Thursday, September 3, 2026 09:58 AM
Thursday, September 3, 2026 09:58 AM

మొన్న భోగాపురం.. నిన్న వెలిగొండ.. నేడు ఉత్తరాంధ్రకు పోలవరం జలాలు!

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో కొన్ని రోజులు కేవలం క్యాలెండర్‌లో తేదీలుగా మిగిలిపోవు. భవిష్యత్ దిశను మార్చే మైలురాళ్లుగా నిలిచిపోతాయనడంలో అతిశయోక్తి లేదు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలను పరిశీలిస్తే అలాంటి మైలురాళ్ల పరంపర కనిపిస్తోంది. ఒకవైపు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం.. మరోవైపు దశాబ్దాల కల అయిన వెలిగొండ ప్రాజెక్టు.. ఇప్పుడు ఉత్తరాంధ్ర వైపు కదులుతున్న పోలవరం జలాలు కొత్త దశను.. సరికొత్త దిశను నిర్దేశించాయని చెప్చవచ్చు. ఈ మూడు పరిణామాలను విడివిడిగా చూస్తే అవి మూడు వేర్వేరు ప్రాజెక్టులు. కానీ అభివృద్ధి కోణంలో కలిపి చూస్తే మాత్రం ఒకే పెద్ద కథ కనిపిస్తుంది. రాష్ట్రానికి మౌలిక వసతులు, నీటి భద్రత, పారిశ్రామిక అభివృద్ధి, ప్రాంతీయ సమతుల్యత కల్పించాలన్న లక్ష్యం కనబడుతోంది.

Also Read : కూతురు కోసం బీజేపీ ఎమ్మెల్యే పాట్లు..!

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి గేమ్‌చేంజర్‌గా మారుతుందన్న అంచనాలు చాలాకాలంగా ఉన్నాయి. విమానాశ్రయం అంటే కేవలం విమానాలు వచ్చి వెళ్లే ప్రదేశం కాదు. దాని చుట్టూ హోటళ్లు, లాజిస్టిక్స్, గిడ్డంగులు, పరిశ్రమలు, ఐటీ, వాణిజ్య సంస్థలు, విద్యాసంస్థలు, రియల్‌ ఎస్టేట్‌ వంటి అనేక రంగాలు అభివృద్ధి చెందుతాయి.విశాఖపట్నం ఇప్పటికే ఒక ప్రధాన ఆర్థిక కేంద్రంగా ఉన్న నేపథ్యంలో.. భోగాపురం విమానాశ్రయం విశాఖ–విజయనగరం–శ్రీకాకుళం ప్రాంతాల మధ్య కొత్త ఆర్థిక కారిడార్‌కు బలాన్నిచ్చే అవకాశం ఉంది. అంటే.. విమానాశ్రయం ఒక ప్రాజెక్టు మాత్రమే కాదు. దాని చుట్టూ ఏర్పడే ఆర్థిక వ్యవస్థే అసలు ఫలితంగా చెప్పవచ్చు.

ఇక వెలిగొండ ప్రాజెక్టు విషయానికి వస్తే.. ఇది మరో రకమైన అభివృద్ధి కథ దానిచుట్టూ అల్లుకుంది. వర్షాధారంపై ఆధారపడే ప్రకాశం, నెల్లూరు ప్రాంతాల్లోని వెనుకబడిన ప్రాంతాలకు సాగు, తాగునీటి భద్రత కల్పించాలన్న లక్ష్యంతో వెలిగొండ ప్రాజెక్టు దశాబ్దాలుగా కొనసాగుతోంది. ప్రాజెక్టు ప్రారంభోత్సవంతో ఆ ప్రాంత ప్రజల్లో కొత్త ఆశలు మొదలయ్యాయి. ఒక ప్రాంతానికి రోడ్లు, పరిశ్రమలు ఎంత అవసరమో.. నీరు కూడా అంతే అవసరం. నీరు వస్తే వ్యవసాయం నిలబడుతుంది. వ్యవసాయం నిలబడితే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. ఆర్థిక కార్యకలాపాలు పెరిగితే వలసలు తగ్గే అవకాశం ఉంటుంది. అందుకే వెలిగొండను కేవలం ఒక సాగునీటి ప్రాజెక్టుగా కాకుండా ప్రాంతీయ ఆర్థిక పునరుజ్జీవనానికి ఒక సాధనంగా చూడాల్సి ఉంటుంది.

Also Read : వెలిగొండ.. నీటి పంపకాల గోల..!

ఇప్పుడు ఉత్తరాంధ్ర వైపు గోదావరి జలాలు సరికొత్త శకానికి నాందిగా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా గోదావరి జలాలు ఉత్తరాంధ్ర వైపు ప్రవహించడం మరో కీలక ఘట్టం.ఉత్తరాంధ్రలోని అనేక ప్రాంతాలు ఒకవైపు నీటి వనరుల కొరతను ఎదుర్కొంటూనే ఉన్నాయి. మరోవైపు విశాఖ–అనకాపల్లి పారిశ్రామిక ప్రాంతాలకు భవిష్యత్‌లో భారీ స్థాయిలో నీటి అవసరం పెరగనుంది.ఈ పరిస్థితిలో గోదావరి జలాల తరలింపు కేవలం రైతులకు సాగునీరు అందించే అంశం కాదు. వ్యవసాయం, తాగునీరు, పరిశ్రమలు, పట్టణీకరణ—అన్నింటికీ నీటి భద్రత కల్పించే ప్రయత్నం. ఇక్కడే పోలవరం ప్రాజెక్టు అసలు ప్రాధాన్యత బయటపడుతుంది.ఈ మూడు ప్రధాన ఘట్టాలు చంద్రబాబు సంకల్పానికి నిదర్శనంగా చెప్పవచ్చు.

భోగాపురం విమానాశ్రయం ప్రాంతానికి కనెక్టివిటీని పెంచుతుంది. వెలిగొండ నీటి కొరతతో ఇబ్బంది పడుతున్న ప్రాంతాలకు సాగు, తాగునీటి భరోసాను అందిస్తుంది. పోలవరం జలాలు ఉత్తరాంధ్రలో వ్యవసాయంతో పాటు పారిశ్రామిక, పట్టణ అభివృద్ధికి అవసరమైన నీటి భద్రతను పెంచగలవు. అంటే ఒకటి కనెక్టివిటీ, మరొకటి నీరు, ఇంకొకటి ఆర్థిక వృద్ధికి అవసరమైన మౌలిక వసతులు. ఈ మూడు అంశాలు కలిసినప్పుడే ఒక రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. చంద్రబాబు రాజకీయ ప్రస్థానంలో అభివృద్ధి, మౌలిక వసతులు, నీటి ప్రాజెక్టులకు ప్రత్యేక ప్రాధాన్యత ఉందన్న అభిప్రాయం ఉంది. ముఖ్యంగా పోలవరం విషయంలో ఆయన పదేపదే వ్యక్తం చేసిన లక్ష్యం ఇప్పుడు మరోసారి చర్చకు వస్తోంది. అయితే ఇక్కడ ఒక జాగ్రత్త అవసరం. ఒక ప్రాజెక్టు ప్రారంభం కావడం వేరు.. దాని పూర్తి ప్రయోజనాలు ప్రజలకు అందడం వేరు.

Also Read : కూతురు కోసం బీజేపీ ఎమ్మెల్యే పాట్లు..!

భోగాపురం విమానాశ్రయం చుట్టూ అనుకున్న స్థాయిలో పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు రావాలి. వెలిగొండ నీరు వాస్తవంగా ఆయకట్టుకు చేరాలి. పోలవరం పూర్తి సామర్థ్యంతో పనిచేసే స్థాయికి చేరాలి. అప్పుడే ఈ ప్రాజెక్టుల అసలు ఫలితాన్ని అంచనా వేయగలం. అందువల్ల ఇప్పుడే “చంద్రబాబు సంకల్పం పూర్తిగా నెరవేరింది” అని చెప్పడం కంటే.. “చంద్రబాబు అభివృద్ధి అజెండాలో కీలకమైన కొన్ని మైలురాళ్లు ఇప్పుడు ఆచరణలోకి వస్తున్నాయి” అని చెప్పడం సముచితం. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వాలు మారవచ్చు. రాజకీయ నాయకత్వాలు మారవచ్చు. కానీ నీటి ప్రాజెక్టులు, విమానాశ్రయాలు, రహదారులు, పరిశ్రమలకు అవసరమైన మౌలిక వసతులు తరాల ఆస్తులు. అందుకే భోగాపురం ఎవరి రాజకీయ విజయమన్నది కంటే.. అది ఉత్తరాంధ్రకు ఎంత పెట్టుబడిని తీసుకొస్తుందన్నదే ముఖ్యం. వెలిగొండను ఎవరు ప్రారంభించారన్నది కంటే.. దాని నీరు ఎన్ని ఎకరాలకు చేరుతుందన్నదే ముఖ్యం. పోలవరం ఎవరి ఘనత అన్నదానికంటే.. గోదావరి జలాలు ఎంతమంది రైతుల జీవితాలను మార్చగలవన్నదే అసలు ప్రశ్న.

మొన్న భోగాపురం.. నిన్న వెలిగొండ.. నేడు ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు. ఈ వరుసను కేవలం రాజకీయ విజయాల పరంపరగా చూడటం చిన్న చూపే. అలాగే ఇవన్నీ జరిగిపోయాయని భావించడం కూడా తొందరపాటే.అసలు పరీక్ష ఇప్పుడు మొదలవుతుంది.ప్రాజెక్టులు నిర్మాణాల నుంచి ప్రజల జీవితాల్లో మార్పులుగా మారాలి. విమానాశ్రయం పెట్టుబడులను తీసుకురావాలి. నీరు వ్యవసాయాన్ని బలోపేతం చేయాలి. పరిశ్రమలకు నీటి భద్రత లభించాలి. ఉపాధి అవకాశాలు పెరగాలి. ప్రాంతాల మధ్య అభివృద్ధి అసమానతలు తగ్గాలి.అది జరిగితే మాత్రం.. “సంకల్పం ఉంది” అనే రాజకీయ నినాదం నుంచి “సంకల్పం సాకారమైంది” అనే అభివృద్ధి వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ ప్రయాణం మొదలైనట్టే.ఈ విషయంలో చంద్రబాబు ప్రస్థానం సువర్ణాక్షరాలతో లిఖితం అవుతుందనడంలో అతిశయోక్తి లేదు.

-జి.సత్యనారాయణరాజు

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

రాపిడో, ఓలా, ఉబర్‌ల...

హైదరాబాద్ జంటనగరాల పరిధిలో రాత్రి వేళల్లో...

ఢిల్లీలో మంతనాలు.. తెలంగాణ...

తెలంగాణ కాంగ్రెస్ ఒక్కసారిగా రాజకీయ ఉత్కంఠ...

తెలంగాణా బిజెపిలో ఎంపీల...

రాష్ట్ర బీజేపీలో అగ్రనేతల మధ్య ఆధిపత్య...

నేను రాజీనామా చేయాలంటే...

తెలంగాణ కాంగ్రెస్ పాలిటిక్స్‌లో రేగిన మంత్రి...

ఇకపై నాయకుల కోసం...

జనసేన పార్టీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘జై...

వెలిగొండ.. నీటి పంపకాల...

30 ఏళ్ల కల సాకారమైంది. శ్రీశైలం...

పోల్స్