ఆంధ్రప్రదేశ్ రాజకీయం స్థానిక సంస్థల ఎన్నికల సమయానికి మరింత వేడెక్కుతోంది. ఈ ఎన్నికల ముంగిట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గట్టి దెబ్బ కొట్టారు. వైసీపీకి చెందిన పలువురు కీలక, సీనియర్ నేతలు జనసేన పార్టీ వైపు క్యూ కడుతున్నారు. ఇందులో భాగంగానే తుని నియోజకవర్గానికి చెందిన కీలక నేత యనమల కృష్ణుడు, రాయలసీమ ప్రాంతంలోని హిందూపురం నియోజకవర్గ సీనియర్ వైసీపీ నేత నవీన్ నిశ్చల్ అధికారికంగా జనసేన పార్టీలో చేరారు.
Also Read : బ్రేకింగ్: కాకినాడ జిల్లాలో వైసీపీ కీలక వికెట్ డౌన్..!
వీరితో పాటు వైసీపీ, కాంగ్రెస్‌లకు చెందిన మరికొందరు ముఖ్య నేతలు కూడా పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన కండువా కప్పుకున్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ స్వయంగా వీరికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఏపీలో రాబోయే లోకల్ బాడీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని జనసేన ఇప్పటికే ప్రత్యేక వ్యూహాలతో ముందుకు సాగుతోంది. ఈ తరుణంలో వివిధ నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయిలో గట్టి పట్టున్న వైసీపీ నేతలను తమ వైపు తిప్పుకోవడం ద్వారా, ఎన్నికల కంటే ముందే వైసీపీని కోలుకోలేని దెబ్బ కొట్టాలనేది జనసేన వ్యూహంగా కనిపిస్తోంది.
Also Read : ఫామ్-6లో చిన్న మార్పు.. ఈసీ కొంప ముంచుతుందా..?
పార్టీలోకి కొత్తగా వచ్చిన నేతలు పాత కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ, జనసేన సిద్ధాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి పార్టీ బలోపేతానికి సమిష్టిగా కృషి చేయాలని పవన్ కళ్యాణ్ దిశా నిర్దేశం చేశారు. ఈ కీలక చేరికల వల్ల అటు గోదావరి జిల్లాల్లోనూ, ఇటు రాయలసీమ ప్రాంతంలోనూ వైసీపీ క్యాడర్ మానసికంగా దెబ్బతినే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మెరుగైన స్థానాలను కైవసం చేసుకునేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వేస్తున్న అడుగులు, క్షేత్రస్థాయిలో ఆ పార్టీకి మరింత మైలేజ్ తెచ్చిపెట్టేలా ఉన్నాయి.

