Monday, August 17, 2026 01:57 PM
Monday, August 17, 2026 01:57 PM

బ్యాలెట్ విధానంలోనే స్థానిక ఎన్నికలు..!

ఏపీలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ఇప్పటికే తెలుగుదేశం, జనసేన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతలు ఆయా పార్టీల నేతలు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికల్లో తప్పకుండా గెలవాలని కూడా ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ఎన్నికల కమిషన్ సైతం ఎన్నికల నిర్వహణకు కసరత్తు ముమ్మరం చేసింది. త్వరలో సర్ ప్రక్రియ పూర్తి కానుంది. దీంతో ఆయా జిల్లాల్లో సిబ్బంది వివరాలు ఇవ్వాలంటూ ఇప్పటికే జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశించారు కూడా. ఈ నేపథ్యంలో అన్ని పార్టీల నేతలు ఎన్నికలకు సిద్ధం అవుతున్నాయి.

Also Read : కృష్ణా జలాల వాటాపై క్లారిటీ..!

పాత విధానంలోనే బ్యాలెట్ పేపర్‌తో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కసరత్తు ప్రారంభించింది. ఎన్నికల నిర్వహణకు సరిపడినన్ని బ్యాలెట్ బాక్స్‌లు ప్రస్తుతం ఏపీలో అందుబాటులో లేనందున పొరుగు రాష్ట్రాల నుంచి సమకూర్చుకోవాలని నిర్ణయించింది. గ్రామ పంచాయతీలతో పాటు మున్సిపల్ ఎన్నికలను కూడా బ్యాలెట్ విధానంలో నిర్వహించేలా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆలోచన చేస్తోంది. ఈ మేరకు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల ఎన్నికల కమిషన్లకు లేఖ రాసి 50 వేల చొప్పున మొత్తం 1.50 లక్షల బ్యాలెట్ బాక్స్‌లను సమకూర్చాలని కోరినట్లు అధికారులు తెలిపారు.

మన రాష్ట్రంలో చిన్న, పెద్దవి కలిపి దాదాపు 1.10 లక్షల బ్యాలెట్ బాక్స్‌లు అందుబాటులో ఉన్నప్పటికీ అందులో ఎక్కువ భాగం ప్రస్తుతం వినియోగానికి పనికి రావని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయ అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న వాటిలో 50 వేల లోపు మాత్రమే బ్యాలెట్ బాక్స్‌లు పోలింగ్ అవసరాలకు వినియోగించుకునే వీలుందని భావిస్తున్నారు. రాష్ట్రంలో మున్సిపల్, మండల, జిల్లా పరిషత్, గ్రామ పంచాయతీ ఎన్నికలు వరుసగా నిర్వహించే అవకాశం ఉన్నందున కనీసం 1.50 లక్షల బ్యాలెట్ బాక్స్‌లను అందుబాటులో ఉంచాలని కమిషన్ భావిస్తోంది.

మూడు పొరుగు రాష్ట్రాల నుంచి కనీసం లక్షకు తక్కువ కాకుండా బ్యాలెట్ బాక్సులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. జిల్లాల వారీగా ప్రస్తుతం వినియోగానికి పనికి వచ్చే బ్యాలెట్ బాక్స్ వివరాలు పంపాలని కలెక్టర్లకు లేఖలు పంపినట్లు సమాచారం. బ్యాలెట్ విధానంలోనే ఎన్నికల నిర్వహణ ఉంటుందన్న యోచనతో పంచాయుతీరాజ్, మున్సిపల్ శాఖల ఉన్నతాధికారులు సైతం బ్యాలెట్ పత్రాల ముద్రణకు అవసరమయ్యే బ్యాలెట్ పేపరు కొనుగోలుకు కసరత్తు మొదలు పెట్టారు.

Also Read : వైసీపీ నేతల ఓవరాక్షన్.. పోలీసుల రియాక్షన్..!

గ్రామ పంచాయతీ ఎన్నికలను బ్యాలెట్ విధానంలో కాకుండా తొలిసారి ఈవీఎంలతో నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ తొలుత భావించింది. కూటమి ప్రభుత్వంలో నీలం సాహ్ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా ఉండగా అన్ని స్థానిక సంస్థల ఎన్నికలను ఈవీఎంలతో నిర్వహించాలనే ఉద్దేశంతో ఈవీఎంల కొనుగోలుకు పంచాయతీరాజ్, మున్సిపల్ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. గ్రామ పంచాయతీ ఎన్నికలకు మొత్తం 1,37,671 పోలింగ్ స్టేషన్లు ఉంటాయనే అంచనాతో నాలుగు దశల్లో నిర్వహిస్తే 41,301 ఈవీఎం కంట్రోల్ యూనిట్లు, 82,602 బ్యాలెట్ పేపరు యూనిట్లు కొనుగోలు చేయాల్సి ఉంటుందని భావించారు. ఈవీఎంల కొనుగోలుకు రూ.400 కోట్లకు పైగా ఖర్చు అవుతుందనే అంచనాతో 2025 చివర్లో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. దీనిపై 9 నెలలుగా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో.. ఎన్నికల నిర్వహణకు గడువు సమీపించడంతో బ్యాలెట్ విధానంలో ఎన్నికల నిర్వహణకు ముందుకు వెళ్లాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ నిర్ణయించినట్లు సమాచారం.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

అసెంబ్లీలో లోకేష్, సత్యకుమార్...

ఆంధ్రప్రదేశ్ శాసనసభలో తీవ్రమైన రాజకీయ చర్చల...

ఇంటింటికి తెలుగుదేశం క్రేజీ...

ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన...

భోగాపురంలో ల్యాండ్ అయిన...

ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల సాకారమవుతూ...

నోటీసులకు జవాబు ఇవ్వాలి.....

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల...

కృష్ణా జలాల వాటాపై...

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి జలాశయాలైన...

STREE SHAKTI: WOMEN’S...

AMARAVATI*: To mark Stree Sakti...

పోల్స్