భారత ఎన్నికల సంఘం కొత్త ఓటర్ల నమోదు కోసం ఉపయోగించే ఆన్లైన్ ఫామ్-6లో చేసిన ఒక చిన్న మార్పు ఇప్పుడు జాతీయ స్థాయిలో తీవ్ర రాజకీయ, చట్టపరమైన దుమారానికి దారితీసింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న ఈ నిర్ణయం ప్రజాస్వామ్యానికే ముప్పుగా మారిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఓట్ల అక్రమ తొలగింపునకు ఈ చిన్న మార్పే కారణమని పేర్కొంటూ కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ సహా విపక్ష ఇండియా కూటమి నేతలు దీనిపై సుప్రీంకోర్టులో సవాలు చేసేందుకు లీగల్ టీమ్‌లతో రంగంలోకి దిగారు.
Also Read : ఎన్నికల కమిషన్‌లో ముదిరిన వివాదం..!
కొత్తగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునే వారు ఆన్లైన్ పోర్టల్‌లో ఫామ్-6 నింపేటప్పుడు.. గతంలో ఉన్న నిబంధనల ప్రకారం తమ పాత నివాస వివరాలు లేదా పాత ఓటు వివరాలను స్వచ్ఛందంగా డిక్లేర్ చేయాల్సి ఉండేది. అయితే, ఈసీ ఇటీవల చేసిన మార్పు ప్రకారం, ఒకవేళ దరఖాస్తుదారుడు తమకు పాత ఓటు లేదని తప్పుడు డిక్లేర్ చేస్తే, అది ప్రజాప్రాతినిధ్య చట్టం 1950 లోని సెక్షన్ 31 ప్రకారం శిక్షార్హమైన నేరంగా మారుతుంది. దీనివల్ల తెలియక తప్పులు చేసిన సాధారణ ఓటర్లు కూడా క్రిమినల్ కేసులను ఎదుర్కోవాల్సి వస్తోందని, వ్యవస్థను భయభ్రాంతులకు గురిచేసేలా ఈ నిబంధన ఉందని విపక్షాలు వాదిస్తున్నాయి.
Also Read : ఫిరాయింపులలో తెలంగాణా వరస్ట్ రికార్డ్..!
ఈ నిర్ణయం కేవలం రాజకీయ పార్టీల మధ్యే కాకుండా, ఎన్నికల సంఘం అంతర్గత వర్గాల్లోనే తీవ్ర విభేదాలకు కారణమైంది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్‌కుమార్ ఏకపక్షంగా తీసుకున్న ఈ నిర్ణయంపై ఇద్దరు తోటి ఎలక్షన్ కమిషనర్లు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. అయినప్పటికీ వారి అభ్యంతరాలను తొక్కిపెట్టి ఈ నిబంధనను అమలు చేయడంతో విపక్షాలకు బలమైన అస్త్రం దొరికినట్లయింది. ఈ నేపథ్యంలోనే, ఈసీ విశ్వసనీయత దెబ్బతిన్నందున వచ్చే ఏడాది జరగబోయే అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయాలని కాంగ్రెస్, ఇతర ప్రాంతీయ పార్టీలు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి.

