంకటరమణ ఇప్పుడు జనసేన పార్టీ సభ్యుడిగా ఉంటూనే, శాసనమండలిలో ఎమ్మెల్సీగా కొనసాగాల్సి ఉంటుంది.

