భారత రాజకీయాల్లో ప్రజాప్రతినిధుల పార్టీ ఫిరాయింపులపై అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ విడుదల చేసిన తాజా నివేదిక దేశవ్యాప్తంగా ఆసక్తిని రేపుతోంది. 2022 నుంచి 2026 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా జరిగిన రాజకీయ వలసల గణాంకాలను పరిశీలిస్తే.. పార్టీలు మారిన ప్రజాప్రతినిధుల సంఖ్యాపరంగా తెలంగాణ దేశంలోనే మొదటి వరుసలో నిలిచింది. ఓటర్లు ఒక గుర్తుపై గెలిపిస్తే, నేతలు మాత్రం తమ రాజకీయ ప్రయోజనాల కోసం దర్జాగా జెండాలు మార్చేస్తున్నారనే విమర్శలకు ఈ నివేదిక పక్కా ఆధారంగా నిలిచింది.
Also Read : పబ్లిక్‌తో టచ్‌లో లేకపోతే ఎలా..?
ఏడీఆర్ నివేదిక ప్రకారం, గడిచిన నాలుగేళ్లలో దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాల్లో మొత్తం 111 మంది సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ సొంత పార్టీలను వీడి ఇతర పార్టీల కండువాలు కప్పుకున్నారు. ఈ మొత్తం జాబితాలో తెలంగాణ నుంచి ఏకంగా తొమ్మిది మంది ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ గూటికి చేరడం గమనార్హం. స్వల్ప కాలంలోనే ఇంత పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులు పార్టీ మారిన రాష్ట్రాల్లో తెలంగాణ అగ్రస్థానాల్లో ఒకటిగా నిలిచి జాతీయ స్థాయిలో హాట్ టాపిక్‌గా మారింది.
ఈ నివేదికలో మరో షాకింగ్ నిజం ఏంటంటే.. ఈ నాలుగేళ్ల కాలంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నుంచి ఇతర పార్టీల్లోకి ఒక్క ప్రజాప్రతినిధి కూడా వలస వెళ్లలేదు. అయితే ప్రాంతీయ పార్టీల నుంచి బీజేపీలోకి, అలాగే తెలంగాణ వంటి రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల నుంచి కాంగ్రెస్‌లోకి చేరికలు విపరీతంగా జరిగాయి. ఓటర్ల తీర్పును అపహాస్యం చేస్తూ సాగుతున్న ఈ ఫిరాయింపుల రాజకీయం ప్రజాస్వామ్య వ్యవస్థకే ముప్పుగా మారుతోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Also Read : పవన్-రాధా భేటీ వెనుక టీడీపీ మాస్టర్ ప్లాన్..?
ఫిరాయింపుదారుల ఆటకట్టించేందుకు ఏడీఆర్ ఈ నివేదికలో కొన్ని సంచలన సిఫార్సులు చేసింది. పార్టీ మారిన ప్రజాప్రతినిధులపై అనర్హత వేసే పవర్‌ఫుల్ అధికారాన్ని రాజకీయ ఒత్తిళ్లు ఉండే అసెంబ్లీ స్పీకర్లకు కాకుండా, నేరుగా రాష్ట్రాల్లో గవర్నర్లకు, కేంద్రంలో రాష్ట్రపతికి అప్పగించాలని స్పష్టం చేసింది. అంతేకాకుండా, పార్టీ ఫిరాయించిన వారు తదుపరి సాధారణ ఎన్నికలు వచ్చే వరకు ఎలాంటి మంత్రి పదవులు లేదా నామినేటెడ్ పోస్టులు చేపట్టకుండా నిరోధించాలని, వారి కుటుంబ సభ్యుల ఆస్తులపై గట్టి నిఘా ఉంచాలని డిమాండ్ చేసింది.

