30 ఏళ్ల కల సాకారమైంది. శ్రీశైలం రిజర్వాయర్ బ్యాక్ వాటర్ నుంచి సొరంగం ద్వారా పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టుకు కృష్ణా జలాలను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. మార్కాపురం సమీపంలో నిర్మించిన నల్లమల సాగర్ రిజర్వాయర్‌కు ఫేజ్ 1 కింద 10 టీఎంసీల నీటిని విడుదల చేశారు. ఏళ్ల తరబడి కరువు ప్రాంతంలో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. సుమారు 2 లక్షల ఎకరాలకు సాగు నీరు, 5 లక్షల మందికి తాగు నీరు అందిస్తున్నారు. ఇప్పటికే కృష్ణా జలాలు నల్లమల సాగర్ రిజర్వాయర్‌కు చేరుకున్నాయి. దీంతో ఈ ప్రాంత రైతులు, ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో నీటి వివాదాలకు భారత రాష్ట్ర సమితి నేతలు తెర లేపారు.
Also Read : మలేరియాపై భారత్ విజయం.. కేంద్రం కీలక ప్రకటన..!
వెలిగొండ ప్రాజెక్టు ద్వారా కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా తరలిస్తుంటే సీఎం రేవంత్ రెడ్డి చోద్యం చూస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్‌రావు తీవ్రంగా విమర్శించారు. ఏపీ అడ్డగో లుగా నీటిని తరలిస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించక పోవడం తెలంగాణ రైతాంగానికి చేస్తున్న తీరని ద్రోహమని ఆరోపించారు. ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా చేసిన పోస్టులో రాష్ట్ర ప్రభుత్వం, కృష్ణా నదీ యాజమాన్య బోర్డు.. కేఆర్ఎంబీ తీరును తప్పుబట్టారు. నీటి కేటాయింపులు లేకపోయినా, జలాలు రాకపోయినా వెలిగొండ ప్రాజెక్టు ద్వారా ఏపీ ప్రభుత్వం బేసిన్ దాటి కృష్ణా జలాలను తరలిస్తోందని హరీష్‌రావు ఆరోపించారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించకపోవడం తెలంగాణకు తీరని ద్రోహమన్నారు. ఒకవైపు ఎల్ నినో ప్రభావంతో తెలంగాణలో సాగునీటి కష్టాలు పెరుగుతున్నాయని, మరోవైపు ఏపీ ప్రభుత్వం తెలంగాణ నీటి హక్కులపై దండెత్తి కృష్ణా జలాలను తరలిస్తోందని విమర్శించారు.
కృష్ణా బేసిన్లో భాగమైన బీమా, కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ ప్రాజెక్టులకు నీరు లేక ఆయకట్టులు ఎండిపోతున్నాయని హరీష్ రావు అన్నారు. తెలంగాణలోని ప్రాజెక్టులకు నీటి కొరత ఉన్న సమయంలో బేసిన్‌తో సంబంధం లేని ప్రాంతాలకు ఏపీ ప్రభుత్వం నిబంధనలు ఉల్లంఘిస్తూ నీటిని తరలిస్తోందని ఆరోపించారు. మాల్యాల, ముచ్చుమర్రి, పోతిరెడ్డిపాడు. నాగార్జునసాగర్ కుడి కాల్వతోపాటు ఇప్పుడు వెలిగొండ నుంచి కూడా నీటిని తరలిస్తున్నారన్నారు. ఈ విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు నోరు మెదపడం లేదన్నారు.
అయితే హరీష్ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమంటున్నారు నీటి పారుదల శాఖ నిపుణులు. అదే సమయంలో హరీష్ రావు ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. నిజానికి వెలిగొండ ప్రాజెక్టు అంటే రాత్రికి రాత్రి పూర్తి చేసిన ప్రాజెక్టు కాదు. ఈ ప్రాజెక్టుకు 1996లోనే చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఇక 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న ప్రభుత్వంలో ప్రస్తుత భారత రాష్ట్ర సమితి.. అప్పట్లో తెలంగాణ రాష్ట్ర సమితి కూడా భాగస్వామి. ఆ పార్టీకి చెందిన నేతలు కూడా మంత్రులుగా ఉన్నారు. జలయజ్ఞం పేరుతో వెలిగొండ ప్రాజెక్టుకు అప్పట్లో భారీగా నిధులు కేటాయించి మంత్రి కూడా తెలంగాణ ప్రాంతానికి చెందిన నేత.
Also Read : కావ్య – కాలభైరవ లవ్ స్టోరీ ఎక్కడ మొదలైంది..?
2005 నుంచి 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా పనులు జరిగాయి. ఇక 2014లో రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణ పనులు కొనసాగాయి. ఈ ప్రాజెక్టు కోసం కూడా కేఆర్ఎంబీలో నీటి కేటాయింపులు జరిగాయి. ఇక 2019లో ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు.. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తెలంగాణలో జల వనరుల శాఖ మంత్రిగా హరీష్ రావు ఉన్నారు. రెండో సొరంగం పనులు జరుగుతున్నప్పటికీ.. హరీష్ అప్పట్లో పల్లెత్తు మాట అనలేదు. వెలిగొండ కోసం అప్పుడు లేని గోల.. ఇప్పుడు ప్రాజెక్టు ప్రారంభించిన తర్వాత.. మాత్రం నీటి పంపకాలు అంటూ వివాదానికి, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేందుకు హరీష్ రావు నానా పాట్లు పడుతున్నారు.

