ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో ఎవరూ ఊహించని ఫలితాలు వెల్లడయ్యాయి. తమిళనాడులో టీవీకే గెలవగా.. బెంగాల్, అసోం, పుదుచ్చేరిలో బీజేపీ పాగా వేసింది. కేరళంలో యూడీఎఫ్ అధికారం దక్కించుకుంది. అయితే ఈ ఎన్నికల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. తమిళనాడులో మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ ఓడిపోయారు. కొళత్తూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన స్టాలిన్.. టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు చేతిలో 9 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇక బెంగాల్ ఎన్నికల్లో కూడా మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఓడిపోయారు. భవానీపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మమతా.. బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి చేతిలో ఏకంగా 15 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. కేరళ మాజీ సీఎం పినరయ్ విజయన్ ధర్మాదం నియోజకవర్గం నుంచి పోటీ చేసి.. 19 వేల ఓట్ల తేడాతో గెలిచారు. అయితే ఆయన సాధించిన అధిక్యం ఈసారి బాగా తగ్గింది.
Also Read : నటన కోసం డిగ్రీ వదిలేసి.. సీఎం అయ్యాడు..!
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఒకటే చర్చ జరుగుతోంది. అదే చంద్రబాబు రికార్డు గురించి. దేశంలో ఎంతో మంది సీనియర్ నేతలున్నారు. వరుసగా ముఖ్యమంత్రులుగా గెలుస్తున్న నేతలు కూడా ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఇప్పటి వరకు ఓడిపోలేదు. అటు గుజరాత్ ముఖ్యమంత్రిగా, దేశ ప్రధానిగా కూడా వ్యవహరిస్తున్నారు. ఆయన పోటీ చేసిన ఒక్క ఎన్నికలో కూడా ఓడిపోలేదు. కానీ చంద్రబాబు మాత్రం 1983లో మాత్రమే చంద్రగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. మరి చంద్రబాబు ప్రత్యేకత ఏమిటనే ప్రశ్న అందరిలో వినిపిస్తోంది. అదే ఇప్పుడు హాట్ టాపిక్.
1995లో అనూహ్య పరిణామల మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టారు. నిజానికి 1983 వరకు చంద్రగిరి నుంచి రెండుసార్లు పోటీ చేసిన చంద్రబాబు.. 1989 ఎన్నికల నుంచి చిత్తూరు జిల్లా కుప్పం శాసనసభ నియోజకవర్గం నుంచి వరుసగా పోటీ చేస్తున్నారు. 1989, 94, 99, 2004, 2009, 14, 19, 24 ఎన్నికల్లో కుప్పం నుంచి వరుసగా 8 సార్లు గెలిచిన రికార్డు చంద్రబాబు నాయుడు సొంతం. అంతే కాదు.. 1994 నుంచి ఇప్పటి వరకు ఆయన మెజారిటీ 30 వేలకు తగ్గకుండా గెలుస్తున్నారు. దీనితో పాటు మరో రికార్డు కూడా చంద్రబాబు సొంతం. అదే ఇప్పుడు అన్ బ్రేకబుల్‌గా నిలిచింది.
సాధారణంగా ప్రధాని, ముఖ్యమంత్రి అభ్యర్థులు కూడా దేశ, రాష్ట్ర వ్యాప్త పర్యటనలతో పాటు తమ సొంత నియోజకవర్గాల్లో కూడా ప్రచారం చేసుకుంటారు. ప్రధాని మోదీ వారణాసి నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్ పులివెందులలో ప్రచారం చేశారు. స్టాలిన్ కొళత్తూర్‌లో, మమతా భవానీపూర్‌లో, పినరయ్ విజయన్ ధర్మాదంలో, విజయ్ పెరంబూర్‌లో, రేవంత్ రెడ్డి కొడంగల్‌లో, కేసీఆర్ సిద్ధిపేట, గజ్వేల్‌లో, పవన్ కల్యాణ్ పిఠాపురంలో ప్రచారం చేశారు. కానీ చంద్రబాబు మాత్రం.. తనదైన శైలిలో రికార్డు సృష్టించారు. 1999 ఎన్నికల నుంచి ఇప్పటి వరకు ఆయన కుప్పం నియోజకవర్గంలో ప్రచారం చేయలేదు సరి కదా.. కనీసం నామినేషన్ దాఖలు చేయలేదు, ఓటు వేయలేదు, కౌంటింగ్ హాల్‌లో కూడా అడుగు పెట్టలేదు.
Also Read : బ్రేకింగ్: ప్రభుత్వం ఏర్పాటు చేస్తా: విజయ్
ఎన్నికల ప్రకటన వెలువడిన నాటి నుంచి నోటిఫికేషన్ ముగిసే వరకు కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు కాలు పెట్టటం లేదు. అయినా సరే 1999 నుంచి ఇప్పటి వరకు ఆరుసార్లు చంద్రబాబును కుప్పం ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించారు. ఈ రికార్డు దేశంలో మరే రాజకీయ నేతకు అసాధ్యం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కనీసం నియోజకవర్గం వైపు కన్నెత్తి కూడా చూడని నేతలు ప్రజలు ఇంతగా ఎలా ఆదరిస్తున్నారంటే.. అది ఆ నేత చేసిన అభివృద్ధి, నియోజకవర్గం ప్రజల సమస్యల పరిష్కారం పట్ల చిత్తశుద్ధి అంటున్నారు.

