చిత్తూరు జిల్లా రాజకీయాల్లో మాజీ మంత్రి ఆర్కే రోజా, నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ మధ్య క్వారీల వివాదం తీవ్ర దుమారం రేపుతోంది. నిన్న చెర్లోపల్లి క్వారీ వద్దకు మాజీ మంత్రి రోజా వెళ్లి నిరసన తెలపడంపై ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ ఘాటుగా స్పందించారు. రోజాకు పూర్తిగా మతి భ్రమించినట్లుందని, ఆమె ఏం మాట్లాడుతున్నారో ఆమెకే అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. నిన్న క్వారీ వద్దకు వెళ్లి ఆమె నానా రభస చేయడం కేవలం తన రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి ఆడుతున్న డ్రామాలో భాగమేనని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
Also Read : ఢిల్లీలో మంతనాలు.. తెలంగాణ కాంగ్రెస్‌లో గుబులు..!
ప్రస్తుతం వివాదాస్పదంగా మారిన ఆ క్వారీలకు అనుమతులు ఇచ్చింది రోజా మంత్రిగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలోనేనని ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ ఆధారాలతో సహా ఆరోపించారు. తన స్వహస్తాలతో తానే అనుమతులు ఇప్పించి, ఇప్పుడు అధికారం పోయాక కూటమి ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారం పోయిన తర్వాత మరో మాట చెప్పడం రోజాకు అలవాటుగా మారిందని మండిపడ్డారు. ప్రజా సమస్యలపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే క్వారీల వద్దకు వెళ్లి రాజకీయ రాద్ధాంతం చేయడం ఎందుకని, నేరుగా అధికారులను కలిసి ఎందుకు పరిష్కారం చూపడం లేదని రోజాను నిలదీశారు.
గతంలో మంత్రిగా ఉన్నప్పుడు నియోజకవర్గానికి ఏం చేశారో రోజా ముందుగా ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. ఇదే క్రమంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయాలపై కూడా గాలి భాను ప్రకాష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్ ఉదయం చెప్పిన మాట సాయంత్రానికి, సాయంత్రం చెప్పిన మాట ఉదయానికి మార్చేస్తారని, మాట మార్చడంలో ఆయన దిట్ట అని విమర్శించారు. అందుకే ప్రజల్లో పూర్తిగా విశ్వసనీయత కోల్పోయిన వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ప్రజలు మూలన కూర్చోబెట్టారని ఎద్దేవా చేశారు.
Also Read : రాపిడో, ఓలా, ఉబర్‌ల బాదుడుకు తెలంగాణా ఆర్టీసీ బ్రేక్..!
చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తోందని, నిధులు తీసుకువచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నామని స్పష్టం చేశారు. ఎవరు ప్రజల కోసం పనిచేస్తున్నారో, ఎవరు డ్రామాలు చేస్తున్నారో ప్రజలందరికీ తెలుసని, ఇకనైనా తప్పుడు ఆరోపణలు మానుకుని వాస్తవాలు మాట్లాడాలని రోజాకు గాలి భాను ప్రకాష్ హెచ్చరించారు.

