జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోదరుడు ఎమ్మెల్సీ నాగబాబుకు ఇచ్చిన మాటను ముఖ్యమంత్రి చంద్రబాబు నిలబెట్టుకున్నారు. నాగబాబుకు క్యాబినెట్లో చోటు కల్పిస్తామంటూ 2024 డిసెంబర్ నెలలో చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే సరిగ్గా ఏడాదిన్నర తర్వాత ఇచ్చిన హామీని చంద్రబాబు నిలబెట్టుకున్నారు. రాష్ట్రంలో పచ్చదనం, అడవుల విస్తరణ, పర్యావరణ పరిరక్షణకు మరింత ప్రాధాన్యం కల్పించే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పచ్చదనం, అడవుల పెంపకం, పర్యావరణ పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ హరితీకరణ, పునర్వనీకరణ, పర్యావరణ పరిపుష్టి సంఘం కార్యనిర్వాహక కమిటీ చైర్‌పర్సన్‌గా ఎమ్మెల్సీ కొణిదెల నాగేంద్రరావు.. నాగబాబును ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు పర్యావరణం, అటవీ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
Also Read : చినబాబుకు పట్టాభిషేకం.. ముహుర్తం ఫిక్స్..?
కార్యనిర్వాహక కమిటీ చైర్‌పర్సన్‌గా కొణిదెల నాగేంద్రరావు రాష్ట్రవ్యాప్తంగా పచ్చదనం పెంపు, అటవీ విస్తరణ, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాల సమన్వయం, అమలు, పర్యవేక్షణలో కీలక పాత్ర పోషించనున్నారు. జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన హరిత అభివృద్ధి సంస్థలతో సమన్వయం చేసుకుంటూ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లనున్నారు. చైర్పర్సన్ పదవికి క్యాబినెట్ స్థాయి హోదా కల్పించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈ హోదా చైర్‌పర్సన్‌గా కొనసాగుతున్న కాలంలో వర్తించే నిబంధనలు, షరతులకు లోబడి ఉంటుందని పేర్కొంది.
Also Read : కిమ్ జోంగ్ తో స్నేహానికి ట్రంప్ ట్రయల్స్..!
రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో అడవులు, చెట్ల విస్తీర్ణాన్ని గణనీయంగా పెంచడం ఈ సంఘం ప్రధాన లక్ష్యం. 2047 నాటికి రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో అడవులు, చెట్ల విస్తీర్ణాన్ని 50 శాతానికి పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. ఇందులో భాగంగా పెద్దఎత్తున మొక్కలు నాటడం, అడవుల విస్తరణ, పచ్చదనం పెంపు, పర్యావరణ పరిరక్షణ వంటి కార్యక్రమాలను చేపట్టనున్నారు. జిల్లా స్థాయిలోని హరిత అభివృద్ధి సంస్థల ద్వారా ఈ కార్యక్రమాలను అమలు చేయనున్నారు. రాష్ట్రంలో హరిత కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడం. వాటి పురోగతిని పర్యవేక్షించడం, వివిధ ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం సాధించడం చైర్పర్సన్ బాధ్యతల్లో కీలకం. భవిష్యత్ తరాలకు పచ్చని, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతోంది.

