భారత ఎన్నికల కమిషన్ అంతర్గత పనితీరుపై ఇటీవల వెలువడిన సంచలన నివేదిక దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ నిర్ణయాలపై తోటి ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధూ, వివేక్ జోషిలు గత 10 నెలల్లో ఏకంగా 14 సార్లు తమ అభ్యంతరాలను రికార్డు చేసినట్లు వెల్లడైంది. ఓటర్ల జాబితాల సవరణ, ఫామ్ 6 మార్పులు, ఓటర్ల డేటా కేంద్రీకరణ వంటి అత్యంత సున్నితమైన అంశాలలో సీఈసీ ఏకపక్షంగా వ్యవహరించారనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో, ఆయన జవాబుదారీతనంపై సర్వత్రా ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
Also Read : రొమాంటిక్ ట్రాప్.. వలలో చిక్కిన లాయర్..!
అయితే, ఈ వివాదంలో కేవలం సీఈసీ జ్ఞానేష్ కుమార్‌ను మాత్రమే బోనులో నిలబెడితే సరిపోదని, మిగిలిన ఇద్దరు ఎన్నికల కమిషనర్లు కూడా తమ బాధ్యత నుండి తప్పించుకోలేరని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తమ అభ్యంతరాలను పదే పదే బేఖాతరు చేస్తున్నప్పుడు, ఆ ఇద్దరు కమిషనర్లు సంస్థ తరఫున నిర్వహించిన ఉమ్మడి ప్రెస్ కాన్ఫరెన్స్‌లలో ఎందుకు పాల్గొన్నారు..? బహిరంగంగా కమిషన్ నిర్ణయాలను ఎందుకు సమర్థించారు..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
రాజ్యాంగబద్ధమైన స్వతంత్ర సంస్థలో భాగమైన వీరు, తమ అంతర్గత సమస్యలపై రాష్ట్రపతిని ఆశ్రయించకుండా ప్రభుత్వ ఎగ్జిక్యూటివ్ అయిన క్యాబినెట్ సెక్రటరీకి లేఖలు రాయడం కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మరోవైపు చట్టప్రకారం ముగ్గురు సభ్యుల కమిషన్‌లో మెజారిటీ నిర్ణయానికే విలువ ఉంటుంది. ఒకవేళ ఇద్దరు కమిషనర్లు ఒకే అభిప్రాయంతో ఉంటే, వారు ఉమ్మడిగా పూర్తి స్థాయి కమిషన్ సమావేశాన్ని ఎందుకు డిమాండ్ చేయలేకపోయారనే ప్రశ్న కూడా వస్తోంది.
Also Read : పబ్లిక్‌తో టచ్‌లో లేకపోతే ఎలా..?
అత్యంత పవర్‌ఫుల్ నిరసన రూపమైన రాజీనామా అస్త్రాన్ని ప్రయోగించకుండా, వ్యవస్థ చట్టవిరుద్ధంగా నడుస్తోందని భావిస్తూనే పదవుల్లో ఎలా కొనసాగారనేది ఇప్పుడు అతిపెద్ద విమర్శ. ఏది ఏమైనప్పటికీ, దేశ ప్రజాస్వామ్య వెన్నెముక లాంటి ఎన్నికల కమిషన్‌లో నెలకొన్న ఈ తీవ్రమైన భేదాభిప్రాయాలపై అటు సీఈసీతో పాటు ఇటు మిగిలిన ఇద్దరు కమిషనర్లు కూడా దేశ ప్రజలకు స్పష్టమైన వివరణ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందనే డిమాండ్ లు వినపడుతున్నాయి.

