ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు టైమ్ అస్సలు బాగున్నట్లు కనిపించటం లేదు. తాడు పట్టుకున్నా సరే.. అది పామై కరుస్తోంది. ప్రస్తుతం వైసీపీ నేతల పరిస్థితి ఇలానే ఉంది. ఏ పని చేసినా సరే.. అది గట్టిగా ఎదురు తగులుతోంది. తాజాగా వైసీపీ అధిష్టానం వేసిన ప్లాన్ గట్టిగానే బెడిసికొట్టింది. మొదట్లో పరిస్థితి అనుకూలం మాదిరిగా కనిపించినా.. తర్వాత మాత్రం ఎదురు తిరుగుతున్నాయి. మొన్న అమరావతి విషయంలో రచ్చ చేసేందుకు ప్రయత్నం చేశారు. కానీ రైతులు ఎదురు తిరగడంతో తోక ముడిచారు. ఆ తర్వాత తల్లికి వందనం పధకంపై అసత్యాలు చెప్పే ప్రయత్నం చేశారు. ఇక సాయికృష్ణ లాకప్ డెత్ మీద నానా యాగి చేశారు. చివరికి అతని తల్లే కేసు విత్ డ్రా చేసుకోవడంతో వైసీపీ నేతలు సైలెంట్ అయ్యారు.
Also Read : పదవి కావాలంటే.. పని చేయాల్సిందే.. బాబు వార్నింగ్..!
తాజాగా మరో కొత్త డ్రామాకు వైసీపీ తెర లేపినట్లు తెలుస్తోంది. ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటింది. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం – జనసేన – భారతీయ జనతా పార్టీలు కూటమిగా ఏర్పడి పోటీ చేశాయి. ఈ ఎన్నికలో కూటమి ఏకంగా 164 సీట్లు గెలిచింది. వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితం అయ్యింది. చివరికి ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. రాబోయే ఎన్నికల్లోనే కాదు.. మరో 15 ఏళ్లు కూటమి పొత్తు కొనసాగుతుందని ఇప్పటికే జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పలుమార్లు ప్రకటించారు. అటు చంద్రబాబు కూడా పవన్ కల్యాణ్‌పై పొగడ్తల జల్లు కురిపిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేష్ కూడా పవనన్న అంటూ ఆప్యాయంగా పలకరిస్తున్నారు.
ఈ పొత్తు ఇలాగే కొనసాగితే వైసీపీ గెలుపు కష్టమని ఇప్పటికే రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానించారు. ఇదే మాట వైసీపీ నేతలతో కూడా పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా అంతర్గత సమావేశాల్లో పలుమార్లు ఇప్పటికే వార్నింగ్ ఇచ్చారు. అందుకే ఆ బంధం విడగొట్టేందుకు ఇప్పుడు వైసీపీ నేతలు కుట్రలు చేస్తున్నారు. ఇందుకు కొత్త ప్లాన్ చేశారు. వైసీపీ అనుకూల వెబ్ మీడియా ద్వారా టీడీపీ – జనసేన మధ్య విభేదాలంటూ తప్పుడు కథనాలు రాయిస్తున్నారు. తాజాగా పవన్ పైన లోకేష్ నిఘా అంటూ ఓ వార్తను వైసీపీ నేతలు బాగా ట్రోల్ చేసేందుకు నానా పాట్లు పడ్డారు. పవన్ ఎవరెవర్ని కలుస్తున్నారు.. ఎవరితో ఏం మాట్లాడుతున్నారనే ప్రతి విషయాన్ని లోకేష్ తెలుసుకుంటున్నారని.. దీనిపై జనసేన నేతలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని కూడా రాసుకొచ్చారు.
Also Read : అంబటికి షాక్ ఇచ్చిన టీడీపీ మహిళా ఎమ్మెల్యే
అయితే దీనిపై ప్రభుత్వం ఘాటుగా స్పందించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫ్యాక్ట్ చెక్ అధికారికంగా వివరణ ఇచ్చింది. “”పవన్ కళ్యాణ్ పై లోకేష్ నిఘా నేత్రం” అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవం. ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దు. ఇలాంటి ఫేక్ వార్తలను షేర్ చేయడం, ప్రచారం చేయడం చట్టరీత్యా నేరం. తప్పుడు ప్రచారం చేస్తున్న మీడియా హాండిల్స్ పై ప్రభుత్వం చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడమైనది.” అంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది. ఇలాంటి తప్పుడు కథనాలు రాసిన వారిపై కఠిన చర్యలుంటాయని కూడా వార్నింగ్ ఇచ్చింది. దీంతో వైసీపీ నేతలు వేసిన ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయ్యింది.

