దేశ రాజధాని ఢిల్లీలో ఎన్డీయే రాజకీయ సమీకరణాలు మరోసారి ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీయే ప్రభుత్వాన్ని మరింత సమన్వయంతో ముందుకు తీసుకెళ్లేందుకు కూటమిలో కీలక వ్యవస్థను పునరుధ్ధరించే అంశంపై చర్చ జరుగుతున్నట్టు సమాచారం. గతంలో ఎన్డీయేలో అమలులో ఉన్న కన్వీనర్ వ్యవస్థను తిరిగి తీసుకురావాలన్న ఆలోచన తెరపైకి వచ్చింది. ఈ ప్రతిపాదనపై ప్రధాని నరేంద్ర మోదీ సానుకూలంగా ఉన్నట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ సొంతంగా మెజారిటీ మార్క్ దాటలేకపోయింది. దీంతో మిత్రపక్షాల మద్దతుతో కేంద్ర ప్రభుత్వం కొనసాగుతోంది. తెలుగుదేశం పార్టీ, జనతాదళ్ (యునైటెడ్) వంటి భాగస్వామ్య పక్షాలు ఎన్డీయే ప్రభుత్వంలో కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలో మిత్రపక్షాల డిమాండ్లు, కేంద్ర విధానాలు, రాష్ట్రాల ప్రయోజనాల మధ్య సమన్వయం కోసం ప్రత్యేక బాధ్యత కలిగిన నాయకుడి అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Also Read : వైసీపీ నేతల ఓవరాక్షన్.. పోలీసుల రియాక్షన్..!
గత దశాబ్దంలో బీజేపీకి లోక్‌సభలో సొంత మెజారిటీ ఉండటంతో కేంద్ర నిర్ణయాల్లో మిత్రపక్షాలపై ఆధారపడాల్సిన అవసరం తక్కువగా ఉండేది. 2024 తర్వాత పరిస్థితి మారింది. ఇప్పుడు కీలక నిర్ణయాల్లో భాగస్వామ్య పార్టీల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఎన్డీయే కన్వీనర్ వ్యవస్థ పునరుద్ధరణ జరిగితే.. కూటమిలోని పార్టీల మధ్య నిరంతర సమన్వయం, సమాచార మార్పిడి విధానపరమైన చర్చలకు ఒక వ్యవస్థ ఏర్పడే అవకాశం ఉంటుంది.
కన్వీనర్ పదవికి వినిపిస్తున్న పేర్లలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేరు ముందంజలో ఉన్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. దశాబ్దాల రాజకీయ అనుభవంతో పాటు జాతీయ స్థాయిలో వివిధ పార్టీల నేతలతో ఆయనకు ఉన్న సంబంధాలు దీనికి కారణంగా చెబుతున్నారు. గతంలోనూ చంద్రబాబు ఎన్డీయే కన్వీనర్ గా పనిచేశారు. 2013 నుంచి 2018 వరకు ఆయన ఈ బాధ్యతల్లో ఉన్నారు. జాతీయ రాజకీయాల్లో కూటముల నిర్వహణ, ప్రాంతీయ పార్టీలతో చర్చలు, వివిధ రాష్ట్రాల ప్రయోజనాలను సమన్వయం చేయడంలో ఆయనకు ఉన్న అనుభవం ఎన్డీయేకు ఉపయోగపడుతుందని భావిస్తున్న వర్గాలు ఉన్నాయి.
Also Read : జోగి సీటు చిరిగినట్లేనా.. గేట్ క్లోజ్..!
మరోవైపు బిహార్ రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న నితీశ్ కుమార్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఉత్తర భారత రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీలతో సమన్వయం చేసుకోవడంలో ఆయనకు మంచి అనుభవం ఉంది. అయితే బిహార్ రాజకీయాల్లో మారుతున్న పరిణామాలు, ఆయన భవిష్యత్ రాజకీయ పాత్రపై వస్తున్న చర్చలు కన్వీనర్ ఎంపికలో ఎలాంటి ప్రభావం చూపుతాయన్నది ఆసక్తికరంగా మారింది.
ఎన్డీయే కన్వీనర్ బాధ్యత కేవలం కూటమికి ప్రతినిధిగా వ్యవహరించడం మాత్రమే కాదు. మిత్రపక్షాల మధ్య వచ్చే విభేదాలను తొలిదశలోనే చర్చల ద్వారా పరిష్కరించడం, పార్లమెంట్లో కీలక బిల్లుల సమయంలో భాగస్వామ్య పార్టీలను సమన్వయం చేయడం. రాష్ట్రాల సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లడం వంటి బాధ్యతలు కీలకంగా మారనున్నాయి. అదేవిధంగా వివిధ రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల సమయంలో సీట్ల సర్దుబాటు, కూటమి వ్యూహం, మిత్రపక్షాల మధ్య అవగాహన వంటి అంశాల్లోనూ కన్వీనర్ పాత్ర కీలకం కావచ్చు.
Also Read : ఉద్యోగం కావాలా.. పబ్లిక్ సర్వీస్ కమిషన్ బాగోతం..!
కన్వీనర్ వ్యవస్థ పునరుద్ధరణ జరిగితే ఆంధ్రప్రదేశ్, బిహార్ వంటి రాష్ట్రాలకు ప్రత్యేక ప్రాధాన్యం లభించే అవకాశం ఉందన్న చర్చ కూడా ఉంది. రాష్ట్రాలకు రావాల్సిన నిధులు, కేంద్ర ప్రాజెక్టులు, ప్రత్యేక హామీలు, అభివృద్ధి అంశాలను కూటమి వేదికపై బలంగా ప్రస్తావించేందుకు ఈ వ్యవస్థ ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ముఖ్యంగా ఎన్డీయేలో కీలక భాగస్వామిగా ఉన్న టీడీపీకి ఇది రాజకీయంగా ప్రాధాన్యమైన పరిణామంగా మారొచ్చు.
ఎన్డీయే భాగస్వామ్య పక్షాలతో సమన్వయాన్ని మరింత బలోపేతం చేయాలన్న ఆలోచనపై చర్చ జరుగుతున్నప్పటికీ.. కన్వీనర్‌గా ఎవరిని నియమిస్తారన్నది ఇంకా అధికారికంగా తేలాల్సి ఉంది. చంద్రబాబు, నితీశ్ కుమార్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్న నేపథ్యం లో.. ఈ పదవి ఎవరికి దక్కుతుందన్నది ఢిల్లీ రాజకీయాల్లో ఆసక్తికర చర్చగా మారింది. ఎన్డీయేలో మిత్రపక్షాల బలం పెరిగిన నేపథ్యంలో.. కూటమిని నడిపించేందుకు ‘కన్వీనర్’ అవసరం ఎంతవరకు ఉందో.. ఆ బాధ్యత ఎవరికి అప్పగిస్తారో ఇప్పుడు వేచి చూడాల్సిందే.

