టీడీపీ జాతీయ, రాష్ట్ర స్థాయి కమిటీలను రెండు రోజుల క్రితమే ప్రకటించారు. ఇప్పటి వరకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నారా లోకేష్‌కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ప్రమోషన్ లభించింది. దీనిపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ఈ ప్రకటన తర్వాత లోకేష్ పార్టీ అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టడం లాంఛనమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇక రెండు రోజులుగా లోకేష్ పార్టీలోని కింది స్థాయి కార్యకర్తలు మొదలు కీలక నేతలంతా శుభాకాంక్షలు చెబుతున్నారు. పార్టీ గెలుపు కోసం కష్టపడిన లోకేష్‌కు సముచిత స్థానం దక్కిందని అంతా వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఇదే సమయంలో పొలిట్‌బ్యూరో ఎంపికపై మాత్రం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Also Read : పాపం టీడీపీ సర్పంచ్.. న్యాయం జరుగుతుందా..?
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, దివంగత నందమూరి తారక రామారావు హయాం నుంచి టీడీపీ పొలిట్‌బ్యూరోకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇంకా చెప్పాలంటే.. టీడీపీ పొలిట్‌బ్యూరోను చూసే ఇతర పార్టీలు కూడా తమ తమ పొలిట్‌బ్యూరోలను ఎంపిక చేయటం ఆరంభించింది. నాటి పొలిట్‌బ్యూరోలో సీనియర్ నేతలతో పాటు పార్టీ గెలుపు కోసం కష్టపడిన వారికే అవకాశం లభించేది. కానీ ప్రస్తుత పొలిట్‌బ్యూరో మాత్రం అలా కనిపించటం లేదని పొలిటికల్ సర్కిల్‌తో పాటు టీడీపీ అనుకూల మీడియా మిత్రులు కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు.
ఇదేమి టీడీపీ పొలిట్‌బ్యూరో అనే విమర్శలు వినిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో అంటే సీనియర్ నాయకులు సభ్యులుగా ఉండేవారు. ఆ సభ్యులకు కూడా పార్టీ నాయకుల్లో, కార్యకర్తల్లో గౌరవ, మర్యాదలతో పాటు ప్రత్యేక గుర్తింపు ఉండేది. అలాంటి పొలిట్‌బ్యూరోలో మండల స్థాయి నాయకులను నియమించడం ఏమిటనే విమర్శలు వినిపిస్తున్నాయి. నిజానికి పార్టీలో కిందిస్థాయి కార్యకర్త కూడా ఉన్నత పదవులు అధిరోహించేలా కష్టపడాలని గతంలో చంద్రబాబు స్వయంగా పిలుపునిచ్చారు. అలా అని మండల స్థాయి నుంచి నేరుగా పొలిట్‌బ్యూరో స్థాయికి ఎలా తీసుకెళ్తారనేది కొందరు నేతల ప్రశ్న.
Also Read : మహిళా రిజర్వేషన్ చట్టం అమలుపై కేంద్రం కీలక ప్రకటన..!
పొలిట్‌బ్యూరో అంటే.. ఇప్పుడు చాలా మందికి సరైన అవగాహన లేదు అనేది వాస్తవం. పార్టీ కార్యక్రమాలు, విధి విధానాలు, కీలక నిర్ణయాలు తీసుకోవటం అమలు చేయటంతో పాటు పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టో కూర్పు బాధ్యత కూడా పొలిట్‌బ్యూరో నిర్వహిస్తుంది. అధినేతను సైతం ప్రశ్నించే అధికారం ఒక్క పొలిట్‌బ్యూరోకు మాత్రమే ఉంది. అందుకే టీడీపీ పొలిట్‌బ్యూరోకు ఓ ప్రత్యేకత ఉంటుంది. అందుకే పొలిట్‌బ్యూరోలో ఎంపిక అనేది తెలుగుదేశం పార్టీలో అత్యున్నత పదవితో సమానం. పార్టీ అధినేత, కార్యదర్శి తర్వాత స్థానం పొలిట్‌బ్యూరో సభ్యునిదే. అయితే ప్రస్తుత పొలిట్‌బ్యూరో కూర్పుపై కొందరు సీనియర్ నేతలు ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. గతంలో పొలిట్‌బ్యూరో ఉంటే.. ఇప్పుడు మాత్రం పొలిటికల్ బ్యూరో ఉందని ఎద్దేవా చేస్తున్నారు.
తొలి నుంచి పార్టీలోనే కొనసాగుతూ.. పార్టీకి వీర విధేయుడిగా గుర్తింపు తెచ్చుకున్న మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్పను పక్కన పెట్టడంపై అందరూ ఆశ్చర్యపోతున్నారు. గతంలో ఐదేళ్లు హోమ్ మంత్రిగా పని చేసిన చినరాజప్పపై ఎలాంటి అవినీతి ఆరోపణలు రాలేదు. ఆయన పార్టీ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా కూడా పసుపు జెండా వదిలిపెట్టలేదు. అలాంటి వ్యక్తిని కాదని.. పార్టీలు మారుతూ.. అధినేత చంద్రబాబు పైనే బహిరంగంగా విమర్శలు చేసిన జ్యోతుల నెహ్రూకు పొలిట్‌బ్యూరోలో స్థానం కల్పించటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. గతంలో ప్రజారాజ్యం, వైసీపీలో కీలక నేతగా జ్యోతుల నెహ్రూ ఉన్నారు. పైగా ప్రస్తుతం దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య, శవం డోర్ డెలివరీ కేసులో నిందితునిగా ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు స్వయానా మేనమామ కూడా. అనంతబాబును జ్యోతుల నెహ్రూ కాపాడుతున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.
Also Read : మెగా కాంపౌండ్‌పై ఎందుకింత కుట్ర..?
అలాగే ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ధూళిపాళ్ళ నరేంద్రకుమార్‌ను ఎందుకు పక్కన పెట్టారనే విషయం ఎవరికీ అర్థం కావటం లేదు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో నరేంద్ర పై తప్పుడు కేసులు నమోదు చేసి అక్రమంగా జైలులో ఉంచారు. నరేంద్ర ఆధ్వర్యంలో నడుస్తున్న సంగం డెయిరీని సొంతం చేసుకునేందుకు వైసీపీ అధినేత ఎన్నో కుట్రలు చేశారు. కానీ రైతులంతా నరేంద్రకు అండగా నిలిచి సంగం డెయిరీని కాపాడుకున్నారు. అలాంటి ధూళిపాళ్ళను ఎందుకు పొలిట్‌బ్యూరోలోకి తీసుకోలేదనే అంశంపై పార్టీ ముఖ్య నేతలు చర్చించుకుంటున్నారు. యనమల, అచ్చెన్నాయుడు వంటి వారితో పాటు జ్యోతుల నెహ్రూ వంటి వారిని తప్పించి.. చినరాజప్ప, నరేంద్ర వంటి సీనియర్ నేతలకు అవకాశం కల్పించి ఉంటే బాగుండేదనే మాట వినిపిస్తోంది. కానీ అధినేతకు, వర్కింగ్ ప్రెసిడెంట్‌కు ఈ విషయం చెప్పగలిగే ధైర్యం ఏ నేతకు ఉందనేది ఇప్పుడు వినిపిస్తున్న ప్రశ్న.

